నాగశౌర్య వర్సెస్ కేతికా శర్మ!
on Oct 19, 2021
స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన `లక్ష్య`లో జంటగా నటించారు యంగ్ హీరో నాగశౌర్య, స్టన్నింగ్ బ్యూటీ కేతికా శర్మ. సంతోష్ జాగర్లపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. నవంబర్ 12న థియేటర్స్ లో సందడి చేయనుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. `లక్ష్య`లో జోడీగా ఎంటర్టైన్ చేయనున్న నాగశౌర్య, కేతికా శర్మ.. రెండు వారాల ముందు బాక్సాఫీస్ ముంగిట పోటీగా బరిలోకి దిగుతున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. రీతూ వర్మతో కలిసి నాగశౌర్య నటించిన కుటుంబ కథా చిత్రం `వరుడు కావలెను` ఈ నెల 29న విడుదలకు సిద్ధమవగా.. సరిగ్గా అదే రోజున కేతికా శర్మ నాయికగా నటించిన మొదటి తెలుగు సినిమా `రొమాంటిక్` కూడా రిలీజ్ కాబోతోంది. ఆకాశ్ పూరి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని తొలుత దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల చేయాలనుకున్నారు. అయితే, సూపర్ స్టార్ రజినీకాంత్ `పెద్దన్న` కూడా అదే రోజున వస్తుండడంతో ఒక వారం ముందుగానే ఈ రొమాంటిక్ డ్రామా రిలీజ్ కానుంది. దీంతో.. `లక్ష్య`లో జంటగా నటించిన నాగశౌర్య, కేతికా శర్మ.. రెండు వారాల ముందే `వరుడు కావలెను`, `రొమాంటిక్` చిత్రాలతో పోటీపడే పరిస్థితి నెలకొంది. మరి.. వీరిలో ఎవరిని విజయం వరిస్తుందో చూడాలి.