ఫలక్నుమా... కథలో సగం మార్చారు!
on May 30, 2019
'ఈ నగరానికి ఏమైంది'లో హీరోగా నటించిన విశ్వక్ సేన్ దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా 'ఫలక్నుమా దాస్'. ఇందులో అతడే హీరో. తెలుగు ప్రేక్షకుల్లో ఎక్కువశాతం మందికి తెలియని విషయం ఏంటంటే... రెండేళ్ల క్రితం మలయాళంలో వచ్చిన 'అంగమలై డైరీస్'కి రీమేక్ ఈ 'ఫలక్నుమా దాస్'. అయితే... కథలో యాభై శాతం మార్పులు చేశానని విశ్వక్ సేన్ చెబుతున్నాడు. హైదరాబాదీ వాతావరానికి తగ్గట్టు కథా నేపథ్యాన్ని కూడా మార్చారు. నిజానికి, ఈ సినిమా 'ఈ నగరానికి ఏమైంది' కంటే ముందు మొదలైంది. విశ్వక్ సేన్ హీరో, డైరెక్టర్. ప్రొడ్యూసర్ అతడి తండ్రే. బయట నుంచి ఆఫర్ రావడంతో సొంత సినిమాను పక్కన పెట్టి, ఆ సినిమాను పూర్తి చేశాడు. 'ఈ నగరానికి ఏమైంది' విడుదల తరవాత మళ్ళీ 'ఫలక్ నుమా దాస్'ను పట్టాలు ఎక్కించాడు. 'ఈ నగరానికి...' చేసేటప్పుడు, ఆ చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ సన్నివేశాన్ని వివరించే తీరు గమనించి... అతడిలో మంచి నటుడు ఉన్నాడని గుర్తించాడు. పట్టుబట్టి 'ఫలక్నుమా దాస్'లో పోలీస్ క్యారెక్టర్ చేయించాడు. నానికి ఆ పాత్ర, నాడులో తరుణ్ భాస్కర్ నటన నచ్చేసింది. బెస్ట్ యాక్టర్ అవార్డు తరుణ్ భాస్కర్ కి ఇచ్చేయాలని చెబుతున్నారు. ఈ శుక్రవారం విడుదలవుతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.