నా మాటలను కావాలనే వక్రీకరించారు!
on Feb 6, 2023
నర్సులను కించపరిచారంటూ నందమూరి బాలకృష్ణపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే బాలకృష్ణ మాత్రం కొందరు కావాలనే తన మాటలను వక్రీకరించి, అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు.
బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ ఒక సంఘటనను పంచుకున్నారు. తాను యువకుడిగా ఉన్న సమయంలో బైక్ మీద నుండి కిందపడిపోయానని, అప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్ళి కాలుజారి కిందపడ్డానని అబద్దం చెప్పమన్నారని తెలిపారు. కానీ అక్కడ చాలా అందమైన నర్స్ ఉందని, ఆమె ఏమైందని అడగటంతో నిజం చెప్పేశానని బాలయ్య చెప్పుకొచ్చారు. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలు నర్సులను కించపరిచేలా ఉన్నాయంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
"నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నా మాటలను కావాలనే వక్రీకరించారు. రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వేళ ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది నర్సులు పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకొని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను" అన్నారు బాలకృష్ణ.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
