ENGLISH | TELUGU  

‘నేమర్’ మూవీ రివ్యూ

on Aug 9, 2023

మూవీ: నేమర్
నటీనటులు: మాథ్యూ థామస్,  నస్లెన్ కె. గపూర్, జానీ ఆంటోనీ, షమ్మీ తిలకన్, విజయ రాఘవన్, సజిన్ గోపు, రేష్మీ బోబన్ తదితరులు
ఎడిటింగ్: నౌఫల్ అబ్దుల్లా
సినిమాటోగ్రఫీ: ఆల్బీ
మ్యూజిక్:  షాన్ రెహమాన్, గోపి సుందర్
రచన: సుధీ మాడిసన్, పాల్సన్ స్కారియా
బ్యానర్: వి సినిమాస్ ఇంటర్నేషనల్
నిర్మాత: పద్మ ఉదయ్
దర్శకత్వం: సుధీ మాడిసన్
ఓటిటి: డిస్నీ ప్లస్ హాట్ స్టార్

చిన్న సినిమాలకు థియేటర్లలో ఆదరణ తక్కువే ఉన్నా.. ఓటిటిల్లో వీటికి వీక్షకాధరణ అధికంగా లభిస్తుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన నేమర్ అనే మలయాళం సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ కథేంటో ఒకసారి చూసేద్దాం.


కథ:

ఒక ఊళ్ళో కుంజవ(మాథ్యూ థామస్), సింటో(నస్లెన్ కె. గపూర్) ఇద్దరు మంచి స్నేహితులు. వీళ్ళిద్దరు కలిసి ఆకతాయిగా తిరుగుతూ, గొడవలు పడుతుంటారు. అయితే కుంజవ చేసే పనులతో వాళ్ళ నాన్న ఇబ్బంది పడుతుంటాడు. అయితే కుంజవ ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. కుంజవకు అతడి ఫ్రెండ్ సింటో హెల్ప్ చేస్తాడు. అయితే కుంజవ ప్రేమించిన అమ్మాయికి కుక్కలంటే ఇష్టమని చెప్పి, ఒక ఊరకుక్కని తీసుకొస్తారు. దాని పేరు నేమర్. దానిని కుంజవ తన ఇంటికి తీసుకొని వచ్చిన నుండి అన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. ఆ సమస్యలు భరించలేక కుంజవ వాళ్ళ నాన్న నేనర్ ని దూరంగా తీసుకెళ్ళమని ఒకతడికి ఇచ్చి పంపించేస్తాడు. అయితే కుంజవ అది తెలుసుకొని నేమర్ కోసం తన ఫ్రెండ్ సింటోతో కలిసి అంతా వెతుకుంటాడు. మరి నేమర్ వాళ్ళకి దొరికిందా? నేమర్ తో వచ్చిన సమస్యేంటి? కుంజవ అతడు ప్రేమించిన అమ్మాయిని ఇంప్రెస్ చేశాడా లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

కుంజవ తన ప్రేమించిన అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి నేమర్ అనే కుక్కని తీసుకెళ్ళి పెంచుకుంటాడు. అప్పటిదాకా స్నేహం, కొట్లాట లాంటి చుట్టూ తిరిగే కథ కాస్త.. పెట్ లవర్ యొక్క భావోద్వేగాలను చూపిస్తూ ప్రేక్షకులను కనెక్ట్ చేశాడు డైరెక్టర్. ఎప్పుడైతే నేమర్ కుంజవ లైఫ్ లోకి వస్తుందో అప్పటినుండి దానికోసం ఏదైనా చేస్తా, ఎంత దూరమైనా వెళ్తానని కుంజవ ధైర్యం చేస్తాడు. అయితే కుంజవకు, అతడి ఫ్రెండ్ సింటో చివరివరకు తోడుగా ఉండే సీన్లు ఆకట్టుకుంటాయి.

సినిమా నిడివి కాస్త ఎక్కువగా ఉంది. ఈ కథకి రెండు గంటలే చాలా ఎక్కువనిపిస్తుంది. డాగ్ లవర్స్ కి పెద్దగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఛార్లి లాంటి సినిమా చూసిన వారు.. ఆ అంచనాలతో ఈ సినిమా చూస్తే కచ్చితంగా నచ్చదు. ఏ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే పర్వాలేదనపిస్తుంది. ఈ సినిమాలో పాటలు చాలా నిడివి ఉన్నట్లు అనిపిస్తుంది. కథ ఒక సీరియస్ ఇంటెన్స్ ఉన్నప్పుడు మధ్యలో అసందర్భంగా వచ్చే పాటలు ప్రేక్షకులకు నిరాశని కలిగిస్తాయి. రెండున్నర గంటల సినిమాలో.. ఆరు పాటలు ఉండటం మరీ నెమ్మదనిపిస్తుంది. నేమర్ పాత్ర‌ చుట్టూ తిరిగితే కథ ఇంకా బాగుండేది. కానీ అసలు కథ వదిలేసి అనవసరమైన సీన్ల కోసం బాగా కష్టపడ్డట్టు తెలుస్తుంది. అయితే సినిమా ఫస్టాఫ్ అంతా ఒక ఊరిలో సాగగా, ద్వితీయార్థం పాండిచ్చేరిలో జరిగింది. అయితే అక్కడి ప్రకృతి సోయగాలని చిత్రికరించడంలో సినిమాటోగ్రఫర్ విఫలమయ్యాడు.  

కథ ఫస్టాఫ్ కామెడీ, లవ్ ట్రాక్, ప్యామిలీ ఎమోషన్స్ అన్నీ బాగా కుదిరాయి. కానీ సెకండాఫ్ లో ఎంతసేపు నేమర్ కి ట్రైనింగ్ ఇస్తూ, దానికోసం వెతుకుతూ, ఒక కాంపిటీషన్ గురించి శోధిస్తూ సాగదీసారు. సెకండాఫ్ లో క్లైమాక్స్ లో వచ్చే రెండు, మూడు సీన్లు బాగుంటాయి. మిగతాదంతా చాలా సాధారణంగా ఉంటుంది. అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. ఫ్యామిలీతో కలిసి చూస్తే బాగుంటుంది. అలా అక్కడక్కడా కామెడీతో, చిన్న సస్పెన్స్ తో చివరి వరకు అలా సాగిపోయే ఈ మూవీ పర్వాలేదనిపించింది. ఎడిటింగ్ లో సెకండాఫ్ లో కత్తెరకి పని చెప్పాల్సింది. కానీ వాడలేదు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. పాండిచ్చేరి అందాలని చూపించడంలో సినిమాటోగ్రఫీ విఫలమయ్యాడు. మ్యూజిక్ అంతగా బాగాలేదు. బిజిఎమ్ పెద్దగా ప్రభావం చూపలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

నేమర్ పాత్రలో చేసిన కుక్క యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. నేమర్ కి శిక్షణ ఇచ్చే పాత్రలలో  హీరో కుంజవగా మాథ్యూ థామస్, అతడి ఫ్రెండ్ సింటోగా నస్లెన్ కె. గపూర్ కలిసి బాగా చేశారు. ఇక జానీ ఆంటోనీ, షమ్మీ తిలకన్, చాకోగా విజయ రఘవన్, సజీవ్ గోపు, రేష్మీ బోబన్ వాళ్ళ పాత్ర పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు.

తెలుగువన్ పర్ స్పెక్టివ్:

పెంపుడు జంతువులు విశ్వాసంగా ఉంటాయని చెప్తూ తీసిన ఈ నేమర్.. కాస్త ఓపికగా చూస్తే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేస్తుంది. 

రేటింగ్: 2.75 / 5

✍🏻. దాసరి మల్లేశ్

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.