ENGLISH | TELUGU  

గౌతమ్ నంద రివ్యూ... రోటీన్ మాస్ సినిమా

on Jul 28, 2017

సినిమా: గౌతమ్ నంద
తారాగణం: గోపిచంద్, హన్సిక, కేథరిన్, ముఖేష్ రుషి... తదితరులు..
దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాతలుఐ: జె.భగవాన్, జె. పుల్లారావు
బ్యానర్: శ్రీబాలాజీ సినీ మీడియా

 

సినిమా చూసేటప్పుడూ.. కథ కొత్తదా? పాతదా? అని చూడ్డం వేస్ట్. ఎందుకంటే...ఇప్పటికి కొన్ని వేల కథలు వెండితెరపై ఆడి వెళ్లాయి. మరి ఇంకా కొత్త కథలంటే ఎక్కడ్నుంచి పుడతాయ్.. చెప్పండి? అంచేత... కొత్త కథలు ఇక రావు. సో... మనం చూడాల్సిందేంటంటే.. ఉన్న కథను దర్శకుడు కొత్తగా చెప్పాడా? లేదా? అనే విషయం మాత్రమే.  ప్రస్తుతం వస్తున్న చాలా సినిమాలు ఫ్లాపులవ్వడానికి కారణం కథ కాదు. దర్శకుడు కథను నడిపించిన తీరు. మొన్న ‘ఫిదా’ సినిమా వచ్చింది. కథ చెప్పుకుంటే ఏమీ లేదు. ఉన్న చిన్న పాయింట్ ని ‘వండర్’ అనిపించేలా తీశాడు శేఖర్ కమ్ముల. అందుకే ఆ సినిమా హిట్.

మరి ఈ శుక్రవారం కూడా ఓ సినిమా విడుదలైంది. పేరు ‘గౌతమ్ నంద’. గోపిచంద్ హీరో. సంపత్ నంది దర్శకుడు. మరి సంపత్ నంది ఈ సినిమాను కొత్తగా తీశాడా? లేక ‘చెత్త’గా తీశాడా? ఈ విషయం తెలుసుకునేముందు.. ఈ సినిమా కథ గురించి కాసేపు మాట్లాడుకుందాం.

అప్పుడెప్పుడో యాభై ఏళ్ల క్రితం ఎన్టీయార్ నటించిన ఓ సినిమా వచ్చింది. పేరు ‘భువనసుందరి కథ’.అందులో పరకాయ ప్రవేశ విద్య ద్వారా మహారాజు.. రజకుడిలోకి వెళతాడు. రజకుడు మహారాజులోకి వస్తాడు. అంటే... శరీరాలు అలాగే ఉంటాయ్. ఆత్మలు మారతాయన్నమాట. ఓ ఒప్పందం మీద అలా చేస్తారు. తీరా రాచరిక భోగాలకు అలవాటు పడ్డ రజకుని ఆత్మ... మహారాజు శరీరాన్ని విడిచిపెట్టనని మొండికేస్తుంది. ఇక రాజుగారికి కష్టాలు మొదలవుతాయి. చివరకు  ఎలాగూ మంచే జయిస్తుంది అది వేరే విషయం. ‘గౌతమ్ నంద’ కథ కూడా అదే. అయితే.. ఇందులో పరకాయ ప్రవేశాలు లాంటివి ఉండవు. ఇద్దరూ ఒకేలా ఉంటారు. ఓ ఒప్పందం ప్రకారం కలిగిన వాడి ఇంటికి లేనోడు వెళతాడు. లేనోడి కొంపకి కలిగిన వాడు వస్తాడు.
 
ఇలా హీరోలు ఇళ్ల మార్పిడి చేసుకున్న ద్విపాత్రాభినయ చిత్రాలు కూడా గతంలో బోలెడున్నాయి. అక్కినేని ‘ఇద్దరు మిత్రులు’, చిరంజీవి దొంగ మొగుడు, రౌడీ అల్లుడు అలాంటి కథలే కదా!
 
దీన్ని బట్టి ‘గౌతమ్ నంద’కథ పాతదే. మరి తీయడం సంపత్ నంది కొత్తగా తీశాడా? అనడిగితే.. కొత్తగా కంటే రిచ్ గా తీశాడని చెబితే బావుంటుంది. ఎందుకంటే... సినిమాలో గౌతమ్ పాత్రకు సంబంధించిన సీన్లు చూస్తే.. నిజంగా కళ్లు జిగేలుమంటాయి. ఆ భవంతులు. ఆ భోగాలు.. ఆ రిచ్ నెస్... అబ్బబ్బబ్బ.. నిజంగా ఉన్నోళ్లంటే ఇలా ఉంటారా? అనేలా చూపించాడు. ఈ విషయంలో సంపత్ నందితో పాటు నిర్మాతలను కూడా అభినందించాలి.

ఎప్పుడైనా.. హీరో పాయింటాఫ్ వ్యూలో కథ చెబుతున్నప్పుడూ... స్వయంగా హీరోగారే తన ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుంటున్నప్పుడూ... హీరోకి సంబంధం లేని సన్నివేశం ఒక్కటి కూడా అక్కడ ఉండకూడదు. కానీ ప్రస్తుతం చాలామంది దర్శకులు... ఫ్లాష్ బ్యాకుల్లో కూడా హీరోకు సంబంధం లేని కామెడీ సీన్లు, డ్రీమ్ సాంగులు పెట్టేస్తున్నారు. అంటే... హీరోగారు తన కథకు మధ్య మధ్య కామెడీ సీన్లనూ, డ్యూయెట్ సాంగులనూ తగిలించి చెబుతున్నాట్టా? విడ్డూరం కాకపోతే. మన సంపత్ నంది కూడా ఇందులో అలాంటి పనులే చేశాడు. ఒక మామూలు రొటీన్ తెలుగు సినిమా కథనం ఎలా ఉంటుందో... ప్రథమార్థం ఈ సినిమా అలాగే ఉంది. ద్వితీయర్థం మాత్రం ఊహించని ట్విస్ట్ ఇచ్చి.. ప్రేక్షకుల్ని షాక్ కి గురి చేశాడు. ఇందులో డైలాగుల గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కథనం నిదానంగా సాగినా... డైలాగు మాత్రం అదరహో అనిపించాడు సంపత్ నంది. మల్టీప్లక్సుల్లో కూడా విజిల్స్ పడే స్థాయిలో ఇందులో కొన్ని డైలాగులున్నాయి.

ఇక గోపిచంద్... వేలెత్తి చూపించడానికి ఏం లేదు. పెద్ద వటవృక్షం లాంటి తండ్రి నీడలో ఉండలేక... అస్తిత్వాన్ని వెతుక్కుంటూ వెళ్లిన వాడు ఒకడైతే... పేదరికం అనే రాకాసి కోరల్లో చిక్కుకొని మానవవత్వం కోల్పోయిన వాడు మరొకడు. ఈ రెండు పాత్రలను చెడుగుడు ఆడేశాడు గోపిచంద్. తనలోని విలన్ యాంగిల్ ని మళ్లీ ఇందులో చూడొచ్చు. ఇక హీరోయిన్లు హంసిక, కేతరిన్ గురించి చెప్పాల్సొస్తే... ఆ ముఖాల్లో కళ, కాంతులు మచ్చుకైనా కనిపించలేదు. మిగిలిన పాత్రధారులు అంతా తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి.

తమన్ సంగీతంలో ఎప్పటిలాగే శబ్దాలు తప్ప సాహిత్యం వినిపించలేదు. సౌందర్ రాజన్ కెమెరా పనితనం మాత్రం సూపర్బ్. గౌతమ్ రాజు ఎడిటింగ్ ను కూడా వంక పెట్టడానికి ఏమీ లేదు.

 మొత్తంగా యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చొచ్చు.

రేటింగ్ : 2


- నరసింహ బుర్రా


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.