ENGLISH | TELUGU  

Jack Review: జాక్ మూవీ రివ్యూ

on Apr 10, 2025

 

తారాగణం: సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య, ప్రకాష్ రాజ్, నరేష్, సుబ్బరాజు, బ్రహ్మాజీ తదితరులు
సంగీతం: అచ్చు రాజమణి, సురేష్ బొబ్బిలి
బీజీఎం: సామ్ సి.ఎస్
డీఓపీ: విజయ్ కె. చక్రవర్తి
ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి 
రచన, దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్ 
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ 
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
విడుదల తేదీ: ఏప్రిల్ 10, 2025

 

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో యూత్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న సిద్ధు జొన్నలగడ్డ.. ఇప్పుడు జాక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. భాస్కర్ తన ఇమేజ్ కి భిన్నంగా, యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమాని రూపొందించాడు. మరి ఈ జాక్ మూవీ ఎలా ఉంది? దర్శకుడిగా భాస్కర్ మెప్పించాడా? టిల్లుగా రెండు సినిమాలతో మ్యాజిక్ చేసిన సిద్ధు, జాక్ తో హ్యాట్రిక్ అందుకున్నాడా లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Jack Movie Review)

 

కథ:
పాబ్లో నెరుడా అలియాస్ జాక్(సిద్ధు జొన్నలగడ్డ)కి 'రా' ఏజెంట్ కావాలనేది డ్రీమ్. అందుకోసం చిన్న చిన్న ఆపరేషన్స్ చేస్తూ తనను తాను రా ఏజెంట్ గా మలుచుకుంటూ ఉంటాడు. బాగా ప్రిపేర్ అయ్యి 'రా' ఇంటర్వ్యూకి కూడా వెళ్తాడు. అయితే ఆ ఇంటర్వ్యూ రిజల్ట్ ఏమైందో ఇంకా తెలియకముందే.. ఇండియాకి టెర్రరిస్ట్ ల నుంచి ప్రమాదం పొంచి ఉందని తెలుసుకొని, బటర్ ఫ్లై పేరుతో ఒక సీక్రెట్ ఆపరేషన్ ని మొదలుపెడతాడు. ఆ ఆపరేషన్ ఏంటి? దాని వల్ల జాక్ ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు? జాక్ చేస్తున్న సీక్రెట్ ఆపరేషన్ తెలిసి, 'రా' అతనిపై చర్యలు తీసుకుందా? జాక్ తలపెట్టిన ఆపరేషన్ బటర్ ఫ్లై సక్సెస్ అయిందా? రా ఏజెంట్ కావాలన్న అతని డ్రీమ్ నెరవేరిందా? బేగం అలియాస్ భానుమతి(వైష్ణవి చైతన్య)తో జాక్ ప్రేమకథ ఏంటి? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

 

విశ్లేషణ:
కామెడీ సినిమాలలో లాజిక్ లు ఎవరూ అడగరు. కాసేపు ప్రేక్షకులను నవ్విస్తే చాలు. కానీ సీరియస్ సినిమాలు, అందునా 'రా' లాంటి సబ్జెక్ట్ తీసుకుంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంతో రీసెర్చ్ చేయాలి, లాజిక్స్ ఉండేలా చూసుకోవాలి. కానీ, జాక్ చిత్రంలో అవి కనిపించవు. తన కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసుకోవడం కోసం జాక్ తండ్రి(నరేష్) డిటెక్టివ్ ఏజెన్సీని సంప్రదించే సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ముగింపు వరకు ఎక్కడా సినిమాలో వావ్ అనే మూమెంట్స్ లేవు. జస్ట్ అలా నడుస్తూ ఉంటుంది అంతే. స్పై థ్రిల్లర్స్ అనేవి ఎంతో సీరియస్ గా, నెక్స్ట్ ఏం జరుగుతుందోనన్న ఆసక్తినిని కలిగిస్తూ థ్రిల్లింగ్ గా సాగాలి. కానీ జాక్ లో ఎక్కడా ఆ థ్రిల్ కనిపించదు. రా లాంటి సీరియస్ సబ్జెక్ట్ లోకి టిల్లు లాంటి కామెడీ క్యారెక్టర్ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అక్కడక్కడా సిద్ధు పలికే వన్ లైనర్స్ తప్ప, ఫన్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక హీరో క్యారెక్టర్ ని ఎలివేట్ చేయడం కోసం అన్నట్టుగా రా ఆఫీసర్స్ ని మరీ సిల్లీగా చూపించారు. కొన్ని సీన్స్ అయితే అసలు నిజంగా వాళ్ళని రా ఆఫీసర్స్ అనుకునే సీన్స్ రాశారా? అనే అనుమానం కలగక మానదు. అంత నెట్ వర్క్ ఉన్న రా కూడా కనిపెట్టలేని విషయాలను, జాక్ అనే మామూలు వ్యక్తి ఈజీగా కనిపెడుతూ ఉంటాడు. సీనియర్ మోస్ట్ రా ఆఫీసర్(ప్రకాష్ రాజ్) కూడా ఏం చేయలేక, జాక్ హెల్ప్ తీసుకుంటూ ఉంటాడు. హీరో పాత్రని ఎలివేట్ చేయడం కోసం రాసుకున్న ఈ సీన్స్ అన్నీ సిల్లీగా ఉన్నాయి. స్టోరీలో బలం లేదు. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా లేదు. సీన్స్ ఎఫెక్టివ్ గా లేవు. ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది. మెచ్యూరిటీ లేనివాడు రా ఏజెంట్ గా పనికిరాడు అని. కానీ, ఆ మెచ్యూరిటీ రైటింగ్ లో కనిపించదు. రా గురించి తగినంత రీసెర్చ్ చేయకుండా, మెచ్యూరిటీని పక్కన పెట్టి స్క్రిప్ట్ రెడీ చేసినట్లు అనిపిస్తుంది.

 

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
జాక్ గా సిద్ధు జొన్నలగడ్డ తన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో మరోసారి మ్యాజిక్ చేశాడు. అయితే కొన్ని చోట్ల టిల్లునే కనిపిస్తున్నాడు. ఆ టిల్లు పాత్ర నుంచి బయటకు వచ్చి, సినిమా సినిమాకి నటుడిగా వైవిధ్యం చూపిస్తే బాగుంటుంది. బేగం అలియాస్ భానుమతిగా వైష్ణవి చైతన్య పరవాలేదు. కొన్ని సీన్స్ లో తన పర్ఫామెన్స్ ఆర్టిఫిషియల్ గా అనిపించింది. సిద్ధు, వైష్ణవి మధ్య కెమిస్ట్రీ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. ప్రకాష్ రాజ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పేముంది. తాను పోషించిన రా ఆఫీసర్ పాత్రలో లోపాలున్నా, నటుడిగా మాత్రం ఆయన ఫెయిల్ అవ్వలేదు. హీరో తండ్రిగా నరేష్ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు. సుబ్బరాజు, బ్రహ్మాజీ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.

కథకుడిగా, దర్శకుడిగా బొమ్మరిల్లు భాస్కర్ నిరాశపరిచారు. బొమ్మరిల్లు, పరుగు వంటి మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్స్ ని అందించిన భాస్కర్.. కొత్తగా స్పై థ్రిల్లర్ జానర్ లో సినిమా చేస్తే, అందుకు తగ్గట్టుగా ఎంతో కసరత్తులు చేస్తారని ఆశిస్తాం. మరి కసరత్తులు చేయలేదో, చేసిన కసరత్తులు సరిపోలేదో కానీ.. సినిమా మాత్రం ఆయన లాంటి సీనియర్ దర్శకుడు చేసిన ఫీలింగ్ ఎక్కడా కలగదు. విజయ్ కె. చక్రవర్తి కెమెరా పనితనం ఆకట్టుకుంది. పాటలు తేలిపోయాయి. నేపథ్య సంగీతం కూడా జస్ట్ ఓకే. కథనంలో పట్టు, సన్నివేశాలలో బలం లేకపోవడంతో ఎడిటర్ నవీన్ నూలి కూడా ఏం చేయలేకపోయాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

ఫైనల్ గా..
రా లాంటి సీరియస్ కథలోకి టిల్లు లాంటి కామెడీ క్యారెక్టర్ ఎంటర్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది జాక్. అలా అని ఫన్ పేలలేదు, థ్రిల్ పండలేదు. బొమ్మరిల్లు భాస్కర్ లాంటి సీనియర్ డైరెక్టర్, ఒక సీరియస్ కథని ఇంత సిల్లీగా తీస్తారని అసలు ఊహించలేము.

 

రేటింగ్: 2/5 

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.