ఏఎన్నార్ చివరి రోజులను తలచుకొని నాగార్జున ఎమోషనల్!
on Aug 18, 2025

తెలుగు సినీ పరిశ్రమకు రెండు కళ్ళుగా ఎన్టీఆర్, ఏఎన్నార్ లను భావిస్తారు. ఈ ఇద్దరూ నటులుగా ఎంతో సాధించడమే కాకుండా.. తెలుగు సినిమా స్థాయిని పెంచారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ రాణిస్తే.. ఏఎన్నార్ మాత్రం చివరి శ్వాస వరకు నటుడిగానే కొనసాగారు. తాజాగా ఓ షోలో తన తండ్రి ఏఎన్నార్ చివరి రోజులను తలచుకొని నాగార్జున ఎమోషనల్ అయ్యారు.
జగపతి బాబు హోస్ట్ చేస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' షోకి నాగార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన సినీ ప్రయాణంతో పాటు.. తండ్రి ఏఎన్నార్ తో అనుబంధాన్ని, తండ్రి చివరి రోజులను గుర్తు చేసుకున్నారు నాగార్జున.
"నాన్న పరిపూర్ణమైన మనిషి. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఆయనకు కొడుకుగా పుట్టాను. ఎంత సాధించినా కూడా సింపుల్ గా ఉండేవారు. ఎంత గొప్ప వాళ్ళయినా కూడా.. తమకు నచ్చినట్టు బతకడం అంత తేలిక కాదు. కానీ, నాన్నగారు ఎలా బతకాలి అనుకున్నారో.. చివరి వరకు అలాగే బతికారు." అని ఏఎన్నార్ లైఫ్ స్టైల్ గురించి నాగార్జున గొప్పగా చెప్పుకొచ్చారు.
తను నటుడిగా ఎలా మారాడు అనే విషయం గురించి చెబుతూ.. "చిన్న వయసు నుంచి నాన్న గారిని చూస్తూ పెరిగాను కాబట్టి సినిమాలంటే ఆసక్తి ఉండేది. అయితే ఒకసారి సోదరుడు వెంకట్ వచ్చి.. నాగ్ నువ్వు నటుడిగా ట్రై చేయొచ్చు కదా అన్నాడు. దానికి నేను వెంటనే చేద్దాం అన్నాను. కానీ, నాన్న ఏమంటాడో అని చిన్న డౌట్ ఉండేది. నాన్న గారి దగ్గరకు వెళ్ళి ఈ విషయం చెప్పగానే.. ఆయన కళ్ళల్లో నీళ్లు చూశాను. అప్పుడు అర్థమైంది.. ఆయన నన్ను నటుడిగా చూడాలి అనుకుంటున్నారని." అంటూ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు నాగార్జున.
తన సినీ ప్రయాణం మాట్లాడుతూ.. "మొదటి సినిమా విక్రమ్ నాన్న గారి సూచనతో చేశాను. ఏఎన్నార్ కొడుకుగా నన్ను చూడటానికి ప్రేక్షకులు రావడంతో.. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశాను కానీ.. నాకు సంతృప్తి లేదు. ఆ సమయంలో 'గీతాంజలి', 'శివ' సినిమాలు నా మనసుకి నచ్చి చేశాను. ఆ రెండు ఘన విజయం సాధించాయి. ఆ తర్వాత ప్రెసిడెంటు గారి పెళ్ళాం, హలో బ్రదర్ వంటి సినిమాలు నన్ను కొత్తగా ఆవిష్కరించాయి. ఇక అన్నమయ్య సినిమా అయితే.. ఆ దేవుడే నా దగ్గరకు పంపాడు అనుకుంటాను. అన్నమయ్య సినిమా చూసి నాన్నగారు నా చేతులు పట్టుకొని ఎమోషనల్ అయ్యారు. ఆ మూమెంట్ ని ఎప్పటికీ మరిచిపోలేను." అని నాగార్జున అన్నారు.
ఏఎన్నార్ నటించిన చివరి చిత్రం 'మనం'. బెడ్ మీద ఉండే ఆ సినిమా డబ్బింగ్ ను పూర్తి చేశారు ఏఎన్నార్. ఈ విషయాలను కూడా నాగార్జున గుర్తు చేసుకున్నారు. "నాన్న గారు చివరి క్షణాల్లో కనీసం బెడ్ మీద నుంచి లేవలేకపోయారు. ఆయన్ని అలా చూసి తట్టుకోలేకపోయాం." అంటూ నాగార్జున ఎమోషనల్ అయ్యారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



