'కల్కి' కథ ఎవరిది? టీమ్ క్లారిటీ!
on Jun 26, 2019

'కల్కి' కథ విషయంలో విడుదలకు వారం ముందు వివాదం తలెత్తింది. కార్తికేయ అనే రచయిత తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘాన్ని, రచయితల సంఘాన్ని ఆశ్రయించారు... కథ తనదేనని! కార్తికేయ కథకు, 'కల్కి' టీమ్ ఇచ్చిన స్క్రిప్ట్‌కు ప్రాధమికంగా ఎలాంటి పోలికలు లేవని దర్శకుల సంఘానికి చెందిన కథాహక్కుల వేదిక కన్వీనర్ బీవీఎస్ రవి తెలిపారు. అయినా సోమవారం సినిమా చూస్తామన్నారు. సోమవారం సినిమా చూశారో? లేదో? కార్తికేయ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అసలు, ప్రారంభం నుంచి కథ ఎవరిదో చెప్పకుండా 'స్క్రిప్ట్ విల్' కంపెనీ స్క్రిప్ట్‌తో సినిమా తెరకెక్కిస్తున్నామని చెప్పుకొచ్చిన 'కల్కి' టీమ్ కథ ఎవరిదో బయటపెట్టింది. "ప్రశాంత్ వర్మకు చెందిన 'స్క్రిప్ట్ విల్' కంపెనీలో పది పదిహేను మంది రచయితలు ఉన్నారు. 'కల్కి'కి సాయి తేజ కథ అందించారు. స్క్రిప్ట్ విల్ కంపెనీ స్క్రీన్ ప్లే డెవలప్ చేసింది" అని జీవితా రాజశేఖర్ తెలిపారు. కథపై తలెత్తిన వివాదాన్ని ప్రస్తావించకుండా పరోక్షంగా స్పష్టత ఇచ్చారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా 'కల్కి' కథారచయిత సాయితేజ అని పేర్కొన్నారు. దీంతో సినిమా విడుదలకు ముందు వివాదం ఓ కొలిక్కి వచ్చినట్టే. 'గరుడవేగ' విజయం తరవాత రాజశేఖర్ హీరోగా నటించిన ఈ 'కల్కి'పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మంగళవారం సినిమా సెన్సార్ పూర్తయింది. గురువారం ప్రీమియర్ షోలతో అమెరికాలో, శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో 'కల్కి' విడుదలవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



