ఏపీ మంత్రులకు హీరో సిద్ధార్థ్ చురకలు!
on Dec 24, 2021

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సినీ అభిమానుల నుంచి సినీ ప్రముఖుల వరకు దాదాపు అందరూ తప్పుబడుతున్నారు. సామాన్యుల కోసం సినిమా టికెట్ ధరలను తగ్గించమని చెబుతున్న ప్రభుత్వం.. ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర ధరలు తగ్గించడంలో ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదని పలువురు ప్రశిస్తున్నారు. సినిమా అనేది వినోదమని, నచ్చిన వాళ్ళు చూస్తారని.. దాని మీద ప్రభుత్వం పెత్తనం చేయాలని చూడటం సరికాదని కొందరు మండిపడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ కల్యాణ మండపాలుగా మారిపోతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
'శ్యామ్ సింగ రాయ్' సినిమాతో తాజాగా ప్రేక్షకులను పలకరించిన నేచురల్ స్టార్ నాని కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. టికెట్ ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందని కాదని, ప్రభుత్వం టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించిందని అన్నాడు. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్ ఎక్కువగా ఉందని నాని అసహనం వ్యక్తం చేశారు.
నాని వ్యాఖ్యలపై పలువురు ఏపీ మంత్రులు విరుచుకుపడ్డారు. మీ ఇష్టం వచ్చినట్లు టికెట్లు రేట్లు పెంచితే ప్రభుత్వం చూస్తూ ఉండాలా అని మండిపడ్డారు. హీరోలు కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఆ భారాన్ని ప్రజలపై మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఖర్చు తగ్గించుకోవాలని హితవు పలికారు.

ఏపీ మంత్రుల వ్యాఖ్యలకు హీరో సిద్ధార్థ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. "సినిమా ఖర్చు తగ్గించుకుని, కస్టమర్లకు డిస్కౌంట్లు ఇవ్వాలని కొందరు మంత్రులు మాట్లాడుతున్నారు. మేము ట్యాక్స్ పేయర్స్.. మీ లగ్జరీల కోసం మేం పన్నులు కడుతున్నాం. రాజకీయ నాయకులు అవినీతి చేసి లక్షల కోట్లు సంపాదించారు. మీ లగ్జరీలను తగ్గించుకుని, మాకు డిస్కౌంట్ ఇవ్వండి" అంటూ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



