ఉదయ్ కిరణ్ `మనసంతా నువ్వే`కి 20 ఏళ్ళు!
on Oct 19, 2021

`చిత్రం`, `నువ్వు నేను`తో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఉదయ్ కిరణ్ ని హ్యాట్రిక్ హీరోగా నిలిపిన చిత్రం `మనసంతా నువ్వే`. వి.ఎన్. ఆదిత్యని దర్శకుడిగా పరిచయం చేస్తూ మెగా ప్రొడ్యూసర్ ఎం.ఎస్. రాజు నిర్మించిన ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ కి జంటగా రీమా సేన్ నటించింది. సునీల్, తనూరాయ్, సిజ్జు, చంద్రమోహన్, తనికెళ్ళ భరణి, పరుచూరి వెంకటేశ్వరరావు, సుధ, శిరీష, దేవదాస్ కనకాల, శివారెడ్డి, పావలా శ్యామల, రజిత, మాస్టర్ ఆనంద్ వర్ధన్, బేబి జీబా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించగా.. ప్రముఖ గీత రచయిత `సిరివెన్నెల` సీతారామ శాస్త్రి అతిథి పాత్రలో మెరిశారు. ఎమ్మెస్ రాజు కథను అందించిన ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ అందించిన సంభాషణలు అదనపు బలంగా నిలిచాయి.
ఆర్పీ పట్నాయక్ సంగీతమందించిన ఈ చిత్రంలో పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ``చెప్పవే ప్రేమ``, ``తూనీగ తూనీగ``, ``నీ స్నేహం``, ``ఎవ్వరిని ఎప్పుడు``, ``ఆకాశానా``, ``మనసంతా నువ్వే``, ``కిట కిట తలుపులు``.. ఇలా ఇందులోని గీతాలన్ని యువతరాన్ని రంజింపజేశాయి. హిందీలో `జీనా సిర్ఫ్ మేరా లియే`, కన్నడలో `మనసల్లా నీనే`, తమిళంలో `తితికుడే`, బంగ్లాదేశీలో `మోనెర్ మఝే తుమీ`, ఒడియాలో `నీ జా రే మేఘ మాటే` టైటిల్స్ తో ఈ సినిమా రీమేక్ అయింది. 2001 అక్టోబర్ 19న విడుదలై అఖండ విజయం సాధించిన `మనసంతా నువ్వే`.. నేటితో 20 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



