'మాయాబజార్ ఫర్ సేల్' వెబ్ సిరీస్ రివ్యూ
on Jul 16, 2023
వెబ్ సిరీస్ పేరు: మాయాబజార్ ఫర్ సేల్
నటీనటులు: ఈషా రెబ్బా, నవదీప్, నరేశ్, ఝాన్సీ, మేయంగ్ చాంగ్, రవి వర్మ, హరితేజ, గౌతమ్ రాజు, రాజు చెంబోలు, అదితి మ్యాకల్ తదితరులు
రచన : గౌతమి చల్లగుల్లా, శ్వేత మంచిరాజు, దాసరి హరిబాబు
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
సినిమాటోగ్రఫీ: నవీన్ యాదవ్
సంగీతం: జెర్రీ సిల్వెస్టర్ విన్సెంట్
నిర్మాతలు: రానా దగ్గుబాటి, ప్రణవ్ పింగ్లే, రాజీవ్ రంజన్
దర్శకత్వం: గౌతమి చల్లగుల్లా
బ్యానర్: స్పిరిట్ మీడియా, మిరాజ్ మీడియా
ఓటిటి: జీ5
కథలో కొత్తదనం ఉంటే.. ఆ సినిమా, సిరీస్ ఏ ఓటిటిలో ఉన్నా ప్రేక్షకులు వెతికి మరీ చూస్తారు. అలాంటి సరికొత్త పాయింట్ తో జీ5 లో తాజాగా విడుదలైన 'మాయాబజార్ ఫర్ సేల్' అనే వెబ్ సిరీస్ గురించి తెలుసుకుందాం.
కథ:
వల్లి(ఈషా రెబ్బా) కి పెళ్ళీడు వస్తుంది. దాంతో వాళ్ళ నాన్న పద్మనాభ శాస్త్రి- పాస్ట్రీ(నరేశ్) వారానికో పెళ్ళి సంబంధం తీసుకొస్తాడు. పాస్ట్రీ వాళ్ళ తమ్ముడు సుబ్బు(గౌతమ్ రాజు) బాగా తాగొచ్చి ఆ పెళ్లిచూపులని పాడుచేస్తుంటాడు. అయితే పాస్ట్రీ వాళ్ళ భార్య కుసుమ కుమారి(ఝాన్సీ), కూతురు వల్లి అందరూ కలిసి 'మాయాబజార్' అనే గేటెడ్ కమ్యూనిటిలో ఒక ఇల్లు తీసుకుంటారు. ఆ కమ్యూనిటీలో రెగ్యులర్ గా గొడవలు జరుగుతుంటాయి. అయితే అక్కడ ఒక నార్త్ అబ్బాయితో వల్లి ప్రేమలో పడుతుంది. దాంతో వల్లి లైఫ్ ఎలా మారింది. మాయాబజార్ అనే గేటెడ్ కమ్యూనిటీలో అసలేం జరిగింది? తెలియాలంటే మిగతా కథ చూడాల్సిందే.
విశ్లేషణ:
పద్మనాభ శాస్త్రి(నరేశ్) వాళ్ళు పేపర్ లో హీరో యూత్ హై స్టార్ అభిజిత్(నవదీప్) ప్రకటన చూసి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లుని తీసుకుంటారు. పెళ్లిచూపులతో మొదలైన కథ, అక్కడి నుండి సరికొత్త మలుపు తీసుకుంటుంది. యూత్ హై స్టార్ అభిజిత్(నవదీప్) పాత్ర ఉన్నంతవరకు కామెడీ బాగా పండింది. అలాగే సుమ వాయిస్ గోమాతకి భళే కుదిరింది. తన పెళ్లి కోసం వాళ్ళ నాన్న పడే కష్టాలని గుర్తించి పెళ్ళిచూపులకి ఎవరొస్తే వారినే చేసుకుందామని వల్లి(ఈషా రెబ్బా) అనుకుంటుంది.
ఈ సిరీస్ లో ప్రతీ ఎపిసోడ్ ప్రత్యేకంగా ఉంటుంది. ఎపిసోడ్ మొదటి నుండి కామెడీని సాగిస్తూ మధ్యలో ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ ని తగిలించారు. అయితే ప్రతీ ఎపిసోడ్ చివరన ఒక ట్విస్ట్ ఉంటుంది. మొదటి రెండు ఎపిసోడ్ లలో 'మాయాబజార్' గేటెడ్ కమ్యూనిటీలోని మనుషులు ఎలా ఉన్నారు, వారిమధ్యలో గొడవలు ఏంటని చూపించడం కాస్త గందరగోళంగా ఉంటుంది.
మూడవ, నాల్గవ ఎపిసోడ్ లలో కొత్త క్యారెక్టర్స్ వస్తూనే ఉంటాయి. సిరీస్ ఇప్పటిదాకా ఒక ఫ్లోలో వెళ్తుందనుకునే ప్రేక్షకుడికి అసలు ఈ కొత్త క్యారెక్టర్స్ ఎందుకొచ్చాయనే డౌట్ వస్తుంటుంది. అయితే వాటిని మనం అర్థం చేసుకునేలోపే అవి మాయమవుతుంటాయి. గౌతమి రాసిన ఈ కథలో ప్రతీ ఎపిసోడ్ లో వచ్చే ట్విస్ట్ బాగున్నప్పటీకీ? ఎవరు ఎందుకు చనిపోతున్నారనే క్లారిటీ లేకపోవడం ప్రేక్షకుడిని ఆలోచనలో పడేలా చేస్తుంది.
మొదటి నుండి ఆరు ఎపిసోడ్ ల వరకు ఒకలా సాగిన ఈ సిరీస్.. చివరి ఎపిసోడ్ లో ఎమోషనల్ సీన్స్ ఉండటంతో వల్లి(ఈషా రెబ్బా) లోని మరొక కోణం ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది. సిరీస్ లో అడల్ట్ సీన్స్ ఏమీ లేకుండా మేకర్స్ జాగ్రత్త పడ్డారు. కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్, ట్విస్ట్ లు అన్నీ కలగలపిన ఎపిసోడ్ లని మలిచిన ఈ 'మాయాబజార్ ఫర్ సేల్' ని ఫ్యామిలీతో కలిసి చూసేలా మలిచారు మేకర్స్.
నవీన్ యాదవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. జెర్రీ సిల్వెస్టర్ విన్సెంట్ ఇచ్చిన సంగీతం పర్వాలేదు. రవితేజ గిరిజాల ఎడిటింగ్ పర్వాలేదు. కొన్ని స్లో సీన్స్ కి కత్తెర వాడాల్సింది. ముఖ్యంగా ఆ పద్మనాభ శాస్త్రి వాళ్ళ తమ్ముడు సుబ్బు పాత్ర యొక్క అనవసరమైన మాటలు కథని డైవర్ట్ చేసేలా ఉన్నాయి.. వాటిని కాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
ఆవుకి యాంకర్ సుమ ఇచ్చిన వాయిస్ వెబ్ సిరీస్ కి ప్లస్ అయింది. సరిత గాంధీగా హరితేజ యాక్టింగ్ బాగుంది. యూత్ హై స్టార్ అభిజిత్ గా నవదీప్ ఉన్నంతవరకు కామెడీ బాగా పండింది. పద్మనాభ శాస్త్రిగా నరేశ్ తన నటనతో ఈ సిరీస్ కి ప్రాణం పోశాడు. వల్లిగా ఇషా రెబ్బా చివరి ఎపిసోడ్ లలో ఎమోషనల్ సీన్స్ లో హావభావాలతో ఆకట్టుకుంది. ఇక ప్రతీ ఒక్కరు వారి వారి పాత్రలలో బాగా నటించారు.
తెలుగువన్ పర్ స్పెక్టివ్:
గేటెట్ కమ్యూనిటీలోని కొందరు వ్యక్తుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. వాటిని వాళ్ళు పరిష్కరించుకునే విధానంలో కామెడీని పంచుతూ సాగే ఈ సిరీస్ ని వీకెండ్ లో ఫ్యామిలీతో కలిసి ఒకసారి చూడొచ్చు.
రేటింగ్: 2.5 / 5
✍🏻. దాసరి మల్లేశ్

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
