ENGLISH | TELUGU  

నిన్ను కోరి రివ్యూ - నాని హిట్... డైరెక్టర్?

on Jul 7, 2017

 

ఒక్కొక్క సీజన్ లో ఒక్కో తరహా సినిమాలు బాగా ఆడుతుండటం చూస్తూ ఉంటాం. కానీ... సీజన్ తో పనిలేని కథలు ప్రేమకథలు మాత్రమే. కథలో డెప్త్, ఆత్మ లో కొత్తదనం, కావల్సినంత వినోదం ఉంటే చాలు ప్రేమకథలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపేస్తుంటాయి. గతంలో విడుదలైన పలు ప్రేమకథాచిత్రాలను అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. విషయం లేక బొక్కబోర్లా పడ్డ ప్రేమకథలు కూడా  ఉన్నాయనుకోండీ..! ఏది ఏమైనా ప్రేమకథలు మాత్రం నిర్మాత పాలిటి కల్పతరువులే. ఈ శుక్రవారం ఓ ప్రేమకథ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. ఆ సినిమా పేరు ‘నిన్ను కోరి’. వరుస విజయాలతో ఉన్న నాని ఇందులో కథానాయకుడు అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ స్థాయిలోనే ఉన్నాయి. నివేథా థామస్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషించాడు. శివ నిర్వాణ దర్శకుడు. ఊహించని కాంబినేషన్లో తెరకెక్కిన ఈ ప్రేమకథ... నానీ విజయపరంపరను కొనసాగించిందా? లేక అంచనాలను తల్లకిందులు చేసిందా తెలుసుకోవాలంటే.. ముందు కథలోకెళ్దాం.

కథ:

ఉమ(నాని) చదువుకొని గొప్ప స్థాయిలో నిలదొక్కుకోవాలని తపించే అనాథ. పీహెచ్ డీ చేస్తుంటాడు. తనకు ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. పేరు పల్లవి(నివేథా థామస్). వారి పరిచయం ప్రేమగా మారుతుంది. పల్లవి ఇంటి పెంట్ హౌస్ లోనే ఉమ అద్దెకు దిగుతాడు. వారి జీవితాలు కలర్ ఫుల్ గా సాగుతుంటాయి. పల్లవి తండ్రి(మురళీశర్మ) కూతుళ్ల పెళ్లి విషయంలో కచ్ఛితమైన అభిప్రాయం ఉన్న వ్యక్తి. ప్రస్తుతం ఉమ ఉన్న ఈ పరిస్థితుల్లో తనను ఉమకిచ్చి పెళ్లి చేయడం కల్ల అన్న విషయం పల్లవికి అర్థమవుతుంది. ఓ వైపు కెరీర్ పరంగా ఉమ కోరుకుంటున్న శుభ ఘడియ రానే వస్తుంది. ఒక్క ఏడాది ఆగితే...  తను యోగ్యుడు. కానీ.. పల్లవి మాత్రం అంత సమయం లేదంటుంది. లేచిపోదాం అంటుంది. పల్లవి కోసం కెరీర్ ని కూడా త్యాగం చేయడానికి సిద్ధమవుతాడు ఉమ. కానీ... సరిగ్గా అప్పుడే.. తన కూతుర్ని చేసుకోబోయేవాడు తండ్రినైన తనను కూడా మరపించాలనీ.. అలాంటి అర్హత ఉన్నవాడికే తన కూతుర్ని ఇచ్చి చేస్తానన్న పల్లవి తండ్రి మనోగతం ఉమకు తెలుస్తుంది.

అతను నిర్ణయంలో న్యాయం ఉందని ఉమ కూడా నమ్ముతాడు. అందుకే పల్లవి చెపుతున్నా వినకుండా లక్ష్యసాధన కోసం ఢిల్లీ వెళ్లతాడు. ఏడాది ఆగితే చాలు పల్లవి తండ్రి కోరుకునే అన్ని అర్హతలతో వస్తానన్న నమ్మకం ఉమది. కానీ... ఈ లోపే పల్లవిని అరుణ్(ఆది)తో పెళ్లైపోతుంది. ఏడాది తర్వాత తిరిగొచ్చిన ఉమకు విషయం తెలుస్తుంది. గుండె పగిలిపోతుంది. ఆ బాధ నుంచి బయటపడడానికి అమెరికాలో ఉద్యోగంలో చేరతాడు. కానీ తాగుబోతుగా మారతాడు. ఈ విషయం అమెరికాలోనే ఉంటున్న పల్లవికి తెలుస్తుంది. ‘మనం ఎంత ఆనందంగా ఉంటున్నామో ప్రత్యక్షంగా చూస్తే.. ఉమ మారతాడు’ అని భర్తకు నచ్చచెప్పి.. ఉమను తన ఇంటికి తీసుకొచ్చుకుంటుంది పల్లవి. ఆ తర్వాత ఆ ముగ్గురు లైఫ్ లో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? ఉమ మారాడా? లేక పల్లవే మారిపోయిందా? అసలు ఈ కథకు ముగింపు ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.

ఎనాలసీస్:

నాని సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుందని జనాల నమ్మకం. కానీ ఈ సినిమాలో తక్కువైందే ఎంటర్టైన్మెంట్.  ఫస్టాఫ్ అయితే...మరీ ఓర్పుకు పరీక్ష. సెకండాఫ్ మాత్రం పర్లేదనిపించాడు దర్శకుడు శివ నిర్వాణ. స్లోనేరేషన్ సినిమాకు పెద్ద దెబ్బ. హీరోయిన్ పాత్రలో క్లారిటీ అస్సలు కనిపించదు. పారిపోయేంత ధైర్యం ఉన్న అమ్మాయికి తండ్రికి నచ్చజెప్పి ఓ ఏడాది ఆగేంత నేర్పు లేకుండా పోయిందా అనిపిస్తుంది. పోనీ తండ్రి చెడ్డవాడా అంటే... అదీ కాదు. ద్వీతీయార్థంలో హీరోయిన్ ఇంట్లోకి నాని ఎంటరైనప్పట్నుంచీ వచ్చే సీన్లు మాత్రం సరదాగా సాగాయి. నాని తనదైన చురుకుదనతో జనాల్ని ఆకట్టుకున్నాడు. ప్రేమ విషలమైనంత మాత్రాన జీవితం అయపోయినట్లు కాదు.. ఒకరతోనే జీవితం ఆగిపోదు అనేదే ఈ కథ సారాంశం. దర్శకుడు కథను హృద్యంగా చెప్పే క్రమంలో సినిమాలో వినోదాన్ని మిస్ చేశాడు. మొత్తంగా ఒక వర్గానికి మాత్రమే నచ్చే సినిమా ఇది.

 నటీనటుల ప్రతిభ:

నాని నటన గురించి ప్రత్యేకించి చెప్పేదేమీ లేదు. అతను మంచి నటుడు. ఏ పాత్ర నైనా రక్తికట్టించగల కెపాసిటీ నాని సొంతం. దానికి తగ్గట్టే తన పాత్రను అద్భుతంగా పోషించాడు. నివేథా థామస్ కూడా మంచి నటి. అయితే... ప్రేమకథలకు సరిపోయేంత అందం ఆమెకు లేదనిపిస్తుంది. తన పాత్రకు మాత్రం చక్కగా న్యాయం చేసింది. ఇక ఆది కూడా చాలా స్టైలిష్ పెర్ఫార్మెన్స్త్ తో ఆకట్టుకున్నాడు. ‘భలేభలే మగాడివోయ్’ చిత్రంలో నాని మామగా నటించిన మురళీశర్మ.. ఇందులో కూడా హీరోయిన్ తండ్రిగా నటించాడు. బాగా చేశాడు కూడా. పృధ్వీ పాత్ర పెద్ద చెప్పుదగ్గది కాదు. ఇందులో ఉన్న కాస్త కామెడీ కూడా.. నాని భుజాన వేసుకొని చేసిందే.

సాంకేతిక పనితనం:

కోన వెంకట్  మాటలు ఈ సినిమాకు హైలెట్. నానీ.. ‘నా సక్సెస్ అప్పడే మొదలైంది’ అంటాడు. ‘విజయం అనేది ప్రారంభంలో తెలీదు.. ముగింపులోనే తెలుస్తుది’అని సమాధానమిస్తుంది  హీరోయిన్. ఇలాంటి మంచి డైలాగులు సినిమాలో చాలా ఉన్నాయి. కార్తీక్ ఘట్టమేని కెమెరా పనితనం బాగుంది. ప్రతి స్క్రీన్ లావిష్ గా కనిపించింది. ఇక గోపీసుందర్ కొన్ని పాటల్లో మెరిశాడు. ప్రేమకథలకు నేపథ్య సంగీతమే ప్రాణం. కానీ.. ఇందులో నేపథ్య సంగీతం అంత చెప్పుకోదగ్గట్టుగా  లేదు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఓకే. ఇక దర్శకుడు శివ నిర్వాణ గురించి చెప్పుకుంటే... తను చెప్పాలనుకున్న పాయింట్ గొప్పది.. పాతది కూడా. గతంలో చాలా సినిమాల్లో చెప్పిన పాయింటే. దాన్ని కొత్తగా చెబితే బావుండేది. చాలా సాదాసీదాగా చెప్పాడు. స్క్రీన్ప్ ప్లే విషయంలో జాగ్రత్త తీసుకుంటే బావుండేది.

టోటల్ గా ‘నిన్ను కోరి’... అన్ని వర్గాలు కోరుకునే సినిమా మాత్రం కాదు.

రేటింగ్: 2.25

వైష్ణవి

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.