ENGLISH | TELUGU  

రామ్ తో పది సినిమాలు చేస్తా!

on Jul 11, 2022

ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన సినిమా 'ది వారియర్'. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. రామ్ సరసన కృతి శెట్టి నటించారు. ఆది పినిశెట్టి విలన్ రోల్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో జూలై 14న భారీ ఎత్తున సినిమా విడుదలఅవుతోంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వ‌హించారు.
 
ఈ కార్యక్రమంలో రామ్ మాట్లాడుతూ ''ఈ సినిమా జర్నీ డిఫరెంట్‌గా స్టార్ట్ అయ్యింది. పోలీస్ కథ చేద్దామనుకొని ఐదు కథలు విన్నాను. అన్నీ ఒకేలా అనిపించి కొన్ని రోజులు పోలీస్ కథలు వద్దని, వినకూడదని అనుకున్న టైమ్‌లో లింగుస్వామి గారు హైదరాబాద్ వచ్చారు. ముందు పోలీస్ కథ అని చెప్పలేదు. వచ్చాక చెప్పారు. ఫార్మాలిటీ కోసం విందామని అనుకున్నాను. విన్న తర్వాత... పోలీస్ కథ చేస్తే, ఇటువంటి కథ చేయాలనిపించింది. కథలో ఎమోషన్ అంతలా ఆకట్టుకుంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా కథ రాశానని ఆయన చెప్పారు. సత్య లాంటి పోలీస్ ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు. జీవితంలో మన కంట్రోల్‌లో ఉన్న పనులు చేస్తాం. లేనివి దేవుడికి వదిలేస్తాం. జీవితంలో ఒకటి సాధించాలంటే ఎంత దూరమైనా వెళ్లొచ్చని పోలీసుల కథలు విన్న తర్వాత అనిపించింది. 'ది వారియర్' నాకు చాలా ఎమోషనల్ ఫిల్మ్. ఫస్ట్ టైమ్ ఒక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళాను. పోలీస్ రోల్ కోసం ప్రిపేర్ కావడానికి ఒక నెల టైమ్ ఉంది. వర్కవుట్స్ చేద్దామని జిమ్‌కు వెళ్ళా. రోజుకు రెండుసార్లు జిమ్ చేద్దామనుకుంటే... స్పైనల్ కార్డ్ దగ్గర ఇంజురీ అయ్యింది. మూడు నెలలైనా తగ్గలేదు. డాక్టర్ దగ్గరకు వెళ్ళా. వెయిట్స్ లిఫ్ట్ చేయొచ్చా? జిమ్‌కు వెళ్ళొచ్చా? అంటే... వన్ కిలోతో చేయొచ్చని చెప్పారు. అలా అయితే కష్టమని చెప్పా. అప్పుడు 'మీకు సినిమా ఇంపార్టెంట్ ఆ? లైఫ్ ఇంపార్టెంట్ ఆ?' అని డాక్టర్ ప్రశ్నించారు. సినిమానే లైఫ్ అనుకునేవాళ్ళకు అది అవుటాఫ్ సిలబస్ క్వశ్చన్‌లా అనిపిస్తుంది. ఇంటికి వచ్చేశా. చాలా రోజుల తర్వాత ట్విట్టర్ ఓపెన్ చేశా. అప్పుడు అభిమానులు పంపిన సందేశాలు ఒక్కొక్కటీ చదివా. నేను అప్పటివరకూ సాంగ్స్, ఫైట్స్ ఎలా చేయాలని ఆలోచించా. 'అన్నా... నువ్వేం చేయకు. ఈ సినిమాకు మేం ఏమీ ఆశించడం లేదు' అని ఫ్యాన్స్ మెసేజ్ చేశారు. 'ఇదీ అన్ కండిషనల్ లవ్' అని అప్పుడు అనిపించింది. అభిమానులు లేకపోతే నేను లేనని ఆ రోజు అర్థమైంది. థాంక్యూ సో మచ్. నా బాడీలోని ప్రతి ఇంచ్ లో ఎనర్జీ మీ వల్లే వచ్చింది. అనంతపురంలో ట్రైలర్ లాంచ్ విడుదల కార్యక్రమానికి వచ్చిన అభిమానులు చాలా మందికి దెబ్బలు తగిలాయని విన్నాను. చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. నేను మీకు ఎంతో... మీరు కూడా నాకు అంతే అని గుర్తు పెట్టుకోండి.'' అని అన్నారు.     

దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ ''నేను ఫస్ట్ టైమ్ తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను. నాకు రామ్ చాలా సపోర్ట్ చేశారు. దర్శకుడు ఎలా ఆలోచించారో, ఆ ఆలోచనలకు న్యాయం చేయగల హీరో దొరకడం నా అదృష్టం. భయంకరమైన టైమింగ్ సెన్స్, షార్ప్ రామ్ సొంతం. డ్యాన్సుల్లో వచ్చి సూపర్బ్. నాకు అదృష్టం ఉండి కరెక్టుగా జరిగితే... రామ్ తో 10 సినిమాలు చేస్తానని అనుకుంటున్నాను. నేను తీసిన 'రన్', 'పందెం కోడి', 'ఆవారా' సినిమాలు తెలుగు ప్రేక్షకులు చూశారు. ఫస్ట్ టైమ్ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేశా. చాలా రోజుల నుంచి తెలుగు సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాను. హండ్రెడ్ పర్సెంట్ మంచి సినిమా కుదిరింది. ఇటువంటి సినిమాతో రావడం సంతోషంగా ఉంది. థియేటర్లలో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. 'రన్' సినిమా తర్వాత నాతో సినిమా చేయాలని శ్రీనివాసా చిట్టూరి వచ్చారు. అప్పటి నుంచి ఆయన, నేను ఇండస్ట్రీలో ఉన్నాం. అది మా అదృష్టం. నేను అడిగింది ఇచ్చారు. 'వారియర్ 2' కూడా ఆయనకు చేస్తున్నాను. నా కోసం 20 ఏళ్ళు వెయిట్ చేశారు. ఇంకో 20 ఏళ్ళు ఆయనతో ట్రావెల్ చేయడానికి రెడీగా ఉన్నాను. పది రోజుల నుంచి దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. అందువల్ల, ఇక్కడికి రాలేకపోయారు. రామ్, దేవిశ్రీ, నేను... ముగ్గురం ఒకే ఎనర్జీతో ఉన్నాం. అందువల్ల, ఇంత మంచి పాటలు వచ్చాయి. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. తమిళనాడులో ఫైట్స్ ఎవరు చేశారు? అని అడుగుతున్నారు. విజయ్ మాస్టర్ అంత మంచి ఫైట్స్ చేశారు.'' అని అన్నారు. 

కృతి శెట్టి మాట్లాడుతూ ''రామ్ ఎప్పుడూ సరదాగా ఉంటారు. ఆయనలో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే... సాంగ్ షూటింగ్ చేసేటప్పుడు బాడీలో ఎంత పెయిన్ ఉన్నా ఆగలేదు. సాంగ్స్‌లో ఆయన ఎనర్జీ ఎవరూ మ్యాచ్ చేయలేరు. నా బాడీలో పెయిన్ లేదు కానీ... ఆయన ఎనర్జీ మ్యాచ్ చేయడం కష్టమైంది. ఆ డెడికేషన్, హార్డ్ వర్క్‌కి ఆయన్ను అభినందించాలి. అందుకే అందరూ ఆయన్ను ఉస్తాద్ రాపో అంటారేమో. దర్శకుడిగా లింగుస్వామి డైమండ్ అని తెలుసు. ఆయనతో పని చేసిన తర్వాత ఎంత గుడ్ పర్సన్ అని  తెలిసింది. ఆయన మనసు బంగారం. నాకు విజిల్ మహాలక్ష్మి రోల్ ఇచ్చినందుకు థాంక్స్. మా సినిమాకి డీఎస్పీ గారు యూఎస్పీ. 'ఉప్పెన' తర్వాత దేవిశ్రీతో ఎప్పుడు పని చేస్తానని అనుకున్నాను. ఈ సినిమా వచ్చింది. 'బుల్లెట్...' సాంగ్ చాలా పాపులర్ అయ్యింది. గుడికి వెళితే ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయో... మా నిర్మాతలు శ్రీనివాసా చిట్టూరి, పవన్ దగ్గర నుంచి అంత పాజిటివ్ వైబ్స్ వస్తాయి.'' అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, దర్శకుడు హరీష్ శంకర్, రచయిత సాయి మాధవ్ బుర్రా, నటుడు బ్రహ్మాజీ, ఫైట్ మాస్టర్ విజయ్, కళాదర్శకుడు సత్యనారాయణ, సినిమాటోగ్రాఫర్ సుజీత్ వాసుదేవ్, 'ఆదిత్య మ్యూజిక్' మాధవ్, 'ఆదిత్య మ్యూజిక్' నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.