ENGLISH | TELUGU  

డియర్ కామ్రేడ్ మూవీ రివ్యూ

on Jul 26, 2019

నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, శృతి రామచంద్రన్, చారు హాసన్, సంజయ్ స్వరూప్, చాయ్ బిస్కెట్ సుహాస్ తదితరులు
పాటలు: రెహమాన్, చైతన్య ప్రసాద్, కెకె
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
సంగీతం: జస్టిన్ ప్రభాకర్
నిర్మాతలు: యష్ రంగినేని, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి
దర్శకత్వం: భరత్ కమ్మ
విడుదల తేదీ: 26 జూలై 2019

విజయ్ దేవరకొండ, రష్మిక జోడి హిట్టు ('గీత గోవిందం'తో చూశాం కదా)! సినిమా విడుదలకు ముందు పాటలు హిట్టు. ట్రయిలర్ కూడా ఓరకంగా హిట్టు. మరి, సినిమా?  దర్శకుడిగా పరిచయమైన భరత్ కమ్మ హిట్టు కొట్టాడా? సినిమా హిట్టు అని 'డియ‌ర్ కామ్రేడ్' అనిపించుకుంటుందా?

కథ: బాబీ అలియాస్ చైత‌న్య (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) కాకినాడ కుర్రాడు. కాలేజీలో స్టూడెంట్స్‌కు అన్యాయం జ‌రిగితే పోరాడ‌టంలో ముందుంటాడు. ప‌క్కింటికి వ‌చ్చిన హైద‌రాబాద్ అమ్మాయి, స్టేట్ లెవెల్ క్రికెట్ ప్లేయర్ లిల్లీ అలియాస్ అప‌ర్ణాదేవి (ర‌ష్మిక మంద‌న్న‌)తో ప్రేమలో పడతాడు. మొదట ప్రేమకు నో చెప్పిన, లిల్లీ తర్వాత ఓకే చెబుతుంది. కానీ, బాబీ ఆవేశం చూసి అతణ్ణి వద్దనుకుని వెళ్లిపోతుంది. మూడేళ్ల తరవాత మళ్లీ కలుస్తారు. ఈ మూడేళ్లు బాబీ ఏం చేశాడు? లిల్లీ క్రికెట్‌ను ఎందుకు వదిలేసింది? ఆమె తల్లిదండ్రులు ఆమెకు సైకియాట్రిస్ట్ ఎందుకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు? ఇవన్నీ చూసిన బాబీ ఏం చేశాడు? అనేది మిగతా కథ.


విశ్లేషణ: 'ప్రకృతిలో ప్రతి శబ్దం నాలో కొత్త నిశ్శబ్దాన్ని నింపుతుంది' - ద్వితీయార్ధంలో విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్. అయితే... అంతకు ముందు ప్రథమార్ధంలో ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్లో సినిమాపై కొత్త కొత్త సందేహాలను రేకెత్తించింది. సినిమా ప్రారంభం బావున్నా... అరగంట తర్వాత కథ ఎంతసేపటికీ ముందుకు కదలడం లేదేంటి? అనిపిస్తుంది. ప్రతి సన్నివేశం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. అయితే... మధ్య మధ్యలో వచ్చే పాటలు మనసుకు ప్రశాంతత చేకూరుస్తాయి. నెమ్మదిగా సాగిన కథనాన్ని కాస్తో కూస్తో క్షమించేలా చక్కటి పాటలు కుదిరాయి. కథ బాలేదని కాదు. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ (ముద్దులు) బాలేదని కాదు. కానీ... కథనం నత్తనడకన సాగడం, దర్శకత్వంలో కవితాత్మకత ధోరణి ప్రేక్షకుడు పక్కచూపులు చూసేలా చేశాయి. ఐదు, పది నిముషాలు బయటకు వెళ్లి వచ్చినా ఏం జరిగిందో ఈజీగా చెప్పేయవచ్చు. విశ్రాంతి వరకూ హీరో పాత్రను పరిచయం చేయడానికి, ప్రేమకథను చూపించడానికి వాడుకున్న దర్శకుడు... విశ్రాంతి తర్వాత పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు అంశాన్ని స్పృశించాడు. అసలు కథ అక్కడ నుండి మొదలైంది.

ప్రథమార్ధంలో విప్లవ భావాలు కలిగిన వ్యక్తిగా హీరోని చూపించిన దర్శకుడు... ద్వితీయార్ధంలో లైంగిక వేధింపులు విషయం వచ్చేవరకూ హీరోలో విప్లవ భావాలను పక్కన పెట్టేశాడు.ప్రేయసిని తలచుకుంటూ ప్రపంచ ప్రయాణం చేసిన వ్యక్తిగా, ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నట్టు చూపించాడు. ప్రేమ కోసం విప్లవ భావాలను వదిలేశాడా? మళ్లీ ప్రేయసి సమస్య ముందుకొచ్చేసరికి కోసం గుర్తొచ్చాయా? ఈ ప్రయాణంలో ఎక్కడా అతడికి సమస్యలు కనిపించలేదా? ఒక కామ్రేడ్ అంత సులభంగా విప్లవ భావాలను త్యజిస్తాడా? ఆలోచిస్తే ఎన్నో లాజిక్కులు, హీరో పాత్ర చిత్రణలో లోపాలు కనిపిస్తాయి. లాజిక్కులు పక్కన పెట్టి మేజిక్ జరుగుతుందని ఎదురుచూసినా... దర్శకుడి కావితాత్మక ధోరణి వల్ల నిరాశే కలుగుతుంది. అయితే... జస్టిన్ ప్రభాకర్ స్వరాలు, నేపథ్య సంగీతం సినిమాకు బలంగా నిలిచాయి. కిందకు పడుతున్న సినిమా గ్రాఫ్‌ను నిల‌బెట్టే ప్రయత్నం చేశాయి. ఛాయాగ్రాహకుడు సుజీత్ సారంగ్ కూడా తీవ్రకృషి చేశారు. ప్రతి ఫ్రేమును అందంగా మలిచాడు. దర్శకుడిలో కవితాత్మక భావం వల్లే సంగీత దర్శకుడు, ఛాయాగ్రహకుడు అంత మంచి పనితీరు కనబరిచి ఉండొచ్చు. కానీ, అది మరీ ఎక్కువ కావడంతో సినిమా సాగదీసిన భావన, నిడివి ఎక్కువైన భావన కలుగుతుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.

ప్లస్ పాయింట్స్:
జస్టిన్ ప్రభాకర్ సంగీతం
విజయ్ దేవరకొండ - రష్మిక కెమిస్ట్రీ
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:
దర్శకత్వంలో కావితాత్మక ధోరణి
నెమ్మదిగా సాగిన కథనం
ఎంతసేపటికీ ముందుకు కదలని కథ

నటీనటుల పనితీరు:
విజయ్ దేవరకొండ తన పాత్రకు న్యాయం చేశాడు. ఆవేశాన్ని, ప్రేమలో అందాన్ని, ప్రేయసి సమస్యలో ఉందని తెలిసిన తర్వాత ఆవేదనను చక్కగా చూపించాడు. అయితే... ఎక్కువగా 'అర్జున్ రెడ్డి'ని గుర్తు చేశాడు. అందువల్ల, ప్రేక్షకులకు విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న‌లో స‌ర్‌ప్రైజ్ ఏమీ ఉండ‌దు. ఇటు ప్రేమ సన్నివేశాల్లోనూ, అటు భావోద్వేగభరిత సన్నివేశాల్లోనూ రష్మిక మందన్న మెప్పించారు. నటిగా ఆమెలో పరిణితి కనిపిస్తుంది. అయితే... సొంత గొంతు ఆమెకు సెట్ కాలేదు. ఓన్ డబ్బింగ్ సన్నివేశాల్లో ఫీల్ మిస్ అయ్యేలా చేసింది. రష్మిక అక్కగా శృతి రామచంద్రన్ ఆకట్టుకున్నారు. చారు హాసన్ నటించడం వల్ల పాత్రకు హుందాతనం వచ్చింది. మిగతా నటులు పాత్రల పరిధి మేరకు చేశారు.  
 
తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

కథ బాగుంది. కానీ, కథనం నెమ్మదిగా సాగింది. సంగీతం, సినిమాటోగ్రఫీ బావున్నాయి. ఓవరాల్ సినిమా దగ్గరకు వచ్చేసరికి కాస్త ఆలోచించాలి. మణిరత్నం సినిమా మరీ నిదానంగా సాగితే ఎలా ఉంటుందో అలా ఉంటుందీ 'డియర్ కామ్రేడ్'. స్లో నేరేషన్, పొయిటిక్ స్టయిల్ ను ఇష్టపడేవారు సినిమాను ఎంజాయ్ చేయగలరు.

రేటింగ్: 2.5/5


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.