'హోరాహోరీ' యూజర్ రివ్యూ
on Sep 11, 2015
.jpg)
హీరో ఓ పేద కుటుంబానికి చెందిన వాడు. హీరోయిన్ ఓ పెద్దింటి అమ్మాయి. ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఐతే మన హీరోతో ప్రేమలో పడ్డానికి ముందే హీరోయిన్ని ఓ విలన్ లవ్ చేసి ఉంటాడు. అతడి శాడిజం చూసి మతి స్థిమితం తప్పి హీరోయిన్.. హీరో ఉన్న ఊరికి వస్తుందన్నమాట. ఇక్కడ హీరో దయ వల్ల మామూలు మనిషై అతడిప్రేమలో పడుతుంది. ఇంతలో విలన్ అక్కడికి దిగుతాడు. హీరోకు ఫ్రెండవుతాడు. కానీ ఆ తర్వాత తెలుస్తుంది. తను ప్రేమించనమ్మాయినే హీరో ప్రేమించాడు. తర్వాతేముంది. క్లైమాక్సులో ఇద్దరూ కొట్టుకుంటారు. ముందు హీరో తన్నులు తింటాడు. రక్తం కక్కుతాడు. చివరికి తిరిగి విలన్ని కొట్టేసి హీరోయిన్ని సొంతం చేసేసుకుంటాడు. ఇదీ కథ.
ఈ కథ విన్నాక ‘జయం’ సినిమా గుర్తుకు రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి. కొత్త లొకేషన్ కు వెళ్లిపోయి.. పాత్రల తీరుతెన్నుల్ని కొంచెం మార్చేసి.. సినిమాటోగ్రఫీతో, సంగీతంతో మ్యాజిక్ చేయాలని చూసినంత మాత్రాన.. తేజ తనేదో సరికొత్త సినిమా తీశానని అనుకుంటే పొరబాటే. వేరేవాళ్ల గురించి విమర్శలు చేసేముందు తాను ఎలాంటి సినిమా తీశానో, దాన్ని చూసి జనాలు ఎలా ఫీలవుతారో తేజ ఒకసారి సరి చూసుకోవాల్సింది. ‘హోరాహోరీ’ సినిమా చూస్తున్నంతసేపు ఈ తేజకు ‘జయం’ పిచ్చి ఎప్పుడు వదులుతుందిరా బాబూ అనిపించడం ఖాయం.
ఒకే ఫార్ములా కథల్ని చూడటం తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. కానీ కథలో కొత్తదనం లేకపోయినా కథనంతో కనెక్టైతే ప్రేక్షకులకు కంప్లైంట్స్ ఏమీ ఉండవు. దీనికి చాలా ఉదాహరణలున్నాయి. కానీ ‘హోరాహోరీ’లో అలాంటి కథనమే కొరవడింది. సాధారణంగా తేజ సినిమాలు హిట్టయినా, ఫ్లాపైనా రేసీగా ఉంటాయి. కథనంలో ఓ ఉత్కంఠ ఉంటుంది. మలుపులు ఉంటాయి. సీరియస్ నెస్ ఉంటుంది. తేజ చివరి సినిమా ‘నీకు నాకు డ్యాష్’లో కూడా అలాంటి అంశాలున్నాయి. ఐతే ఏదో కొత్తగా ట్రై చేద్దామని తన ప్లస్ పాయింట్లను కూడా వదిలేశాడు తేజ. గంటన్నర సాగే ప్రథమార్ధంలో సన్నివేశాలు ఎంత పేలవంగా ఉన్నాయంటే.. ఇంటర్వెల్ పడేసరికి ఓ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. మతిస్థిమితం తప్పిన హీరోయిన్ మామూలు మనిషి కావడానికి దారితీసిన సన్నివేశాలు చాలా పేలవంగా ఉన్నాయి. విలన్ క్యారెక్టర్ కు మొదట్లో ఇచ్చిన బిల్డప్ చూస్తే.. అతడి క్యారెక్టర్ చాలా ఆసక్తికరంగా సాగబోతుందని ఆశిస్తాం. కానీ ఆ తర్వాత ఆ క్యారెక్టర్ని కామెడీ చేసి పారేసి ప్రేక్షకులకు షాకిచ్చాడు తేజ. సినిమాకు కామెడీ టచ్ ఇచ్చేందుకు అతను చేసిన ప్రయత్నమేదీ ఫలించలేదు.
ద్వితీయార్ధంలో అయినా హీరో, విలన్ మధ్య క్లాస్ మొదలై.. టైటిల్ కు తగ్గట్లు ‘హోరాహోరీ’ సన్నివేశాలేమైనా ఉంటాయేమో అని ఆశిస్తే అదీ జరగదు. విలన్ కు విషయం తెలియనివ్వకుండా ఆ తర్వాత కూడా కథనాన్ని కామెడీగా నడిపించాడు దర్శకుడు. హీరో, విలన్ మధ్య ప్రి క్లైమాక్స్ లో కానీ.. వైరం మొదలవదు. అప్పుడొచ్చే రెండు సన్నివేశాలు మాత్రమే తేజ ముద్రను చూపిస్తాయి. విలన్ హీరోయిన్ తో ఫొటో తీయించుకుని హీరోకు ఫ్లెక్సీ ఆర్డర్ ఇవ్వడం.. అతను పొద్దున విలన్ కు షాకిచ్చే ‘పోస్టర్’ ప్రింట్ చేయడం ఆసక్తి రేపుతాయి. ఐతే క్లైమాక్స్ లో మళ్లీ యధావిధిగా జయం ఫార్మాట్లో విలన్, హీరో మధ్య ఫైట్ పెట్టి సినిమాను ముగించాడు తేజ.
తేజ గత సినిమాల్లో లాగా నటీనటులు బలమైన ముద్ర వేయలేకపోయారు. అందర్లోకి విలన్ గా చేసిన కన్నడ నటుడు చస్వా బెటర్ అనిపిస్తాడు. తన క్యారెక్టర్ లో ఇంటెన్సిటీ చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు కానీ.. చస్వా మాత్రం తాను నటించగలనని కొన్ని సన్నివేశాల్లో చూపించాడు. ఐతే చాలా సన్నివేశాల్లో తమాషాగా మార్చేయడం వల్ల అతడి క్యారెక్టర్ సిల్లీగా తయారైంది. హీరో హీరోయిన్లు దిలీప్ దక్ష పర్వాలేదు. ఇద్దరూ గ్లామర్ విషయంలో చాలా వీక్. కళ్యాణి మాలిక్ పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. అతను సినిమాను నిలబెట్టడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. దీపక్ భగవంత్ ఛాయాగ్రహణం కూడా బాగుంది. కర్ణాటకలోని అందమైన రెయినీ లొకేషన్స్ లో సన్నివేశాలు, పాటల్ని బాగా చిత్రీకరించాడు. నిర్మాణ విలువలు పర్వాలేదు. కథాకథనాలు మాటల విషయంలో తేజ ఇంకా జయం సినిమాలోనే ఇరుక్కుపోయాడు. కొత్తదనం కొత్తదనం అన్నాడు కానీ.. అదేమీ సినిమాలో కనిపించలేదు. సో ‘హోరాహోరీ’ కోసం ‘హోరాహోరీ’గా ధియేటర్లకు వెళ్ళితే తీవ్ర నిరాశ తప్పదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



