'ఫ్యామిలీ స్టార్' బిజినెస్.. ఈ టార్గెట్ ని విజయ్ ఊదేస్తాడేమో!
on Apr 4, 2024

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ స్టార్స్ లో సరైన సినిమాలు పడితే టైర్-1 హీరోల లిస్టులో చేరగల సత్తా ఉన్న వారిలో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఒకడు. 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి విజయవంతమైన చిత్రాలతో.. సినిమా సినిమాకి తన క్రేజ్ ని, మార్కెట్ ని పెంచుకుంటూ పోయాడు. అయితే 'గీత గోవిందం' తర్వాత విజయ్ కి ఆ స్థాయి విజయం దక్కలేదు. మధ్యలో 'టాక్సీవాలా' మాత్రమే హిట్ అనిపించుకోగా.. 'నోటా', 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్' వంటి సినిమాలు నిరాశపరిచాయి. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న పాన్ ఇండియా మూవీ 'లైగర్' ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అలాగే విజయ్ నటించిన గత చిత్రం 'ఖుషి' పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. లవ్ స్టోరీ కావడం, అధిక బిజినెస్ చేయడంతో బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా మిగిలింది. ఈ క్రమంలో విజయ్.. తనకు 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు పరశురామ్ తో కలిసి 'ఫ్యామిలీ స్టార్'(Family Star)గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
విజయ్, పరశురామ్ కాంబినేషన్ లో రూపొందిన 'గీత గోవిందం' 2018లో విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని ఘన విజయం సాధించింది. వరల్డ్ వైడ్ గా రూ.130 కోట్ల గ్రాస్ రాబట్టి, విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అందుకే వీరి కలయికలో రెండో సినిమాగా వస్తున్న 'ఫ్యామిలీ స్టార్'పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే 'ఫ్యామిలీ స్టార్' థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది.
నైజాంలో 'ఫ్యామిలీ స్టార్' థియేట్రికల్ బిజినెస్ వాల్యూ రూ.13 కోట్లని అంచనా. ఇక సీడెడ్ లో రూ.4.5 కోట్ల బిజినెస్, ఆంధ్రాలో రూ.17 కోట్ల బిజినెస్ జరగగా.. తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా రూ.34.50 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. అలాగే కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా రూ.3 కోట్లు, ఓవర్సీస్ రూ.5.5 కోట్లు కలిపి.. వరల్డ్ వైడ్ గా రూ.43 కోట్ల బిజినెస్ చేసింది.
విజయ్ గత రెండు చిత్రాల బిజినెస్ తో పోలిస్తే 'ఫ్యామిలీ స్టార్' బిజినెస్ తక్కువే అయినప్పటికీ.. ఆ సినిమా జానర్, గత చిత్రాల రిజల్ట్, ఇతర యంగ్ స్టార్స్ సినిమాల బిజినెస్ తో పోలిస్తే మాత్రం.. మెరుగైన బిజినెస్ చేసినట్లే లెక్క. విజయ్ గత చిత్రాలను గమనిస్తే.. 'లైగర్' రూ.88 కోట్ల బిజినెస్ చేయగా, 'ఖుషి' రూ.52 కోట్ల బిజినెస్ చేసింది. కానీ ఆ రెండు సినిమాలు బ్రేక్ ఈవెన్ సాధించలేదు. ముఖ్యంగా 'లైగర్' బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. అయితే ఇప్పుడు 'ఫ్యామిలీ స్టార్'కి అన్నీ సానుకూలంగా ఉన్నాయి. 'గీత గోవిందం' తర్వాత విజయ్-పరశురామ్ కాంబోలో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం, సమ్మర్ సీజన్ కలిసి రావడం, బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా మరీ ఎక్కువగా లేకపోవడంతో.. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర 'ఫ్యామిలీ స్టార్' మ్యాజిక్ చేసే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



