'భోళా శంకర్' డబ్బింగ్ పూర్తి చేసిన హాస్య బ్రహ్మ
on Jul 13, 2023
ఈ ఏడాది 'వాల్తేరు వీరయ్య' అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి, అదే ఉత్సాహంతో ఆగస్టులో 'భోళా శంకర్'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు అభిమానులను అలరించాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ ని దర్శకుడు మెహర్ రమేష్ పంచుకున్నారు. అదేంటంటే 'భోళా శంకర్' సినిమాలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం నటిస్తున్నారు.
కొంతకాలంగా సినిమాలను బాగా తగ్గించిన బ్రహ్మానందం, కొన్ని ఎంపిక చేసుకున్న సినిమాల్లో మాత్రమే సందడి చేస్తున్నారు. ఇప్పుడు ఆయన 'భోళా శంకర్'లో ఓ ప్రత్యేక పాత్రలో అలరించనున్నారు. ఈ విషయాన్ని తాజాగా దర్శకుడు మెహర్ రమేష్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 'భోళా శంకర్'లో అతిథి పాత్రలో నటిస్తున్న హాస్య బ్రహ్మ డబ్బింగ్ పూర్తి చేశారని, థియేటర్లలో మనం బిగ్గరగా నవ్వడం గ్యారెంటీ అని మెహర్ రమేష్ రాసుకొచ్చారు. అలాగే డబ్బింగ్ చెబుతున్న సందర్భంగా తీసిన ఫొటోలను కూడా ఆయన పంచుకున్నారు. వాటిలో బ్రహ్మానందం డబ్బింగ్ చెబుతూ ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
