త్వరలో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ల 'వివాహం'!
on Sep 19, 2022
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 2గా తెరకెక్కుతోన్న సినిమా 'విద్య వాసుల అహం'(వివాహం). 'తెల్లవారితే గురువారం' ఫేమ్ మణికాంత్ గెల్లి ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ మరియు టైటిల్, యానిమేషన్ కాన్సెప్ట్ వీడియోను వినాయక చవితి కానుకగా విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది.
తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్స్‌ను శివాని రాజశేఖర్ తల్లిదండ్రులైన జీవిత, రాజశేఖర్ సందర్శించారు. షూటింగ్ జరుగుతున్న తీరు, ఈ సినిమా కాన్సెప్ట్ పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమా తన కుమార్తెకే కాకుండా టీమ్ మొత్తానికి విజయవంతమైన చిత్రంగా నిలుస్తుందని, మంచి కంటెంట్‌తో వస్తున్న ఇటువంటి చిత్రాలకు ప్రేక్షకులు ఈ మధ్యకాలంలో బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు.
పెళ్ళైన ఒక జంట మధ్య ఉన్న ఇగోలతో ఈ సినిమా కథాంశం సాగనుంది. కల్యాణి మాలిక్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'విద్య వాసుల అహం'(వివాహం) త్వరలో థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా అఖిల్ వల్లూరి, ఎడిటర్ గా సత్య గిడుటూరి వ్యవహరిస్తున్నారు.