ముందు మైత్రిలో... తరవాత నానితో!
on Dec 20, 2018
'లై' పరాజయం తరవాత హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సినిమా 'పడి పడి లేచె మనసు'. 'లై'లో రచయితగా విజయవంతమైన తాను.. దర్శకుడిగా అనుకున్నట్టుగా చిత్రాన్ని తీయలేకపోయానని, ఎక్కడో పొరబాటు జరిగిందని హను రాఘవపూడి అన్నారు. 'పడి పడి లేచె మనసు'ని అనుకున్నట్టు తీశానని, శర్వానంద్‌ని దృష్టిలో పెట్టుకుని కథ రాశానని ఆయన తెలిపారు. సినిమాలో పాత ప్రేమకథను కొత్తగా చెప్పిన విధానం బావుంటుందని హను రాఘవపూడి అన్నారు. 'పడి పడి లేచె మనసు' తరవాత దర్శకత్వం వహించబోయే చిత్రాల గురించి మాట్లాడుతూ "ప్రస్తుతం నాని కోసం ఓ కథ సిద్ధంగా ఉంది. అందులో నాని మిలటరీ అధికారిగా కనిపించాలి. మిలటరీ లుక్ కోసం కొంత సమయం పడుతుంది కనుక.. ఇద్దరికీ వీలు కుదిరినప్పుడు ఆ సినిమా చేస్తాం. వెంటనే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ఓ సినిమా ఉంటుంది" అని హను రాఘవపూడి అన్నారు. తన దగ్గర చాలా కథలు ఉన్నాయని, అయితే ముందు ఓ విజయంతో ప్రేక్షకుల్లో నమ్మకం తెచ్చుకున్న తరవాత సమయం, సందర్భం కుదిరినప్పుడు అవుటాప్ బాక్స్ ఐడియాలతో సినిమాలు చేస్తానని హను రాఘవపూడి అన్నారు.