చిత్రం చూడర మూవీ రివ్యూ
on May 11, 2024
.webp)
మూవీ : చిత్రం చూడర
నటీనటులు: వరుణ్ సందేశ్, కాశీ విశ్వనాథ్, ధన్ రాజ్ , శివాజీ రాజా, శీతల్ భట్, తనికెళ్ళ భరణి, రవిబాబు, తదితరులు
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
సినిమాటోగ్రఫీ: జవహార్ రెడ్డి ఎమ్.ఎన్
మ్యూజిక్: రధన్
నిర్మాతలు: శేషు మారంరెడ్డి, బోయిని భాగ్యలక్ష్మి
దర్శకత్వం: ఆర్ ఎస్ హర్షవర్ధన్
ఓటీటీ : ఈటీవీ విన్
కథ:
ఒక ఊళ్లో రంగారావు, మొద్దు, బాలా కలిసి నాటకాలు వేస్తుంటారు. రుక్మిణీ డ్రామా కంపెనీ నాటకమంటే అందరు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. రంగారావు (కాశీ విశ్వనాథ్), మొద్దు(ధన్‌రాజ్)లతో కలిసి బాలా (వరుణ్ సందేశ్) నాటకాలు వేస్తుంటాడు. అయితే అదే ఊరిలో ఉన్న రౌడీకి వ్యతిరేకంగా బాలా ఓ నాటకం వేస్తాడు. ఆ నాటకంలో బాలా నటన చూసి సినిమా ప్రొడక్షన్ మేనేజర్ మల్లేషం (శివాజీ రాజా) ఇంప్రెస్ అవుతాడు. తాము తీయబోతున్న కొత్త సినిమాలో బాలాకు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఇస్తాడు. ఆ సినిమా ఆఫర్ కోసం హైదరాబాద్ వచ్చిన బాలాతో పాటు మొద్దు, రంగారావులు దొంగతనం కేసులో ఇరుక్కుంటారు. సినిమా ఆఫీస్‌లోనే డబ్బు కొట్టేశారని ముగ్గురిని సీఐ సారంగపాణి (రవిబాబు) అరెస్ట్‌చేస్తాడు. బాలాకు సినిమాలో ఆఫర్ ఇచ్చిన మల్లేషం ..సీఐ సారంగపాణితో కలిసి తెలివిగా బాలా, మొద్దు, రంగారావులను ఈ కేసులో ఇరికిస్తాడు. అతడు అలా ఎందుకు చేశాడు? ఈ నేరం నుంచి బాలాను, అతడి స్నేహితులను రక్షించిన చిత్ర (శీతల్ భట్) ఎవరు? చిత్రతో బాలాకు ఉన్న సంబంధం ఏమిటి? సినిమాల్లో నటించాలనే బాల కల నెరవేరిందా లేదా అనేది మిగతా కథ...
విశ్లేషణ:
సినిమాల్లో నటించాలనే ఒకడి డ్రీమ్ కోసం అతను సిటీకి రావడంతో కథ ఆసక్తిగా మారుతుంది. అయితే కథనం చాలా నెమ్మదిగా సాగడంతో సినిమాని చూసే కొద్దీ చూడాలనే ఇంట్రస్ట్ తగ్గిపోతుంటుంది.
థ్రిల్లర్ సినిమాలని ఇష్టపడే వారికి కావలసిన కొన్ని బేసిక్ ఎలిమెంట్స్ కూడా లేకపోవడం కాస్త ఇబ్బంది పెడుతుంది. నిజానికి కాస్త కాదు చాలా.. ఎందుకంటే సినిమా నిడివి రెండు గంటలు. చాలా చిన్న పాయింట్ అతని డ్రీమ్ ని ఫుల్ ఫిల్ చేసుకోడానికి సిటీకి వెళ్తే అతనికి ఎదురైన అనుభవం. గంట సినిమాకి అర్థం పర్థం లేని సీన్లు జోడించి, అక్కర్లేని పాటలు.. మొదటి ముప్పై నిమిషాల్లో కథ ఇంకెప్పుడు మొదలవుతుందనే భావన ప్రతీ ఒక్కరికి కలుగుతుంది.
చిత్ర పాత్రని ఒకప్పటి వేశ్యగా చూపుంచడమేంటో .. ఆమెతో హీరోకి లవ్ ఏంటో.. అంతా గందరగోళంగా సాగుతుంది. డెప్త్ ఉన్న సీన్లు ఒక్కటంటే ఒక్కడి కూడా లేకపోవడంతో సినిమాని చూడాలనుకునే ప్రేక్షకుడికి.. చిత్రం చూడరా బాబు అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో పాత్రలు వస్తూనే ఉంటాయి. మొదట రవిబాబు, తనికెళ్ళ భరణి, మీనా వసు, ఇలా కొత్త పాత్రలతో నింపేసారు. అసలు ఆ సీన్లు అన్నీ బలవంతంగా లాక్కొచ్చి జోడించినట్టుగా ఉంటాయి. ఇక క్లైమాక్స్ సాధారణంగా ఉంది.
సినిమా మొత్తం సాదాసీదాగా సాగుతుంది. హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ వర్కవుట్ అవ్వలేదు.. థ్రిల్ ని పంచే సీన్లు లేవు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ పై స్పెషల్ గా శ్రద్ధ చూడాల్సింది. ఎందుకంటే దాదాపు నలభై నిమిషాల సినిమాని ట్రిమ్ చేయొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
వరుణ్ సందేశ్, ధన్ రాజ్, కాశీ విశ్వనాథ్, శివాజీరాజా, రవిబాబు, తనికెళ్ళ భరణి అందరు తమ పాత్రలకి న్యాయం చేశారు. మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా :
థ్రిల్లర్ సినిమాలని ఇష్టపడే వారే కాదు.. కామన్ ఆడియన్స్ కూడా ఈ చిత్రం చూడకపోవడమే బెటర్.
రేటింగ్ : 2/ 5
✍️. దాసరి మల్లేశ్
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



