బోల్తా పడ్డ బ్రహ్మోత్సవం యూఎస్ ప్రీమియర్ కలెక్షన్స్..!
on May 21, 2016
టాలీవుడ్ లో మిగిలిన హీరోలతో పోలిస్తే మహేష్ బాబుకు ఓవర్సీస్ లో మంచి పట్టుంది. సూపర్ స్టార్ సినిమాలన్నీ ఓవర్సీస్ లో కోట్లు కురిపిస్తుంటాయి. అయితే బ్రహ్మోత్సవం మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక, ఓవర్సీస్ ఆడియన్స్ ను కూడా నిరాశ పరిచింది. మొదటి రోజే వచ్చిన నెగటివ్ టాక్ కారణంగా, చాలా ప్రీమియర్ షోలు ఖాళీగా నడిచాయి. సినిమాలో విషయం లేకపోవడం, చెప్పిన దాన్నైనా క్లారిటీగా తీయడంలో విఫలమవడం సినిమా పరాజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ పరాజయం మహేష్ కంచుకోట అయిన ఓవర్సీస్ ను బీటలు తీసింది.
ఇక్కడ యావరేజ్ గా ఆడిన మహేష్ సినిమాలు, ఓవర్సీస్ లో మంచి కలెక్షన్లు కురిపించాయి. అయితే విడుదలకు ముందున్న భారీ అంచనాలను అందుకోవడం బ్రహ్మోత్సవం ఘోరంగా విఫలైమైంది. ఆఖరికి మహేష్ సొంత సినిమా శ్రీమంతుడు సినిమా ప్రీమియర్స్ రికార్డును కూడా టచ్ చేయలేకపోయింది బ్రహ్మోత్సవం. యుఎస్ ప్రీమియర్లలో బ్రహ్మోత్సవం కేవలం 5.57 లక్షల డాలర్లు కలెక్ట్ చేసి నాలుగో ప్లేస్ వరకూ మాత్రమే రాగలిగింది. పవన్ సర్దార్ 6.15 లక్షల డాలర్లతో రెండో స్థానంలో ఉండగా, 5.60 లక్షల డాలర్ల కలెక్షన్లతో శ్రీమంతుడు మూడో స్థానంలో ఉంది. ఇక మిలియన్ డాలర్ మార్క్ దాటిన బాహుబలి టాప్ ప్లేస్ లో ఉంది. ప్రీమియర్ షో కాకుండా తొలి రోజు బాహుబలి వసూళ్లు రెండున్నర లక్షల డాలర్లు దాటవని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఏదేమైనా, సినిమా ఆశించిన అంచనాలను అందుకోవడంలో చాలా ఘోరంగా విఫలమైందనే చెప్పాలి.