చిరంజీవిని ‘మెగాస్టార్’ ని చేసింది ఆ రూమర్లేనా?
on Nov 1, 2017
ప్రతి హీరోకీ అభిమానులుంటారు. బాలయ్య ఫ్యాన్స్ బాలయ్య డాన్స్ నే ఇష్టపడతారు. ఫైట్స్ కానీ,, నటన కానీ.. లుక్ కానీ.. అన్నింటిలో వాళ్లకు బాలయ్యే కింగ్. మిగిలిన హీరోల అభిమానులు కూడా అంతే. ఎవరి హీరో వారికి కింగ్. కానీ.. టాలీవుడ్ కింగ్ అవ్వాలంటే మాత్రం.. అందరికీ నచ్చాలి. అందరూ మెచ్చాలి. తాను మరొకరి అభిమాని అయినా.. ఒక్కసారైనా.. సదరు హీరో సినిమా చూడటానికి ఆసక్తి చూపించాలి. పిల్లలు, ముసలి ముతక.. అందరూ అతడ్ని అభిమానించాలి. కనీసం అతనిపై ఆసక్తిని చూపించాలి. అలాంటి వాడే నంబర్ వన్ కాగలడు. మొన్న ఎన్టీయార్.. నిన్న చిరంజీవి... అలా అయిన వారే.
వీళ్లద్దర్నీ కెరీర్లనూ ఒక్కసారి గమనిస్తే.. నిజానికి ఎన్టీయార్ చేసినన్ని వైవిధ్యమైన పాత్రలు చిరంజీవి చేయలేదు. ఎన్టీయార్ అంత గొప్ప నటుడు కూడా చిరంజీవి కాదు. ఎన్టీయార్ అంత అందగాడూ కాదు. సంఖ్యా పరంగా కూడా ఎన్టీయార్ చేసినన్ని సినిమాలు చిరంజీవి చేయలేదు. కానీ.. ఎన్టీయార్ తర్వాత అంతటి స్టార్ డమ్ ని తెచ్చకున్నాడు చిరంజీవి. దానికి కారణం ఏంటి? దానికి కొన్ని విషయాలు చెప్పాలి.
1982లో ‘ఖైదీ’ విడుదలైంది. నిజానికి ఆ సినిమాతోనే... నంబర్ వన్ గా చిరంజీవి డిక్లయిర్ అయిపోయాడు. ఎందుకంటే.. అదే ఏడాది ఎన్టీయార్ ముఖ్యమంత్రి అయ్యారు. సో... టాలీవుడ్ లో నంబర్ వన్ స్థానం ఖాళీ అయ్యింది. ఆ స్థానాన్ని చిరంజీవి ‘ఖైదీ’తో పూరించేశాడు. అయితే... అప్పటికి అది అందరూ అంగీకరించలేని విషయం. ఎందుకంటే.. అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు.. ఇంకా సినిమాలు విరివిగా చే్స్తునే ఉన్నారు. పెద్దవాళ్లు ఉండగా.. చిరంజీవికి ‘నంబర్ వన్’ స్థానం ఎలా ఇస్తారనేది అప్పటి వాదన. కానీ.. ఇంటర్నల్ గా జనాల్లో మాత్రం ఓ ఒపీయన్ వచ్చేసింది. అయితే అది అధికారికంగా ఖరారవ్వాలి. ఎలా? ‘ఖైదీ’ వచ్చి ఏడేళ్లు గడిచింది. ఈ ఏడేళ్లలో చిరంజీవి అప్రతిహతమైన విజయాలను అందుకొని ‘సుప్రీమ్ హీరో’గా ఎదిగాడు. అప్పటికే ఆయన అత్యధిక జనాదరణ పొందిన హీరో. కానీ... ‘నంబర్ వన్’ గా మాత్రం డిక్లయిర్ చేయలేదు.
నంబర్ వన్ అవ్వాలంటే... హిట్స్ పడితే చాలదు. జనాల్లో ఎప్పటికప్పుడు ఆ హీరో పేరు నానుతూ ఉండాలి. అతను ఎప్పటికప్పుడు టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అవ్వాలి. సో.. ఎవరు పుట్టించారో తెలీదు కానీ.. 1989 నుంచి చిరంజీవిపై కొన్ని రూమర్లు రావడం మొదలైంది. అవి సినిమాలతో ప్రమేయం లేకుండా జనాల్లో చిరంజీవి పేరు నానేలా చేశాయ్.
1. అందులో మొదటి రూమర్-
‘లంకేశ్వరుడు’ సినిమా షూటింగ్ లో చిరంజీవి అనారోగ్యం పాలయ్యారు. ఓ పాటలో బ్రేక్ డాన్స్ చేస్తుండగా.. ఓ కష్టమైన స్టెప్ వేస్తున్నప్పుడు ఆయన కడుపులోని పేగులు మెలిపెట్టుకుపోయాయ్. తీవ్రమైన బాధతో ఆయన హాస్పటల్ లో చేరారు.
2. ఆ తర్వాత సంవత్సరం రెండో రూమర్-
‘చిరంజీవి త్వరలో చనిపోబోతున్నాడు.. అతని ఆయువు ఈ ఏడాదితో తీరిపోబోతోంది’.. సాక్షాత్ సత్యసాయిబాబా ఈ మాట అన్నాడట.(రూమర్).
3. దీనికి కొనసాగింపుగా.. మూడో రూమర్-
ఇది చిరంజీవి పుట్టిన రోజు నుంచి వినిపించడం విశేషం..‘చిరంజీవి పుట్టిన రోజు కేక్ లో ఎవరో విషం కలిపారట!’.
మీడియా సరిగ్గా లేని రోజుల్లోనే ఈ మూడు రూమర్లు తెలుగునేలపై ఓ రేంజ్ లో హల్ చల్ చేశాయ్. అందరి దృష్టి చిరంజీవిపై పడేట్టు చేశాయ్.
ఇంతమంది హీరోలుండగా కేవలం చిరంజీవిపైనే ఎందుకు ఈ రూమర్లు? అనే సందేహం జనాల్లో రావడం మొదలైంది. ఇండస్ట్రీలో కూడా చిరంజీవి ఓ ప్రముఖ టాపిక్ గా మారాడు.
అంటే.. కేవలం ఈ రూమర్లే చిరంజీవిని సూపర్ స్టార్ ని చేశాయని చెప్పడం మా ఉద్దేశ్యం కాదు. అప్పటికే జనాల్లో సూపర్ స్టార్ గా ఎదిగిన చిరంజీవిని.. ‘ఎస్.. ఇతనే సూపర్ స్టార్’ అని ప్రపంచానికి తెలియజేశాయ్ అంటున్నాం.
ఈ రూమర్లు బహుశా చిరంజీవి అభిమానులో.. లేక అనునాయులో సృష్టించి ఉంటారనే టాక్ కూడా ఉంది. ఏది ఏమైనా.. ఎన్టీయార్ 35 ఏళ్లు తెలుగు తెరను శాసిస్తే.. చిరంజీవి 25 ఏళ్లు తెలుగు తెరను మకుటం లేని మహారాజుగా ఏలారు. తెలుగు సినిమా పుట్టాక.. ఈ ఇద్దరే.. వెండితెరను ఎక్కవ ఏళ్లు ఏలిన సూపర్ స్టార్స్.