జ్యో అచ్చుతానంద మూవీ రివ్యూ..
on Sep 9, 2016

తెలుగు సినిమా అదృష్టమేంటంటే... చెత్త సినిమాలెన్ని వచ్చినా మధ్య మధ్యలో ఓ మంచి సినిమా మెరుస్తుంటుంది. ఫర్లేదురా.. తెలుగులో కూడా అప్పుడప్పుడూ మంచి సినిమాలొస్తుంటాయి అన్న భరోసాని కలిగిస్తుంటుంది. మొన్న పెళ్లి చూపులు సినిమా వచ్చి... మనసుని ఎంత గిలిగింతలు పెట్టి వెళ్లిపోయిందో తెలుసు కదా? అలాగే ఇప్పుడు మరో సినిమా వచ్చింది. అదే... జ్యో అచ్చుతానంద! సినిమా టైటిల్ ఎంత ఆహ్లాదకరంగా ఉందో.. సినిమా కూడా అంతే హాయిగా ఉంది. ఇది గొప్ప సినిమానా, బ్లాక్ బస్టరా, సిల్వర్ జూబ్లీనా... ఇవన్నీ పక్కన పెడితే... చక్కటి తెలుగు సినిమా చూశామన్న ఫీల్ కలుగుతుంది. మరి ఆ ఫీల్ ని దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ఎంత బాగా ఇంజక్ట్ చేశాడో.. తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాలి.
* కథ
అచ్యుత్ (నారా రోహిత్)., ఆనంద్ (నాగశౌర్య) ఇద్దరూ అన్నదమ్ములు. అన్నదమ్ములు అనడం కంటే స్నేహితులు అనడం బెటరేమో? వాళ్ల బంధం చూసి లోకమే కుళ్లుకొనేటంత గొప్పగా ఉంటుంది. వాళ్ల ఇంటి మేడపైకి ఓ కుటుంబం అద్దెకు దిగుతుంది. వాళ్లమ్మాయే.... జ్యో (రెజీనా). జోని చూడగానే అచ్యుత్, ఆనంద్ ఇద్దరూ ఫడేట్ అంటూ ప్రేమలో పడిపోతారు. ఆమె మనసు గెలుచుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తారు. జో ఇద్దరితోనూ బాగానే ఉంటుంది. కానీ ప్రేమించదు. తన మనసులో మరో అబ్బాయి ఉన్నాడని చెప్పి అమెరికా వెళ్లిపోతుంది. కానీ కొన్నాళ్లకు మళ్లీ వచ్చి ఇద్దరికీ ఐ లవ్ యూ చెబుతుంది. కానీ అప్పటికే అచ్చుత్, ఆనంద్‌లకు పెళ్లిళ్లయిపోతాయి. మరి ఆ తరవాత ఏం జరిగింది? జ్యో అమెరికా నుంచి ఎందుకు వచ్చినట్టు? ఈ పెళ్లయినవాళ్లతో జ్యో ప్రేమాయణం ఎలా సాగింది? ఇవన్నీ తెరపై చూడాల్సిందే.
* విశ్లేషణ
ట్రైలర్ చూస్తే ఈ సినిమా కథేంటో సగం చెప్పేయొచ్చు. మిగిలిన సగం.. కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని మిళితం చేసి చెప్పాడు అవసరాల శ్రీనివాస్. మొత్తానికి కథలో గొప్పదనమేం లేదు. ఇద్దరు అబ్బాయిలు ఓ అమ్మాయిని ప్రేమించడం అనే చాలా సింపుల్ పాయింట్‌ని తీసుకొన్నాడు. అయినా ప్రేమించిన అబ్బాయిలిద్దరూ అన్నదమ్ములు కావడం, వీళ్లని వదిలి వెళ్లిపోయిన అమ్మాయి.. మళ్లీ పెళ్లయ్యాక తిరిగి రావడం అనే పాయింట్లు ఈ కథకు కొత్త కలరింగు ఇచ్చాయి. తొలి సగం చాలా సరదాగా సాగిపోతుంది. ఎక్కడా బోర్ కొట్టదు. ఒకే సన్నివేశాన్ని తిప్పి తిప్పి కొట్టినా... చూడాలనే అనిపిస్తుంటుంది. దానికి గల కారణం.. అవసరాల శ్రీనివాస్ స్క్రీన్ ప్లే మహిమ. ఒకే సన్నివేశాన్ని మూడు వెర్షన్లలో చూపించాడు. ఒకే డైలాగ్ మూడు చోట్లా రిపీట్ అవుతుంటుంది. కానీ... బోర్ కొట్టకుండా భలే మానేజ్ చేశాడు. అన్నదమ్ముల మధ్య కోల్డ్ వార్ నడపడం, వాళ్ల మధ్య సంభాషణలు, ఇంట్రవెల్ బ్యాంగ్ ఇవన్నీ రక్తి కట్టాయి. సెకండాఫ్ ఎంత జోవియల్‌గా సాగిందో.. సెకండాఫ్ అంత హార్ట్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. రెజీనా.. రివైంజ్ డ్రామా ఎక్కువగా నడిచినా... అన్నదమ్ముల మధ్య బాండ్‌ని ఎలివేట్ చేయడానికే అవసరాల శ్రద్ద చూపించాడు. అయితే.. ఆ ఎమోషన్ ఎంత బాగా పండినా... ఆ సన్నివేశాలకు బేస్ సరిగా ఇవ్వకపోవడం పెద్ద మైనస్. తొలి సగం లో ఉన్న వేగం ద్వితీయార్థంలో మిస్ అయ్యింది. పంచ్ డైలాగులూ తగ్గాయి. టోటల్ గా ద్వితీయార్థం బాగానే ఉన్నా.. ఫస్టాఫ్ తో పోల్చి చూసుకొంటే ఇబ్బందే. కొన్ని సీన్లు చూస్తుంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు గుర్తొస్తుంది. అయితే అవే సీన్లలో టీవీలో చూపిస్తూ... పాత కథని గుర్తు చేశాడు అవసరాల.
* నటీనటుల ప్రతిభ
నారా రోహిత్, నాగశౌర్యలను దృష్టిలో పెట్టుకొని రాసిన కథ ఇది.. అని అవసరాల ముందే చెప్పాడు. దానికి తగ్గట్టుగానే వాళ్లిద్దరూ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేశారు. అన్నదమ్ములుగా వీరి కెమిస్ట్రీ బాగుంది. కామెడీ టైమింగులోనూ ఇద్దరూ పోటీ పడ్డారు. ఎమోషన్‌సీన్స్ దగ్గర.... రోహితే ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తాడు. రెజీనా అందంగా ఉంది. చాలా బాగా నటించింది. నాని గెస్ట్ రోల్ లో చటుక్కున మెరుస్తాడు
* సాంకేతికంగా...
ఈ సినిమాకి బలం... అవసరాల శ్రీనివాస్. తనలోని రచయితని పూర్తి స్థాయిలో బయటపెట్టాడు. అతని పెన్ను భలే చురుగ్గా కదిలింది. సింగిల్ లైనర్లు బాగా పేలాయి. సింపుల్ కథని ఆసక్తిగా మలచడంలో నూటికి నూరు మార్కులు సంపాదించాడు. భవిష్యత్తులో అతన్నుంచి మరిన్ని మంచి సినిమాలు ఆశించొచ్చు. కల్యాణ్ రమణ సంగీతం వినసొంపుగా ఉంది. టైటిల్ పాట అదిరిపోయింది. చిత్రీకరించిన విధానం కూడా బాగుంది. సెకండాఫ్‌లో ఇంకాస్త వేగం వచ్చుంటే.. ఈసినిమా రేంజు ఇంకోలా ఉండేది. మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. బీసీల దగ్గరే కాస్త డౌటు. వాళ్లూ ఈసినిమాని ఆదరిస్తే... ఈ యేడాది చిన్న సినిమాల ఖాతాలో మరో మంచి విజయం పడిపోయినట్టే.
పంచ్ లైన్ : నవ్వులు గ్యారెంటీ
రేటింగ్: 2.75
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



