మహేష్ ని నవ్వించిన బాలయ్య!
on Nov 16, 2022

ఈ ఏడాది ఇప్పటికే సోదరుడు, తల్లిని పోగొట్టుకున్న మహేష్ బాబుకి ఇప్పుడు తండ్రి సూపర్ స్టార్ కృష్ణని కోల్పోవడం తీరని లోటు. ఎప్పుడూ ముఖం మీద చిరునవ్వుతో ఉండే మహేష్ వరుస విషాదాలతో బాగా కృంగిపోయాడు. నిన్నటినుంచి తండ్రి భౌతికకాయం దగ్గర కంటినిండా నీళ్లతో చాలా బాధగా ఉన్నాడు. మహేష్ ని అలా చూసి అభిమానులతో పాటు అందరూ చలించిపోతున్నారు. ఆయన ఈ బాధ నుంచి బయటకు వచ్చి మునుపటిలా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఇంతటి విషాదంలోనూ మహేష్ ముఖం మీద చిరునవ్వు తెప్పించారు నందమూరి బాలకృష్ణ.
మనసులో ఏదీ దాచుకోకుండా మనసుకి అనిపించింది చెప్పడం బాలకృష్ణకు అలవాటు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితోనూ కలిసిపోయే స్వభావం ఆయనది. ఈ ఉదయం పద్మాలయా స్టూడియోస్ లో కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించిన బాలయ్య.. ఆ తర్వాత మహేష్ తోపాటు ఆయన కుమారుడు గౌతమ్ తో ముచ్చటించి వారిని ఆ బాధ నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

బాలయ్య మాటలకు మహేష్, గౌతమ్ చిరునవ్వులు చిందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో మాటలు వినిపించడం లేదు గానీ.. గౌతమ్ చదువుకి సంబంధించిన వివరాలు బాలయ్య అడిగినట్టుగా అనిపిస్తోంది. అలాగే "కృష్ణ గారు అన్నీ సాధించి ఈ లోకాన్ని విడిచారు.. ఆయనను మనం ఆనందంగా సాగనంపాలి" చెప్పినట్టుగా తెలుస్తోంది. బాలయ్య ఏం మాట్లాడారో సరిగ్గా తెలీదు గానీ.. గుండెలనిండా బాధ నింపుకొని ఉన్న మహేష్ ముఖంపై కొన్ని క్షణాల చిరునవ్వుని చూసి అభిమానులు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



