కాలి నడకన 700 కిలోమీటర్లు.. చలించిపోయిన సోనూసూద్
on Jun 10, 2021

కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్న ఎందరినో ఆదుకుంటూ రియల్ హీరో అయ్యారు సోనూసూద్. ఆయన చేస్తున్న సేవకు ఎందరో అభిమానులుగా మారుతున్నారు, ఎందరో ఆయన్ని చూసి స్ఫూర్తి పొందుతున్నారు. సోనూసూద్ మంచి మనసుకి అభిమానిగా మారిన ఓ తెలంగాణ యువకుడు.. ఆయనను కలవడానికి ఏకంగా 700 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు.
సోనూసూద్ ను కలవాలన్న లక్ష్యంతో కొన్నిరోజుల క్రితం వికారాబాద్ కు చెందిన వెంకటేష్ అనే యువకుడు కాలి నడకన హైదరాబాద్ నుంచి ముంబైకి బయలుదేరాడు. ‘ది రియల్ హీరో సోనూసూద్.. నా గమ్యం.. నా గెలుపు’ అని రాసి ఉన్న ప్లకార్డు పట్టుకొని కాలి నడకన 700 కిలోమీటర్ల ప్రయాణించి.. ఎట్టకేలకు సోనూసూద్‌ను కలుసుకున్నాడు. చెప్పులు లేకుండా కాలి నడకన తనను చూడటానికి వచ్చిన వెంకటేష్ ను చూసి సోనూసూద్ చలించిపోయారు. ఆ యువకుడి యోగక్షేమాలు అడిగి ఫొటో దిగారు. అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి తెలుసుకుని.. సాయం చేస్తానని హామీఇచ్చారు. అంతేకాదు వెంకటేష్ కోసం ఫ్లైట్ టికెట్ బుక్ చేసి గురువారం రాత్రి విమానంలో హైదరాబాద్ పంపించారు.
వికారాబాద్ యువకుడు వెంకటేష్ పాదయాత్రగా వచ్చి తనని కలిసిన విషయాన్ని సోనూసూద్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ‘‘వెంకటేష్, నన్ను కలిసేందుకు హైదరాబాద్ నుంచి ముంబైకి నడుచుకుంటూ వచ్చాడు. అతడు తిరిగి ఇంటికి చేరుకునేందుకు నేను రవాణా సౌకర్యం ఏర్పాటు చేశాను. అతన్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. కానీ ఇంత ఇబ్బంది పడుతూ రావడాన్ని నేను ఎంకరేజ్ చేయను’’ అని సోనూసూద్ పేర్కొన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



