శ్రీలీలకు తల్లిగా కాజల్!
on Jan 26, 2023
కాజల్ అగర్వాల్.. ఈ పేరు దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో కూడా బాగా పాపులర్. 2004వ సంవత్సరంలో క్యూ హో గయానా చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. 2007లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం ఈమె మొదటి తెలుగు చిత్రం. మూడో చిత్రం చందమామతో కృష్ణవంశీ ఈమెను ఎక్కడికో తీసుకొని వెళ్ళాడు. గత 18 ఏళ్లుగా ఈమె సినీ రంగంలో స్టార్ గా కొనసాగుతోంది. కాగా ఈ మధ్య ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఎవడు, గోవిందుడు అందరివాడేలే, టెంపర్, సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 ల తర్వాత నేనే రాజు నేనే మంత్రి తప్పించి వచ్చిన కవచం, మోసగాళ్లు, హే సినామికా చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఈ సమయంలో ఆమె సీనియర్ స్టార్ల సరసన కూడా నటిస్తోంది. ఖైదీ నెంబర్ 150 చిత్రంలో సీనియర్ స్టార్ చిరంజీవితో జోడీ కట్టింది.
ఇక కెరీర్ మొదట్లో ఈమె అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారి పెద్ద పెద్ద స్టార్స్ తో నటించింది. తన అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకుంది. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో కూడా మెప్పించింది. 2020లో అక్టోబర్ 30 వ తారీఖున ప్రముఖ వ్యాపారవేత్త గౌతం కిచ్లూని వివాహం చేసుకోంది. ఆ తరువాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. 2022 ఏప్రిల్ 19వ తేదీన పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కాగా ఇప్పుడు ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని భావిస్తోంది. సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫొటోలతో కుర్ర కారుకు పిచ్చెక్కిస్తోంది. కాగా ఆమె బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న 'ఎన్బీకే 108' చిత్రంలో నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ఈ చిత్రంలో శ్రీ లీల కీలకపాత్రలో నటించబోతోంది. ఆమెకు తల్లి పాత్రలో కాజల్ అగర్వాల్ ని తీసుకోవాలని యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాని గాని ఈ ముద్దుగుమ్మ ఒప్పుకుంటే శ్రీలీల తల్లి పాత్రలో కనిపిస్తుంది.
కాగా ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సాహు గార్లపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ ఫిబ్రవరి 5వ తేదీన మొదలుపెట్టనున్నారు. కామెడీని పండించడంలో దిట్టయిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తూ ఉండడం, అందులో ఇది తెలంగాణ బ్యాక్ గ్రౌండ్ చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను ఉన్నాయి. అందునా వీరసింహారెడ్డి తరువాత బాలయ్య నుండి వస్తున్న చిత్రం కావడంతో ఆ అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి.