ENGLISH | TELUGU  

లవర్స్ డే మూవీ రివ్యూ

on Feb 14, 2019


నటీనటులు: రోషన్, ప్రియా ప్రకాష్ వారియర్, నూరిన్ షెరీఫ్ తదితరులు
కెమెరా: శీను సిద్ధార్థ్
సంగీతం: షాన్ రెహమాన్
సమర్పణ: సీహెచ్ వినోద్ రెడ్డి
నిర్మాత‌: ఏ గురురాజ్
కథ, ద‌ర్శ‌క‌త్వం: ఒమర్ లులు
విడుదల తేదీ: ఫిబ్రవరి 14, 2019

ప్రియా ప్రకాష్ వారియర్ పేరు తెలుగులోనూ పాపులరే. ఒక్కసారి కన్ను గీటి... వలపు ముద్దు బాణం విసిరి... దేశవ్యాప్తంగా ప్రేక్షకులందర్నీ ఫిదా చేసింది. దాంతో మలయాళ 'ఒరు ఆడార్ లవ్' సినిమా 'లవర్స్ డే'గా తెలుగులోకి వచ్చింది. ప్రేమికుల రోజున విడుదలైన ఈ ప్రేమకథా చిత్రం ఎలా ఉందో ఓసారి రివ్యూ చదివి తెలుసుకోండి.

క‌థ‌:

రోషన్ (రోషన్) డాన్ బోస్కోలో ప్లస్ వన్ (ఇంటర్ ఫస్ట్ ఇయర్) జాయిన్ అవుతాడు. ఫస్ట్ డే ప్రియా వారియర్ (ప్రియా ప్రకాష్ వారియర్) ముందు సీనియర్ అని బిల్డప్ కొడతాడు. తరవాత సీనియర్ల చేతికి చిక్కుతాడు. రోష‌న్‌ని సీనియర్లు ర్యాగింగ్ చేస్తుంటే అతణ్ణి గాధా జాన్‌ (నూరిన్ షెరిఫ్‌) సేవ్ చేస్తుంది. అప్పుడు ఇద్దరి మధ్య స్నేహం చిగురిస్తుంది. ప్రియా వారియ‌ర్‌కి రోష‌న్ లైన్ వేస్తుంటే గాధా జాన్ హెల్ప్ చేస్తుంది. క్లాస్‌మేట్‌ కమ్ ఓ ఫ్రెండ్ చేసిన ఓ వెధవ పనికి రోషన్ బలవుతాడు. అతడికి ప్రియా వారియర్ బ్రేకప్ చెప్పేస్తుంది. ఆమె రోషన్ మరొకర్ని ప్రేమిస్తే... ప్రియాకి అసూయ కలిగి మళ్ళీ రోషన్ దగ్గరకి వస్తుందని ప్లాన్ వేస్తారు. రోషన్, గాధా జాన్ ప్రేమించుకున్నట్టు నటిస్తారు. అప్పుడు ప్రియా వారియర్ తిరిగి రోషన్ దగ్గరకి వచ్చిందా? లేదా రోషన్, గాధా జాన్ ప్రేమలో పడ్డారా? చివరకు ఏమైంది? అనేది సినిమా. 


విశ్లేషణ:

ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌కి వ‌చ్చిన క్రేజ్‌, పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని సినిమాను తెలుగులో విడుదల చేశారు కానీ.. ఈ సినిమాలో, కథలో కొత్తదనం ఏమీ లేదు. 'హ్యాపీ డేస్'లో, తరవాత ఆ కోవలో వచ్చిన చాలా సినిమాల్లో చూసిన కథే 'లవర్స్ డే'. 'సొంతం' ఛాయలు సినిమాలో కనిపిస్తాయి. ప్రేమకథా చిత్రాల్లో కథ పాత వాసనలు కొట్టినా... కథనం కొత్తగా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆయా కోవలో చూసినా... ఈ సినిమా కథనంలో కొత్తదనం ఏమీ లేదు. ప్రేక్షకుల ఊహలకు అనుగుణంగా కథ, కథనం సాగుతాయి... ఒక్క క్లైమాక్స్ తప్ప. ముగింపు గురించి చెబితే సినిమా చూడాలనుకునే ప్రేక్షకులు థ్రిల్ మిస్ అవుతారు. బహుశా... నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో ముగింపు రాసుకున్నాడేమో? పతాక సన్నివేశాలను ప్రేక్షకుల ఊహకు భిన్నంగా దర్శకుడు ముగించాడు. ఏదో అడపా దడపా అక్కడక్కడా వచ్చే చిన్న చిన్న లవ్ మూమెంట్స్ తప్ప క్లైమాక్స్ వరకూ సినిమా విసిగిస్తుంది. విసుగు రావడానికి డబ్బింగ్ కూడా ముఖ్య కారణమే. తెరపై కనిపించే క్లాస్ స్టూడెంట్స్‌కి మాస్ డబ్బింగ్ అస్సలు సెట్ కాలేదు. సున్నితంగా చెప్పించాల్సిన డైలాగులను సైతం మొరటుగా పలికి సన్నివేశంలో భావాన్ని చెడగొట్టారు. మలయాళం డైలాగులను గూగుల్ ట్రాన్స్‌లేష‌న్‌ చేశారా? అన్నట్టున్నాయి తెలుగు డైలాగులు. అంత ఘోరంగా రాశారు. ప్రచార చిత్రాల్లో ఉన్న విషయం సినిమాలో లేదు. రెండు మూడు పాటలు, వాటిని చిత్రీకరించిన విధానం బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి. డబ్బింగ్ మీద దృష్టి పెట్టుంటే బావుండేది.

ప్లస్ పాయింట్స్:

ప్రియా ప్రకాష్ వారియర్ క్రేజ్
నూరిన్ షెరీఫ్ అందం, నటన
క్లైమాక్స్
రెండు పాటలు, వాటి చిత్రీకరణ

మైనస్ పాయింట్స్:

కథ, కథనం, దర్శకత్వం
డైలాగులు, డబ్బింగ్

నటీనటుల పనితీరు:

ప్రియా ప్రకాష్ వారియర్ నటన జస్ట్ పర్వాలేదంతే. ఏమంత గొప్పగా లేదు. కన్ను గీటిన.. వలపు బాణం విసిరిన సన్నివేశాలు, మూతి విరుపులు ప్రదర్శించే సన్నివేశాల్లో మినహా... మిగతా సన్నివేశాల్లో ఆమె నటన ఏమంత గొప్పగా లేదు. రోషన్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమే. వీరిద్దరి కంటే నూరిన్ షెరీఫ్ ఎక్కువ మార్కులు కొట్టేసింది. ఆమె హావభావాలు, నటన బావున్నాయి. హీరో హీరోయిన్లకు స్నేహితులుగా నటించిన ప్రతి ఒక్కరూ ఓవర్ యాక్షన్ చేశారు. టీచర్‌కి లైన్ వేసే స్టూడెంట్ అతి భరించలేం. లౌడ్ కామెడీని ఇష్టపడేవాళ్ళకు వాళ్ళ నటన నచ్చుతుందేమో!

చివరగా:

దర్శకుడు ఒమర్ లులు పతాక సన్నివేశాల్లో ప్రేక్షకులకు ఒక బలమైన సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడు. అందుకని, క్లైమాక్స్ ఒక్కటీ బలంగా రాసుకుని, అంతకు ముందు సన్నివేశాలపై అంతగా దృష్టి పెట్టినట్టు లేడు. అలాగని, క్లైమాక్స్‌లో చెప్పాలనుకున్న సందేశాన్ని కూడా సరిగా చెప్పలేదు. ప్రియా ప్రకాష్ వారియర్ కోసం సినిమాకు వెళ్లాలనుకునేవాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాల్సిందే. అయితే... నూరిన్ షెరీఫ్ స‌ర్‌ప్రైజ్ ప్యాకేజ్ కింద ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంటుంది.

రేటింగ్: 1.75/5

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.