ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు.. అందరి కళ్ళు ఆమె పైనే!
on Oct 31, 2022

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు ఏడాది పాటు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా రోజుకొక సినిమా చొప్పున ఆయన నటించిన అన్ని సినిమాలు ఏడాది పాటు తెనాలిలో పెమ్మ సాని(రామకృష్ణ) థియేటర్లో ప్రదర్శింప బడుతున్నాయి. అలాగే ప్రతి నెలా ఎన్టీఆర్ తో పనిచేసిన ఒక లెజెండరీ పర్సన్ కు అవార్డు, గోల్డ్ మెడల్ ప్రధానం చేస్తున్నారు. ఈ నెల ఎన్టీఆర్ పురస్కారాన్ని అలనాటి తార ఎల్. విజయ లక్ష్మి అందుకున్నారు.
బాల నటిగా 'సిపాయి కూతురు' సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమై ఆ తరువాత 'జగదేకవీరుని కథ', 'ఆరాధన', 'గుండమ్మ కథ', 'నర్తన శాల', 'పూజా ఫలం', 'బొబ్బిలి యుద్ధం', 'రాముడు - భీముడు', 'భక్త ప్రహ్లాద' వంటి ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు విజయలక్ష్మి. ఎన్టీఆర్ తో15 సినిమాలకు పైగా తను నటించి సినీ ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచి పోయారు. ముఖ్యంగా అలనాడు అమె సినిమాలో చేసిన నాట్యం ఇప్పటికీ పలువురు ఆదరణ పొందుతూనే ఉంది. ఎప్పుడో పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడిన విజయ లక్ష్మి దాదాపు 50 సంవత్సరాల తర్వాత ఈ అవార్డు స్వీకరించేందుకు తెలుగు గడ్డకి రావడం విశేషం.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా విజయ లక్ష్మికి ఎన్టీఆర్ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణతో పాటు ఆదిశేషగిరి రావు, సురేష్ బాబు, సి.కళ్యాణ్, ప్రసన్న కుమార్, తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. 79 ఏళ్ళ వయసున్న విజయ లక్ష్మి ఇప్పటికీ వన్నె తగ్గని అందంతో అలాగే ఉన్నారు. ఆమె ముఖంలో చిరునవ్వుతో ఎంత కళగా ఉన్నారో, శారీరకంగానూ అంతే ఉత్సాహంగా ఉండటం విశేషం. ఆమె నాట్యమే ఆమెను ఇంత ఆరోగ్యంగా ఉంచిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



