'చెన్నకేశవ రెడ్డి' స్పెషల్ షోలు.. అసలుసిసలు మాస్ హంగామా!
on Sep 20, 2022

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'చెన్నకేశవ రెడ్డి'. సెప్టెంబర్ 25, 2002న విడుదలైన ఈ చిత్రం ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. 'సమరసింహా రెడ్డి', 'నరసింహ నాయుడు' తర్వాత థియేటర్స్ లో బాలయ్య ఫ్యాన్స్ కి ఆ రేంజ్ లో పూనకాలు తెప్పించిన సినిమా ఇదే. ఇప్పుడు ఈ చిత్రం మరోసారి థియేటర్స్ లో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.
టాలీవుడ్ లో స్పెషల్ షోల ట్రెండ్ రోజురోజుకి పెరిగిపోతుంది. ఇటీవల భారీస్థాయిలో ప్రదర్శించిన 'పోకిరి', 'జల్సా' సినిమా స్పెషల్ షోలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే త్వరలో అసలుసిసలు మాస్ హంగామా చూడబోతున్నాం. 'చెన్నకేశవ రెడ్డి' విడుదలై ఈ సెప్టెంబర్ 25కి ఇరవై ఏళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా భారీస్థాయిలో స్పెషల్ షోలు ప్రదర్శించబోతున్నారు. ఇప్పటికే యూఎస్ థియేటర్స్ లిస్ట్ వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనూ భారీగా షోలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమా అంటే ముందుగా బాలయ్యే గుర్తుకొస్తాడు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్, డైలాగ్ డెలివరీ ఎవరూ మ్యాచ్ చేయలేని విధంగా ఉంటాయి. 'చెన్నకేశవ రెడ్డి' చిత్రంలో 'శరభ శరభ' అనే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో బాలయ్య నడిచొస్తుంటే థియేటర్లలో మోత మోగిపోయింది. 'సౌండ్ చేయకు కంఠం కోసేస్తా' వంటి డైలాగ్ లు ఫ్యాన్స్ గోల చేసేలా చేశాయి. మరి 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా వేస్తున్న ఈ స్పెషల్ షోలతో బాలయ్య ఫ్యాన్స్ ఎలాంటి హంగామా సృష్టిస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



