మోహన్‌లాల్ సినిమా రీమేక్‌లో మెగాస్టార్
on Sep 30, 2019
మలయాళ స్టార్ మోహన్‌లాల్ హీరోగా మరో హీరో పృథ్వీరాజ్ కుమార్ దర్శకత్వం వహించిన సినిమా 'లూసిఫర్'. తెలుగులోనూ విడుదలైంది. సేమ్ టైటిల్ తో డబ్బింగ్ చేశారు. కానీ, అంతగా హిట్ కాలేదు. ఈ సినిమా రీమేక్ రైట్స్ ను మెగాస్టార్ చిరంజీవి సొంతం చేసుకున్నారు. కేరళలో జరిగిన 'సైరా నరసింహారెడ్డి' ప్రచార కార్యక్రమంలో పృథ్వీరాజ్ కుమార్ ఈ సంగతి చెప్పారు. తనను 'సైరా'లో ఓ పాత్ర చేయమని మెగాస్టార్ అడిగినప్పటికీ... చేయలేకపోయినందుకు సారీ చెప్పాడు.
ఆల్రెడీ తెలుగులో విడుదలైన సినిమాను రీమేక్ చేయడం ఎందుకని కొందరికి సందేహం రావొచ్చు. తమిళ హిట్ 'జిగర్తాండ'ను 'చిక్కడు దొరకడు'గా డబ్బింగ్ చేసి తెలుగులో విడుదల చేశారు. అదే సినిమాను వరుణ్ తేజ్ హీరోగా 'గద్దలకొండ గణేష్'గా దర్శకుడు హరీష్ శంకర్ రీమేక్ చేశారు. అంతకు ముందు తెలుగులో 'వీరుడొక్కడే'గా విడుదలైన అజిత్ 'వీరం'ను పవన్ కల్యాణ్ హీరోగా రీమేక్ చేశారు. అదే 'కాటమరాయుడు'. సో... రీమేక్ చేయాలనుకుంటే తెలుగులో విడుదలైందా? లేదా? అనేది పెద్ద విషయం కాదు. 'లూసిఫర్'లో సెకండాఫ్ లో హీరో అనుచరుడిగా పృథ్వీరాజ్ కాసేపు కనిపిస్తారు. తెలుగులోనూ అతడినే నటించమని చిరంజీవి అడగ్గా... ఆ పాత్ర చరణ్ చేస్తే బావుంటుందని సలహా ఇచ్చాడట. నిజానికి 'సైరా'లో రామ్ చరణ్ ఒక పాత్రలో నటిస్తే బావుంటుందని దర్శకుడు సురేందర్ రెడ్డి అనుకున్నారు. చిరంజీవి చేతిలో మరణించే ఈ పాత్ర చరణ్ చేస్తే ఎలా ఉంటుందోనని సందేహించారు. చివరకు, స్క్రిప్ట్ దశలో ఆ పాత్రను ఎడిట్ చేశారు. మరి, ఈ సారైనా తండ్రీకొడుకులు కలిసి నటిస్తారో? లేదో? చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
