రకుల్ కొన్నది మెడిసిన్స్... మందు కాదు!
on May 8, 2020
"ఓహ్... వావ్! మెడికల్ షాపుల్లో ఆల్కహాల్ (మందు/లిక్కర్) అమ్ముతున్నారన్న సంగతి నాకు తెలియదులే" అని రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేశారు. నిజం చెప్పాలంటే ట్వీట్ కాదు... స్ట్రాంగ్ కౌంటర్. అసలు వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం రకుల్ ముంబైలో ఉంటున్నారు. అక్కడ పాపరాజీ కల్చర్ ఎక్కువ. సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా ఫోటోలు, వీడియోలు తీస్తారు. రెండు మూడు రోజుల క్రితం అలా తీసిన ఓ వీడియో బయటకు వచ్చింది. అందులో ఏముందంటే... మెడికల్ షాపు నుండి రకుల్ కొన్ని మందులు ఏవో కొనుక్కుని రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నారు.
వీడియోలో మెడికల్ షాప్ క్లారిటీగా లేకపోవడంతో రకుల్ మందు (ఆల్కహాల్) కొనుక్కుని వస్తున్నారని చాలామంది భావించారు. లాక్డౌన్లో రకుల్ ఏం కొన్నది? ఆమె మందు కొన్నదా? అని వీడియో ట్వీట్స్ చేశారు. చాలా కూల్‌గా రకుల్ అటువంటి వాళ్లు అందరికీ కౌంటర్ ఇచ్చారన్నమాట. అదీ సంగతి!