బాబాయ్ చూశాడా? శుద్ధ అబద్ధం!
on Sep 20, 2017
మాటల్లో నిజంగా తాతను మించిపోయాడు తారక్. తాను మాట్లాడుతుంటే... నోళ్లెల్లబెట్టి చూడాల్సిందే. ‘జై లవకుశ’లో ‘జై’ పాత్ర కోసం రావణాసురుడ్ని ప్రేరణగా తీసుకున్నాడట. ఈ విషయాలు చెబుతూ.. రావణుడి లక్షణాలను మీడియా ముందు ఏకరవు పెట్టాడు. ఇంత చిన్న వయసులో ఇంత పరిపక్వాతా? అని అక్కడున్నవారందరూ ఆవాక్కయ్యారంటే నమ్మండి. అంతటి పరిశీలనాత్మక దృష్టి ఉంది కాబట్టే.. అంత హీరో అయ్యాడు బుడ్డోడు.
ఈ సినిమా నిర్మాణం విషయంలో హీరోగానే కాక.. అప్పుడప్పుడు నిర్మాత బాధ్యతల్ని కూడా నిర్వర్తించాల్సొచ్చిందట. అమ్మానాన్నాలు, అభిమానులు మెచ్చే సినిమా అవుతుందని తారక్ నమ్మకంగా చెప్పాడు. రాజమౌళి ‘మహాభారతం’ అంటూ తీస్తే... అందులో తాను తప్పకుండా ఉంటానని చెప్పి అభిమానుల్లో ఆనందాన్ని నింపాడు తారక్. అయితే... తనకు ఏ పాత్ర ఇవ్వాలనేది రాజమౌళి ఇష్టమేననీ.. పైగా... ఆ సినిమాలో అడిగితే చేస్తానని చెప్పాడు తారక్. ఇంకా బాబాయ్ బాలకృష్ణ ‘జై లవకుశ’ చూశాడనే వార్తల్ని ఖండించాడు కూడా. సోషల్ మీడియాకు పనీ పాటా లేదనీ... బాబాయ్ ‘జై లవకుశ’ చూశాడనడం శుద్ధ అబద్ధమనీ తారక్ చెప్పాడు. అంతేకాదు... తన తండ్రి హరికృష్ణ కూడా ఈ సినిమా చూడనేలేదట. సినిమా రిలీజ్ అయ్యాక... కుటుంబ సమేతంగా చూస్తామని తారక్ తెలిపాడు. తాతగారిలా పౌరాణిక పాత్రల్లో నటించాలని ఉందనీ.. అలాంటి కథల్ని హ్యాండిల్ చేయగలిగే దర్శకులుంటే తప్పకుండా చేస్తానని ఎన్టీయార్ అన్నారు. ‘జై లవకుశ’ వంద సినిమాల అనుభవాన్ని మిగిల్చిందని.. తప్పకుండా తమ కష్టానికి తగిన ఫలితం లభిస్తుందనే నమ్మకం ఉందని ఎన్టీయార్ నమ్మకం వెలిబుచ్చాడు.