ENGLISH | TELUGU  

క‌రెంట్ తీగ‌ రివ్యూ: ఓల్టేజ్ త‌గ్గిన క‌రెంట్ తీగ‌

on Oct 31, 2014

ఏవేవో ఊహించుకొని జ‌నం థియేట‌ర్ల‌కు వెళ్ల‌డం, అక్క‌డి నుంచి ఉస్సూరుమంటూ తిరిగి రావ‌డం ఈమ‌ధ్య బాగా కామన్ అయిపోయింది. క‌రెంట్ తీగ‌లోనూ ఎట్రాక్ట్ చేసే అంశాలు చాలానే ఉన్నాయి.
నెంబ‌ర్ వ‌న్ - మంచు మ‌నోజ్‌
టూ - ఆల్రెడీ త‌మిళంలో హిట్ట‌యిన క‌థ‌
త్రీ - స‌న్నీలియోన్‌
ఫోర్ - టైటిలూ... ఈ సినిమా కోసం ఇచ్చిన బిల్డ‌ప్పులు
ఇన్నేసి ఎట్రాక్ష‌న్లుంటే... ఈ సినిమాపై సాధార‌ణంగానే ఆస‌క్తి పెరిగిపోతుంది. మ‌రి తెలిసి తెలిసి థియేట‌ర్లో అడుగు పెడితే...
ప‌రిస్థితి ఏంటి?  షాక్ కొట్టాందా??  లేదా??  అస‌లింత‌కీ ఈ క‌రెంట్ తీగ‌లో ఉన్న ఓల్టేజ్ ఎంత‌??  తెలుసుకొందాం, రండి.

శివ‌రామ‌రాజు (జ‌గ‌ప‌తిబాబు) ఊర్లో ప‌రువు కోసం బ‌తికే మ‌నిషి. ముగ్గురు ఆడ‌పిల్ల‌ల తండ్రి. కూతుర్లు పుట్టార‌ని సంబ‌ర‌ప‌డిపోకు - పెద్ద‌య్యాక లేచిపోతే ప్ర‌మాదం అంటూ వీర్రాజు (కాట్రాజు) నోరు జారితే... త‌న చెవి కోస్తాడు శివ‌రామ‌రాజు. నా మాట నిజమైతే నీ రెండు చెవులూ కోసేస్తా అని కాట్రాజు, అదే జ‌రిగితే నా కూతుర్ని చంపేస్తా అని శివ‌రామ‌రాజు పందెం కాసుకొంటారు. శివ‌రామ‌రాజు ఇద్ద‌రు కూతుర్ల‌కు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగానే పెళ్లి చేస్తాడు. మూడో కూతురు క‌విత (ర‌కుల్ ప్రీత్ సింగ్‌) ఇంట‌ర్ లో అడుగుపెడుతుంది. అదే ఊర్లో వీఐపీ సంఘానికి అధ్య‌క్షుడు రాజు (మ‌నోజ్‌). త‌నో డేంజ‌ర్ మ‌నిషి. త‌న జోలికి వెళితే షాకే. ఇంగ్లీష్ టీచ‌ర్ (స‌న్నీ) ని గుడ్డిగా ప్రేమిస్తుంటాడు రాజు. కానీ.. క‌విత మాత్రం రాజుని ప్రేమిస్తుంది. శివ‌రామ‌రాజు త‌న కూతుర్ని బ‌ల‌వంతంగా మ‌రొక‌రికిచ్చి పెళ్లి చేస్తే... అడ్డు పుల్ల వేస్తాడు రాజు. అంతే కాదు శివ‌రామ‌రాజు ప్రాణానికి ప్రాణంగా చూసుకొనే గ‌న్‌ని కూడా దొంగిలిస్తాడు. దాంతో శివ‌రామ‌రాజు రాజుని ఎలాగైనా దెబ్బ‌తీయాల‌ని చూస్తుంటాడు. కొన్ని రోజుల‌కు క‌విత‌ను ప్రేమించ‌డం మొద‌లెడ‌తాడు. మ‌రి క‌విత‌, రాజు పెళ్లి జ‌రిగిందా? శివ‌రామ‌రాజు పందెం ఏమైంది?? ఈ వివ‌రాలు క‌రెంట్ తీగ‌ని తాకి తెల్సుకోవ‌ల్సిందే.

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన‌ వరుతపడాద వాలిబర్ సంఘం చిత్రానికి రీమేక్ ఇది. అరువు తెచ్చుకొన్న క‌థంటే... అందులో గొప్ప ట్విస్టు, అదిరిపోయే కాన్సెప్టూ ఉన్నాయ‌నుకొంటే త్రిబుల్ పిన్ ప్లెగ్గులో వేలెట్టిన‌ట్టే. సాదాసీదా ల‌వ్ స్టోరీ ఇది. కాక‌పోతే.. ఓ పందెం చుట్టూ న‌డుస్తుంది. పందెం అంటే ఇంకేదో ఊహించుకొందురు. త‌న కూతురు ప్రేమించి పెళ్లి చేసుకోకుండా... కాపలా కాసే ఓ తండ్రి క‌థ ఇది. కాక‌పోతే సెంటిమెంట్ ట‌చ్‌లేం ఇవ్వ‌కుండా క‌థ‌ని సాఫీగా న‌డిపించేసే ప్ర‌య‌త్నం చేశారు. ఈ సినిమాని కాపాడ‌గ‌లిగిన ఏకైక పాయింట్ అదే. జి.నాగేశ్వ‌రెడ్డికి వినోదాత్మ‌క స‌న్నివేశాలు పండించ‌డంలో మంచి పేరుంది. మ‌నోజ్ కూడా కామెడీ అద‌ర‌గొట్టేస్తాడు. కాబ‌ట్టి కొన్ని కామెడీ సీన్లతో... కాల‌క్షేపం అయిపోతుంది. మాతృక‌ని య‌ధావిధిగా పాలో అయిపోకుండా కాన్సెప్ట్‌ని మాత్ర‌మే వాడుకొన్నారు. అయితే అదే స‌గం ప్ల‌స్సూ, స‌గం మైన‌స్సూ. మాతృక ఆధారంగా అల్లుకొన్న సీన్ల‌లో వినోదం పండింది. సొంత తెలివితేట‌లు ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చాయో.. అవ‌న్నీ తుస్సుమ‌న్నాయి.

 స‌న్నీ అందాలు, ఆమె చుట్టూ అల్లిన సన్నివేశాలు, ఐటెమ్ పాట ఇవ‌న్నీ జాలీగా గ‌డిచిపోతాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇంట్ర‌వెల్ వ‌ర‌కూ క‌రెంట్ తీగ‌లో ఓల్టేజ్ అధికంగానే ప్ర‌వ‌హించింది. తీరా సెకండాఫ్ లో ఫ్యూజు కొట్టేసింది. అక్క‌డి నుంచి క‌థ‌ని ఎలా న‌డ‌పాలో, ఏం చేయాలో ఎవ్వ‌రికీ అర్థం కాక బిక్క మొహం వేశారు. శుభం కార్డు వ‌ర‌కూ సినిమాని న‌డిపించ‌డానికి నానా తంటాలు ప‌డ్డారు. చివ‌రికి ఏదోలా శుభం కార్డు వేసేసి చేతులు దులుపుకొన్నారు.

ప్ర‌ధాన ఎలిమెంట్స్‌, ఎట్రాక్టివ్ పాయింట్స్‌లో చెప్పుకొన్న కొన్ని మాత్ర‌మే ఈ సినిమాని నిల‌బెట్టాయి. అందులో ఒక‌టి... మ‌నోజ్!  త‌న బ‌లం ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. ఈ సినిమాలో దాన్నే న‌మ్ముకొన్నాడు. డైలాగులు, యాక్ష‌న్‌, సెంటిమెంట్ సీన్స్‌... ప్ర‌తీ చోటా త‌న మార్క్ చూపించాడు. కాక‌పోతే కాస్త ఒళ్లు చేసిన మ‌నోజ్ డాన్సుల్లో క‌ద‌ల‌డానికి ఇబ్బంది ప‌డ్డాడు. త‌న వైపు నుంచి ఇది త‌ప్ప‌.. వేరే లోపాలేం లేవు.జ‌గ‌ప‌తి బాబు పాత్ర మ‌రీ సీరియ‌స్ గా కాకుండా, మ‌రీ కామెడీగా కాకుండా న‌డిపారు. ఆయ‌నా ఇదే ఫార్ములాలో వెళ్లాడు. మ‌రీ గొప్ప‌గా న‌టించ‌కుండా, మ‌రీ చ‌ప్ప‌గా క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు. ర‌కుల్ ఈసారి అందాల ఆర‌బోత‌పైనే దృష్టిపెట్టింది.  అటు ద‌ర్శ‌కుడు, ఇటు కెమెరామెన్‌.. ర‌కుల్‌ని అందంగా చూపించ‌డానికి తెగ తాప‌త్ర‌య‌ప‌డ్డారు. స‌న్నీ ఓ తీయటి షాక్‌. సాంపూ 1000 ఓల్డ్స్ బ‌ల్బులా ఓసారి వెలిగి మాయ‌మయ్యాడు. ధ‌న్‌రాజ్ అండ్ గ్యాంగ్‌ని ద‌ర్శ‌కుడు స‌రిగా వాడుకోలేదు. విలేజ్ నేటివిటీ అన్నారు గానీ, అస‌లు ప‌ల్లెటూరి అందాల్ని చూపించ‌లేక‌పోయారు. అంతా నాటు వాస‌నే.

ద‌ర్శ‌కుడు జి. నాగేశ్వ‌ర‌రెడ్డి స్ర్కిప్టు విష‌యంలో ఇంకొన్ని మార్పులు చేసుకొంటే బాగుండేది. సెకండాఫ్ డ‌ల్ కాకుండా జాగ్ర‌త్త ప‌డాల్సింది. మొద‌టి స‌గంలో ఉన్న కిక్‌.. రెండో భాగంలో లేదు. దాంతో ప్రేక్ష‌కుడు ఒక‌ర‌క‌మైన అసంతృప్తితో థియేట‌ర్ల నుంచి బ‌య‌ట‌కు వ‌స్తాడు. అచ్చు సంగీతం బాగుంది. త‌మ‌న్‌కంటే 1000రెట్లు బెట‌ర్ ( ఆమాట‌కొస్తే త‌మ‌న్‌తో ఎవ‌ర్ని పోల్చుకొన్నా బెట‌రే). ప‌ద‌హారేళ్ల‌యినా ప‌సిపాపై ఉన్నా మెలోడీ బాగుంది. స‌న్నీపై తెర‌కెక్కించిన పాట యూత్‌కి న‌చ్చుతుంది. తాగుడు పాట.. కిక్ ఇస్తుంది. ఆర్ ఆర్‌లోనూ ప‌నిత‌నం క‌నబ‌ర్చాడు. సెకండాఫ్‌లో ఎడిట‌ర్ శ్ర‌ద్ధ చూపించ‌లేదు. దాంతో.. న‌స పెరిగింది. మ‌నోజ్ తెర‌కెక్కించిన యాక్ష‌న్ స‌న్నివేశాలు మాస్‌కి న‌చ్చుతాయి.

మొత్తానికి చెప్పాలంటే ఇది కాల‌క్షేపానికి స‌రిపోయే సినిమా.  ఎలాంటి అంచ‌నాలూ పెట్టుకోకుండా  వెళ్లండి  అప్పుడు న‌చ్చొచ్చు.నవ్వుకోవచ్చు.


రేటింగ్ 2.75/5

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.