కీరవాణికి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి!
on May 21, 2024

'జయజయహే తెలంగాణ' పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ఇటీవల రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందెశ్రీ రచించిన ఈ పాట తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. ఈ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామని గత కేసీఆర్ సర్కార్ చెప్పినా.. అది జరగలేదు. అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించింది. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఇదిలా ఉంటే ఈ గీతం విషయంలో ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణికి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.
ఎం.ఎం. కీరవాణితో తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారితో పాటు రచయిత అందెశ్రీ, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో 'జయజయహే తెలంగాణ' గీతం గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ గీతాన్ని స్వరపరచి, ఆలపించే బాధ్యతను కీరవాణికి అప్పగించినట్లు సమాచారం.

ఈ జూన్ 2 తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్న సందర్భంగా.. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఆ లోగా పాటను రూపొందించాలని కీరవాణికి సీఎం చెప్పినట్టు వినికిడి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



