ఎంతో ప్రతిభ ఉన్న దర్శకుడిపై దుష్ప్రచారమా?
on Dec 23, 2022

కొండంత కష్టం కంటే గోరంత అదృష్టం ఉండాలని మన పెద్దలు అంటారు. అది చాలా విషయాల్లో నిరూపితం అవుతూనే ఉంటుంది. ఇక తెలుగు సినిమా రంగానికి వస్తే.. తమ కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా చేయకపోయినా, ఎన్నో ఫ్లాప్ లు ఇచ్చినా ఇప్పటికీ అవకాశాలు అందిపుచ్చుకుంటున్న దర్శకులు ఎందరో ఉన్నారు. వారికి కష్టం, ప్రతిభ కంటే.. అదృష్టమే కలిసొస్తుందని చెప్పొచ్చు. అదే సమయంలో ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ అవకాశాలు రాని దర్శకుల్లో చంద్రశేఖర్ ఏలేటి, నీలకంఠ, హను రాఘవపూడి, దేవకట్టా వంటి వారిని చేర్చవచ్చు.
ఒక విధంగా చంద్రశేఖర్ ఏలేటి దేశం గర్వించదగ్గ దర్శకుడు. ఐతే, అనుకోకుండా ఒక రోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం, మనమంతా వంటి చిత్రాలు తీశాడు. మరోవైపు నీలకంఠ కూడా ప్రియాంక, షో, మిస్సమ్మ, సదా మీ సేవలో, నందనవనం 120 కిలోమీటర్లు, మిస్టర్ మేధావి వంటి చిత్రాలను తీశాడు. ఇక చంద్రశేఖర్ యేలేటి ప్రియ శిష్యుడు హను రాఘవపూడిది కూడా అదే బాపత్తు. చంద్రశేఖర్ ఏలేటి దగ్గర ఐతే, ఒక్కడున్నాడు చిత్రాలకు అసిస్టెంట్ గా పని చేసి, అనుకోకుండా ఒక రోజు సినిమాకు అసోసియేట్‌గా పనిచేశాడు. 2012లో అందాల రాక్షసి సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, లై, పడి పడి లేచే మనసు చిత్రాలు తీసిన ఆయన తాజాగా సీతారామం చిత్రంతో మంచి హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈయన తీసే చిత్రాలకు సెకండ్ హాఫ్ సరిగా లేకపోవడం వల్లనే సినిమాలు ఆడటం లేదని కొందరు విమర్శిస్తారు. దీంతో హను రాఘవపూడిపై ఒక నెగటివ్ ముద్ర పడిపోయింది. అతడిని హాఫ్ డైరెక్టర్ అంటూ ట్రోలింగ్ చేసేవారు. నెటిజన్లు ఇలా కామెంట్ చేయడం వేరు....కానీ ఇండస్ట్రీ జనాలు కూడా వ్యతిరేక ప్రచారం చేయడం అంటే అది బాధాకరమనే చెప్పాలి. తనకు ఇదే అనుభవం ఎదురయిందని వాపోయాడు హను. ఆయన సీతారామం కంటే ముందు తన గురించి ఇండస్ట్రీలో కొందరు తప్పుడు ప్రచారం చేశారని తన ఆవేదన వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు. నేను కథ బాగా చెప్తాను... కానీ బాగా తీయలేనని టాక్ వచ్చింది. అలాంటి ప్రచారం ఎందుకు వచ్చిందో తెలియదు. నన్ను నమ్మకూడదు అని అన్నారట. నమ్మొద్దు అంటే ఏ విషయంలో నమ్మకూడదు? కథ బాగా రాయలేనా? దర్శకత్వం చేయలేనా? అనేది నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నా గురించి ఎందుకు ఇలా అనుకుంటున్నారో... ఎందుకు అలా ప్రచారం చేశారో నాకు తెలుసు. వారెవ్వరో కూడా ఖచ్చితంగా నాకు తెలుసు. ఈసారి వాళ్లను కలిసినప్పుడు ఎందుకు నా గురించి అలా చెప్పారని కచ్చితంగా అడుగుతాను... అన్నాడు. తనకు వ్యతిరేకంగా మాట్లాడే వారెవరు అనేది మాత్రం హను రాఘవపూడి బయట పెట్టలేదు. ప్రస్తుతం ఆయనకు బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. కానీ ఆయన తెలుగు సినిమాలే చేయాలనుకుంటున్నాడు. ఇక తన నుంచి సీతారామంని మించిన చిత్రాలు వస్తాయి అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



