ENGLISH | TELUGU  

అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు మూవీ రివ్యూ

on Dec 30, 2016

నారా రోహిత్‌కి పెద్ద పెద్ద విజ‌యాలేం ద‌క్కుండ‌క‌పోవొచ్చు. కానీ త‌న వంతుగా కొన్ని మంచి ప్ర‌య‌త్నాలు చేశాడ‌నే చెప్పాలి. బాణం, సోలో, ప్ర‌తినిధి, శంక‌ర‌... ఇవ‌న్నీ క‌థా క‌థ‌నాల ప‌రంగా మంచి సినిమాలే.  కానీ కొన్ని సార్లు అనుకొన్న ఫ‌లితాన్ని తీసుకురాలేదంతే.  కాక‌పోతే రోహిత్ సినిమా కాస్త‌రొటీన్ కి భిన్నంగా ఉండే అవ‌కాశాలున్నాయ‌న్న న‌మ్మ‌కాన్ని క‌లిగించాయి. ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన‌ `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` కూడా అలాంటి సినిమానే.  మ‌రి ఈ సినిమా క‌థ‌, క‌థ‌నాలెలా ఉన్నాయి?  బాక్సాఫీసు ద‌గ్గ‌ర భ‌విత‌వ్యం ఎలా ఉండ‌బోతోంది?  తెలుసుకొంటే...

* క‌థ‌

ఇంతియాజ్ (నారా రోహిత్‌) ఓ సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌.  త‌న తండ్రి కూడా పోలీసే. కానీ.. న‌క్స‌లైట్  దాడిలో ప్రాణాలు కోల్పోతాడు. అప్ప‌టి నుంచీ న‌క్స‌లైట్స్ అంటే క‌సీ, కోపం. వాళ్లని ఏరిపారేయ‌డ‌మే ధ్యేయంగా ఎంచుకొంటాడు. అందుకోసం రూల్స్‌ని బ్రేక్ చేయ‌డానికి కూడా వెనుకంజ వేయ‌డు. మ‌రోవైపు రైల్వే రాజు (శ్రీ‌విష్ణు) క‌థ న‌డుస్తుంటుంది. క్రికెట‌ర్ అవ్వాల‌న్న‌ది త‌న ఆశ‌. జాతీయ జ‌ట్టులో స్థానానికి అడుగు దూరంలో ఉండ‌గా... ఇంతియాజ్ అడ్డు ప‌డ‌తాడు. న‌క్స‌ల్స్‌తో రాజుకి సంబంధాలున్నాయ‌ని.. అరెస్టు చేస్తాడు. రాజు అక్క ఐదేళ్ల క్రితం ఎవ‌రినో ప్రేమించి, పెళ్లి చేసుకొని అడ‌వుల్లోకి వెళ్లిపోయి... అక్క‌డే న‌క్స‌లైట్‌గా మారి ఉద్య‌మాల్లో తిరుగుతుంటుంది. అక్క‌తో రాజుకి ఇంకా ఏమైనా సంబంధాలున్నాయేమో అన్న‌ది ఇంతియాజ్ అనుమానం. దాంతో రాజుని నీడ‌లా వెంటాడుతుంటాడు. ఓసారి ఓ లోక‌ల్ గుండా భ‌గ‌వాన్ దాస్ (జీవీ)తో జ‌రిగిన గొడ‌వ‌లో రైల్వే రాజు అనుకోకుండా  అత‌న్ని చంపేస్తాడు. ఆ హ‌త్య కేసు, న‌క్స‌ల్ కేసు రెండూ రాజు మెడ‌కు చిక్కుకొంటాయి. అక్క‌డి నుంచి రాజు ప్ర‌యాణం ఎటువైపుకు సాగింది?  ఇంతియాజ్ తో శ‌త్రుత్వంలో రాజు కోల్పోయిందేంటి?  సాధించిందేంటి?  అనేదే `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` క‌థ‌. 

* తెలుగు వ‌న్ విశ్లేష‌ణ‌

రెగ్యుల‌ర్ క‌మర్షియ‌ల్ సినిమాకు భిన్నంగా సాగిన సినిమా ఇది. న‌క్స‌ల్ ఉద్య‌మం, పీవీ న‌ర‌సింహారావు సంస్క‌ర‌ణ‌లు.. ఇవ‌న్నీ క‌థ‌లో అడ‌పా ద‌డ‌పా వ‌స్తుంటాయి. చాలా సీరియ‌స్ మేట‌ర్‌కి ఎమోష‌న్ డ్రామాగా న‌డ‌ప‌డంలో ద‌ర్శ‌కుడు స‌ఫ‌లీకృతుడ‌య్యాడు. తొలి స‌న్నివేశం నుంచే ఆస‌క్తిని పెంచాడు. రాజు - ఇంతియాజ్‌ల మ‌ధ్య వైరంతో క‌థ‌లో వేగం వ‌స్తుంది. ఆరు బంతుల్లో నాలుగు సిక్స్‌లు కొట్టే సీన్‌లో ఏం జ‌రుగుతుందో ఆడియ‌న్స్ ముందే ఎక్స్‌పెక్ట్ చేసినా.. దాన్ని తెర‌కెక్కించిన విధానం బాగుంది.  రాజు - ఇంతియాజ్‌ల మ‌ధ్య వైరం, వాళ్ల మ‌ధ్య సాగే పోరాట‌మే... ఈ చిత్రానికి ప్ర‌ధాన బ‌లం. ఆయా స‌న్నివేశాల‌న్నీ బాగా తెరకెక్కించారు. శ్రీ‌నివాస‌రెడ్డి - బ్ర‌హ్మాజీ మ‌ధ్య సాగే బంగారం ఎపిసోడ్  మ‌రీ లెంగ్తీ అయిపోయింది. అందులో కామెడీ కూడా వ‌ర్క‌వుట్ కాలేదు. 20 ఏళ్ల  త‌ర‌వాత ప్ర‌ధాన పాత్ర‌ల‌న్నీ జుత్తు నెరిసి క‌నిపిస్తుంటే.. ప్ర‌భాస్ శీను మాత్రం గెట‌ప్ ఛేంజ్ చేయ‌లేదు. బ‌హుశా.. ద‌ర్శ‌కుడు ఆ పాత్ర గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోలేదేమో..? ప‌తాక స‌న్నివేశాలు ఆక‌ట్టుకొంటాయి. అక్క‌డ ఎమోష‌న్ పండించడానికి ద‌ర్శ‌కుడికి కావ‌ల్సినంత ఛాన్స్ దొరికింది. ప్ర‌తీ పాత్ర‌కీ న్యాయం చేసేలా క్ల‌యిమాక్స్ రాసుకొన్నాడు ద‌ర్శ‌కుడు. ఈ క‌థ‌ని ఇలా ముగించ‌డ‌మే న్యాయం అనిపించేలా ఉంది. ప్ర‌పంచీక‌ర‌ణ ఫ‌లితాల గురించి.. ఒకే ఒక్క డైలాగ్‌లో, సీన్‌లో చూపించేశారు. మ‌రీ లోతుగా వెళితే ఇదేదో ఎక‌నామిక్స్ పాఠంలా త‌యారయ్యేది. శివ ఇంపాక్ట్ ఈ సినిమాలో చాలా క‌నిపిస్తుంది. 1990ల క‌థ కాబ‌ట్టి.. ఆ సినిమాని అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టు వాడుకొన్నారు. 

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

ఈ సినిమాకి ప్ర‌ధాన బ‌లం నారా రోహిత్ - శ్రీ విష్ణు. వారి వారి పాత్ర‌ల్లో చ‌క్క‌గా రాణించారు. ఆ మాట‌కొస్తే రోహిత్ కంటే శ్రీ విష్ణుకే ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. క‌థానాయిక పాత్ర అంతంత మాత్ర‌మే.  చెబుతున్న డైలాగ్‌కీ లిప్ సింక్ కీ ఏమాత్రం సంబంధం లేదు. బ్ర‌హ్మజీ సేటు పాత్ర‌లో ఆక‌ట్టుకొన్నాడు. మిగిలిన వారివ‌న్నీ చిన్న చిన్న పాత్ర‌లే. అయితే ప్ర‌తీ పాత్ర‌కీ ఓ ప‌ర్‌ప‌స్ ఉంటుంది. 


* సాంకేతిక వ‌ర్గం

సాయికార్తీక్ పాట‌లేవీ అంత విన‌సొంపుగా లేవు. పాట‌లు ఈ సినిమాకి మైన‌స్‌. నిజానికి పాట‌ల్ని ప‌క్క‌న పెట్టినా బాగుండేదేమో..?  నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకొంటుంది. స‌న్నివేశం ఎలివేట్ అవ్వ‌డానికి ఆర్‌.ఆర్ దోహ‌ద‌ప‌డింది. క్రికెట్‌కి సంబంధించిన సీన్ల‌లో కెమెరా ప‌నిత‌నం క‌నిపిస్తుంది. సాగ‌ర్ కె.చంద్ర‌కి ఇదే తొలి సినిమా. రొటీన్‌కి భిన్న‌మైన దారిలో న‌డ‌వ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. ఇంత సీరియ‌స్ స‌బ్జెక్ట్‌ని జ‌నం చూస్తారా అనే లెక్క‌లు వేసుకోకుండా.. తాను న‌మ్మింది చూపించ‌గ‌లిగాడు.


* చివ‌రిగా: 'అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు' ఇప్పుడు బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఏమవుతుందో చెప్ప‌లేం గానీ.. కొన్నేళ్లు పోయాక‌... 'అప్ప‌ట్లో ఓ మంచి సినిమా వ‌చ్చింది' అని చెప్పుకొనేలా ఉంది!


* రేటింగ్: 3.0

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.