'భళా తందనాన' మూవీ రివ్యూ
on May 5, 2022

సినిమా పేరు: భళా తందనాన
తారాగణం: శ్రీవిష్ణు, కేథరిన్ థ్రెసా, గరుడ రామ్, పోసాని కృష్ణ మురళి, శ్రీనివాస రెడ్డి, సత్య, అయ్యప్ప పి. శర్మ, చైతన్య కృష్ణ, రవివర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదర్శ్ బాలకృష్ణ, భూపాల్ రాజు
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు
ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్
నిర్మాత: రజని కొర్రపాటి
దర్శకత్వం: చైతన్య దంతులూరి
బ్యానర్: వారాహి చలన చిత్రం
విడుదల తేదీ: మే 06, 2022
జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. ఆయన ప్రధానపాత్ర పోషించిన లేటెస్ట్ మూవీ 'భళా తందనాన'. 'బాణం' ఫేమ్ చైతన్య దంతులూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కేథరిన్ థ్రెసా హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్ తో సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.
కథ:
అధికార బలానికి, డబ్బు ఆశకి లొంగకుండా నిజాన్ని నిర్భయంగా రాసే జర్నలిస్ట్ గా శశిరేఖ(కేథరిన్)కు పేరుంది. ఒకసారి ఆమెకు ఓ చారిటబుల్ ట్రస్ట్ పై రైడ్ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో ఆ న్యూస్ కవర్ చేయడం కోసం ఆమె అక్కడికి వెళ్తుంది. అయితే అక్కడ అకౌంటెంట్ గా పనిచేసే చందు(శ్రీవిష్ణు) మీరు ఈ న్యూస్ రాయడం వల్ల ట్రస్ట్ కి వచ్చే ఫండ్స్ ఆగిపోతాయి, ఎందరో అనాథ పిల్లలు రోడ్డున పడతారు అంటూ ఆమెని ఆ న్యూస్ రాయకుండా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. ఈ క్రమంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారి ప్రేమకి దారితీస్తుంది. మరోవైపు హవాలా కింగ్ గా ఎదిగిన ఆనంద్ బాలి(గరుడ రామ్)కి చెందిన ముగ్గురు మనుషులు ఓ కిడ్నాప్ లో ఇన్వాల్వ్ అయ్యాక వరుసగా హత్య చేయబడతారు. అసలు వాళ్ళు కిడ్నాప్ చేసింది ఎవరిని? వారి హత్యలకు కారణమేంటి? రెండు వేల కోట్లు కొట్టేసింది ఎవరు? ఈ మొత్తం వ్యవహారానికి చందు, శశిరేఖలకు సంబంధం ఏంటి? అనేది మిగతా కథ.
ఎనాలసిస్:
2009 లో వచ్చిన 'బాణం' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన చైతన్య.. ఈ 13 ఏళ్ల కెరీర్ లో డైరెక్టర్ గా మూడు సినిమాలు మాత్రమే చేశాడు. మొదటి రెండు సినిమాలు 'బాణం', 'బసంతి' విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి కానీ కమర్షియల్ సక్సెస్ మాత్రం సాధించలేకపోయాయి. అందుకేనేమో చాలా గ్యాప్ తీసుకొని మరీ సరైన హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో మూడో సినిమా 'భళా తందనాన'కి కాస్త కమర్షియల్ టచ్ ఇచ్చాడు చైతన్య. కానీ ఈ సినిమాతో కూడా చైతన్య సాలిడ్ హిట్ అందుకోవడం కష్టమనే చెప్పాలి.
ఓటీటీల పుణ్యమా అని ఎన్నో భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకులు చూస్తున్నారు. ముఖ్యంగా ఎన్నో క్రైమ్ థ్రిల్లర్స్ వారిని కట్టిపడేశాయి. ఇలాంటి తరుణంలో ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ని మెప్పించడం అనేది కత్తి మీద సాము లాంటిందే. ప్రేక్షకుల అంచనాలకు మించి కథాకథనాలు ఉంటేనే వారు ఆదరిస్తారు. కానీ 'భళా తందనాన' ఆ రేంజ్ లో లేదు.
ఫస్టాఫ్ సాదాసీదాగా సాగిపోయింది. కిడ్నాప్, మర్డర్స్, శ్రీవిష్ణు-కేథరిన్ ల ఫ్రెండ్ షిప్ తో ఫస్టాఫ్ నడుస్తుంది. శ్రీవిష్ణు ఫ్రెండ్ గా నటించిన సత్య కామెడీ ట్రాక్ ఒకట్రెండు చోట్ల తప్ప పెద్దగా నవ్వించదు. ప్రీ ఇంటర్వెల్ వరకు నార్మల్ గా సాగగా.. ఓ ట్విస్ట్ తో ఇంటర్వెల్ పడుతుంది. ఫస్టాఫ్ తో పోల్చితే సెకండాఫ్ మెరుగ్గా ఉంది. ఎందుకంటే అసలు కథ సెకండాఫ్ లోనే ఉంటుంది. కథనంలో కూడా వేగం వస్తుంది. 2000 కోట్లు కొట్టేయడానికి వేసే ప్లాన్, పోసాని-సత్య మధ్య వచ్చే కామెడీ ట్రాక్ అలరిస్తాయి. ప్రమోషన్స్ లో శ్రీవిష్ణు చెప్పినట్లు క్లైమాక్స్ కొత్తగా ట్రై చేశారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉన్న క్లైమాక్స్ ఆకట్టుకుంది.
అయితే ఈ సినిమాకి పెద్ద మైనస్ హీరో పాత్రకి జస్టిఫికేషన్ ఇవ్వకపోడం. అసలు హీరో ఎవరు? అతను విలన్ ని ఎందుకు టార్గెట్ చేశాడు? అనేవి చూపించలేదు. సినిమా చివరిలో భళా తందనాన సీక్వెల్ ఉన్నట్లుగా హింట్ ఇచ్చాడు డైరెక్టర్. బహుశా పార్ట్-2 లో చూపించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు రివీల్ చేయలేదేమో. కానీ అదే వాళ్ళు చేసిన పెద్ద తప్పు. నిజానికి ఈ సినిమాకి సీక్వెల్ అవసరం లేదు. ఎందుకంటే కథలో అంతగా బలం లేదు. హీరో పాత్రకి సరైన ముగింపు ఇచ్చి, స్క్రీన్ ప్లే మరింత పగడ్బందీగా రాసుకొని ఉంటే ఈ సినిమా ఇలా యావరేజ్ అనిపించుకునేది కాదు.
సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ బాగుంది. సాంగ్స్ తో పర్వాలేదు అనిపించుకున్న మణిశర్మ.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు.
నటీనటుల పనితీరు:
శ్రీవిష్ణు ఎప్పటిలాగే యాక్టింగ్ అదరగొట్టాడు. పాత్రలో ఉన్న రెండు షేడ్స్ లో చక్కగా రాణించాడు. ఒక వైపు సాఫ్ట్ యువకుడిగా, మరోవైపు మాస్ యువకుడిగా వేరియేషన్ బాగా చూపించాడు. ఇక ఈ సినిమాలో కేథరిన్ కి మంచి పాత్ర దక్కింది. ఆమె తన నటనతో మెప్పించింది కానీ కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఆమె ఫేస్ లో ఏజ్ ఎక్కువగా కనిపించింది. 'సరైనోడు', 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాల్లో కనిపించినంత గ్లామర్ గా ఆమె కనిపించలేదు. ఈ సినిమాకి ఆమెనే డబ్బింగ్ చెప్పుకుంది. అయితే కొన్నిచోట్ల లిప్ సింక్ అయినట్లు అనిపించలేదు. విలన్ గా గరుడ రామ్ రాణించాడు. దయామయం పాత్రలో పోసాని కృష్ణమురళి అలరించాడు. సత్య, శ్రీనివాస్ రెడ్డి, అయ్యప్ప పి. శర్మ, చైతన్య కృష్ణ, రవివర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
విభిన్న చిత్రాలు ఎంపిక చేసుకుంటాడనే పేరున్న శ్రీవిష్ణు, విభిన్న చిత్రాలు తెరకెక్కిస్తాడని పేరు తెచ్చుకున్న చైతన్య దంతులూరి కలిసి చేసిన 'భళా తందనాన' సినిమా 'భళా' అనిపించుకోలేకపోయింది. అక్కడక్కడా మెరిపిస్తూ ఓ మాదిరి సినిమాగా మిగిలిపోయింది.
రేటింగ్: 2.5/5
-గంగసాని
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



