వాటిపైనే మోజుపడుతున్న శివ కార్తికేయన్!
on Jun 23, 2022
తమిళ తెరపై దాదాపు పదేళ్ళుగా వినోదాలు పంచుతున్న యువ కథానాయకుడు.. శివ కార్తికేయన్. `కేడి బిల్లా కిలాడి రంగా`, `ఎదిర్ నీచ్చల్`, `వరుత్త పడాద వాలిబర్ సంఘం`, `మాన్ కరాటే`, `రజినీ మురుగన్`, `రెమో`, `సీమరాజా`, `హీరో`, `డాక్టర్`, `డాన్` చిత్రాలతో కోలీవుడ్ లో మంచి విజయాలను అందుకున్నాడు శివ. వీటిలో కొన్ని సినిమాలు తెలుగు వారిని సైతం అనువాద రూపంలో విశేషంగా అలరించాయి. త్వరలో ఈ యంగ్ హీరో.. తెలుగు, తమిళ భాషల్లో `ప్రిన్స్`గా వినోదాలు పంచనున్నాడు. `జాతిరత్నాలు` ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఈ బైలింగ్వల్ మూవీ తెరకెక్కుతోంది.
ఇదిలా ఉంటే, కెరీర్ ఆరంభంలో తమిళ శీర్షికలతోనే ఎక్కువగా సందడి చేస్తూ వచ్చిన శివ కార్తికేయన్.. గత కొంతకాలంగా ఇంగ్లిష్ టైటిల్స్ తోనే వరుసగా పలకరిస్తున్నాడు. `హీరో`, `డాక్టర్`, `డాన్`, `ప్రిన్స్`.. ఇలా శివ నాలుగు వరుస చిత్రాలు ఆంగ్ల శీర్షికలనే కావడం ఇందుకు నిదర్శనం. మొత్తమ్మీద.. ఇంగ్లిష్ టైటిల్స్ పై శివ కార్తికేయన్ మోజు పడడం కోలీవుడ్ లో వార్తల్లో నిలుస్తోంది. మరి.. `హీరో`, `డాక్టర్`, `డాన్` - ఇలా శివకి ఆంగ్ల శీర్షికలతో విజయాలు దక్కుతున్న వైనం.. `ప్రిన్స్` విషయంలోనూ కొనసాగుతుందేమో చూడాలి.
Also Read