త్రివిక్రమ్‌గారే నా గరువు!
on Jun 11, 2019
‘‘నేను ‘అతడు’ నుంచి ‘అ.. ఆ’ వరకూ త్రివిక్రమ్‌గారి చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ చేశా. వంద చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో పని చేసినా... త్రివిక్రమ్‌గారితో అనుబంధం ఎక్కువ. దర్శకుణ్ణి కాకముందు ఒక షార్ట్ ఫిల్మ్ తీసి, ఆయనకు చూపించా. మెచ్చుకుని, రచనలో కొన్ని మెళకువలు చెప్పారు. కథ, మాటలు ఎలా రాయాలి? ఎలా తీయాలి? వంటివి ఆయన దగ్గర్నుంచి నేర్చుకున్నా. వందశాతం ఆయనే నా గురువు’’ అని అరుణ్ పవార్ అన్నారు. సప్తగిరి హీరోగా నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి నిర్మించిన ‘వజ్రకవచధర గోవింద’ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు అరుణ్ పవార్ మాట్లాడుతూ ‘‘లక్ష్యం గొప్పది అయినప్పుడు... ప్రయాణించే దారి కూడా గొప్పగా ఉంటేనే విజయం సాధిస్తామనే సందేశంతో రూపొందించిన చిత్రమిది. హీరో ఒక దొంగ. అతను ఎందుకు దొంగగా మారాడనేది ఆసక్తికరం. సప్తగిరితో నా తొలి సినిమా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’లో కథ, కామెడీ, ఎమోషన్ బావున్నా... పాటలను కమర్షియల్ పంథాలో తీశా. ఈసారి ఆ తప్పు చేయకూడదని పాటల్లోనూ వినోదం ఉండేలా చూసుకున్నా. సప్తగిరి నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదంతో పాటు భావోద్వేగాలు తారాస్థాయిలో ఉండే చిత్రమిది. విశ్రాంతికి ముందు 20 నిమిషాలు ప్రేక్షకులు తప్పకుండా కంటతడి పెడతారు. ప్రేక్షకుల్ని ఈ సినిమా తప్పకుండా మెప్పిస్తుందని ఆశిస్తున్నా. నిజానికి, ఈ సినిమాకు ముందు దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ) నిర్మాణంలో ఓ సినిమా చేయాలనుకున్నా. ఆయనకు కథ చెప్పాను. నచ్చడంతో తానే నిర్మిస్తానన్నారు. నా తదుపరి చిత్రం అదే కావొచ్చు. ఆయన ‘వెంకీమామ’ స్ర్కిప్ట్ వర్క్‌లో పాలుపంచుకున్నా’’ అన్నారు.