కమెడియన్స్ హీరోయిజం ప్రదర్శించలేరా?
on Jun 13, 2015
తెరపై ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే హాస్యనటుల్లో చాలామంది హీరోయిజాన్ని కూడా ప్రదర్శించారు. ఆంధ్రా దిలీప్ కుమార్ గా పేరుతెచ్చుకున్న చలం నుంచి ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలకు ప్రధాన ఆకర్షణ అయిన బ్రహ్మానందం వరకూ అంతా హీరోగా మురిపించినవారే. అయితే నవ్వించే నటుడుని హీరోగా ప్రేక్షకులు ఏమేరకు ఆదరిస్తున్నారు? ఇప్పటి వరకూ ఒక్క హాస్యనటుడైనా ఫుల్ టైమ్ హీరోగా స్థిరపడ్డాడా? సినిమా విజయంలో భాగం పంచుకున్న హాస్యనటులు హీరోలుగా రాణించలేకపోతున్నారా? నాటి నుంచి ఇదే పంథా నడుస్తోందా ? తెలుగువన్ స్పెషల్ స్టోరీ.

స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న హాస్యనటులు చాలామంది... ఆ తరువాత హీరోలుగా మారి ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేశారు.... అందులో ఎంతమంది హీరోలుగా కంటిన్యూ అయ్యారన్న విషయాన్ని పక్కనపెడితే... చాలామంది కమెడియన్లు కెరీర్ లో ఎప్పుడో ఒకప్పుడు హీరో అవ్వాలనే కోరికను దాదాపుగా నెరవేర్చుకున్నారు....లేటెస్ట్ గా ఈ జాబితాలో చేరాడు హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి. గీతాంజలి సినిమాతో హీరోయిన్ ని మౌనంగా ప్రేమించే వ్యక్తిగా ... హీరో కాని హీరోలా మంచి మార్కులే సంపాదించుకున్నాడు. అయితే ఈసారి ఫుల్ టైమ్ హీరోగా నటించేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ హీరోలుగా మురిపించిన, మురిపిస్తున్న కమెడియన్స్ ఎవరో? వాళ్లెంతవరకూ సక్సెస్ అయ్యారో చూద్దాం.
జమానా కాలంలో వచ్చిన గుణసుందరి కథతో హీరోగా అవతారమెత్తాడు హాస్యనటుడు కస్తూరిశివరావు. ఆ సినిమా అద్భు తమైన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ఆయన హీరోగా కంటే హాస్యనటునిగానే ఎక్కువగా రాణించారు. అదే సమయంలో హాస్య నటుడు రేలంగి...పక్కింటి అమ్మాయి, పెద్దమనుషులులో ప్రధానపాత్రలు పోషించినా అంత గుర్తింపురాలేదు. ఆ తర్వాత రాజబాబు, చలం, పద్మనాభం హీరోలుగా ట్రై చేశారు. రాజ బాబు హీరోగా తాతమనవడు, మనిషి రోడ్డున పడ్డాడు, తిరుపతిలో నటిస్తే..... చలం హీరోగా బుల్లెమ్మ-బుల్లోడు, మట్టిలోమాణిక్యం, బొమ్మా బొరుసా, తోటరాముడు, సంబరాల రాంబాబు లో హీరోగా మెప్పించాడు. అటు పద్మనాభం సైతం హీరోగా పొట్టిప్లీడరు, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న, జాతకరత్న మిడతంబొట్లులో మెప్పించాడు.
.jpg)
నేటి హాస్యనటుల విషయానికొస్తే ప్రస్తుతం హీరోగా కొనసాగుతున్న సునిల్ ఫుల్ బిజీగా ఉన్నాడు. అందాలరాముడితో హీరోగా మారిన సనిల్ మర్యాదరామన్నతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నా హీరోగా చెప్పుకోదగిన విజయాల్లేవు. మర్యాదరామన్న సైతం రాజమౌళి వల్లే హిట్టైందనేది అందరికీ తెలిసిన విషయమే. హీరోగా ఎక్కువ కాలం కొనసాగిన కమెడినయ్ల లిస్ట్ లో ఫస్ట్ ఉంటుంది అలీ పేరు. యమలీలతో మెప్పించి ఘటోత్కజుడుతో విజయం సాధించిన అలీ ఆ తర్వాత ఆఫర్లైతే దక్కించుకున్నాడు కానీ ఆ స్థాయిలో హిట్స్ లేవు. వారేవా ఏమి ఫేసు అచ్చం హీరోలా ఉంది బాసూ అన్న పాటతో ఉత్సాహం తెచ్చకున్న బహ్మానందం సైతం హీరోగా ట్రై చేశాడు. బాబాయ్ హోటల్, జోకర్ మామ-సూపర్ అల్లుడు ఈ మధ్యే జప్ఫా లో హీరోగా కనిపించినా ప్రేక్షకాదరణ పొందలేకపోయాడు.
వేణుమాధవ్(భూకైలాస్, ప్రేమాభిషేకం) , కృష్ణ భగవాన్ (జాన్ అప్పారావు 40ప్లస్, మిస్టర్ గిరీశం, దొంగ సచ్చినోళ్ళు) సైతం హీరోలుగా అడుగేసిన వాళ్లే. కానీ ఆరంభంలోనే బోల్తాకొట్టి సైలెంట్ గా కామెడీ తో బండి లాగించేస్తున్నారు. అతిచేసి ఆదరణ సంపాదించుకున్న ధనరాజ్, తాగుబోతు రమేశ్ కూడా ప్రేక్షకులని క్షమించలేదు. ఏకేరావ్ పీకేరావ్ సినిమాతో వీళ్లూ హీరోలైపోయారు. ఎంచక్కా నవ్వించే వెన్నెల కిషోర్ కు సైతం పైత్యం ముదిరి అతడు ఆమె స్కూటర్ తో హీరో అవతారమెత్తాడు. ఆ తర్వాత ఎవరి పని వాళ్లే చెయ్యాలనే అసలు విషయం గ్రహించి మళ్లీ నవ్వించే పనిలో పడ్డారంతా.
ఈ లెక్కన ఇప్పటివరకూ హీరోగా టర్న్ అయిన హాస్యనటుల్లో చలం తప్ప మరెవ్వరూ పూర్తిస్తాయి హీరోలుగా క్లిక్కవలేదు. కారణం హీరో అవ్వాలన్న ఆత్రం తప్ప తాము హీరోయిజం ప్రదర్శించగలమా అని ప్రశ్నించుకోపోవడమే. పైగా హీరోలైన హాస్యనటులు సినిమాల్లో హిట్స్ కన్నా ప్లాపుల శాతమే ఎక్కువ. టాలీవుడ్ తో పాటూ ...ఇతర భాషా చిత్రాల్లోనూ ఇలాగే ఉంది. అయితే రీసెంట్ గా నేనూ ట్రై చేస్తా అంటున్నాడు కమెడియన్ శ్రీనివాసరెడ్డి. మిగిలిన వాళ్లకి శ్రీనివాసరెడ్డికి ఉన్న చిన్న తేడా ఏంటంటే..ఇప్పటి వరకూ శ్రీనివాస రెడ్డికి కమెడియన్ గా ఒక్క మైనస్ మార్కు పడలేదు. పైగా సినిమా ఫ్లాప్ అయినా శ్రీనివాసరెడ్డి నటన మాత్రం హాయిగా నవ్వులు పూయించింది. దీంతోపాటూ గీతాంజలిలో హీరో కాని హీరోలా అమాయకంగా నటించి మంచి మార్కులే సంపాదించుకున్నాడు. మరి ఈ లెక్కన శ్రీనివాసరెడ్డి చలం ని ఆదర్శంగా తీసుకుని జాగ్రత్తగా అడుగేస్తాడో? మిగిలిన వాళ్లలా హీరో అవ్వాలనే ఆత్రంతో మైనస్ మార్కులేయించుకుంటాడా? చూద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



