'బంగార్రాజు'ని ఇబ్బంది పెట్టే నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్!
on Jan 10, 2022

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఉంది ఆంధ్రప్రదేశ్ లో సినిమాల పరిస్థితి. అసలే ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపుతో సతమవుతున్న టాలీవుడ్ కి మరో షాక్ తగిలింది. దేశంలో కరోనా మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉండనుంది. అంతేకాదు, సినిమా థియేటర్స్ ని 50 శాతం ఆక్యుపెన్సీతో నడిపించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపు పెద్ద సినిమాలకు తలనొప్పిగా మారింది. పాన్ ఇండియా మూవీ 'పుష్ప ది రైజ్' విడుదలైన అన్ని చోట్లా లాభాలను చూడగా.. ఒక్క ఏపీలో మాత్రం నష్టాలను చవిచూసింది. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఏపీలో సినిమాల పరిస్థితి ఎలా ఉందో. ఈ నేపథ్యంలోనే పెద్ద సినిమాలను విడుదల చేయాలంటే భయపడుతున్నారు. కరోనా మళ్ళీ విజృంభిస్తుండటంతో పాటు ఏపీలో టికెట్ ధారణల కారణంగా పాన్ ఇండియా సినిమాలు 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' వాయిదా పడ్డాయి. దీంతో పలువురు సినీ ప్రముఖులు మూవీ టికెట్ ధరలపై ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరుతున్నారు. కానీ సీనియర్ హీరో నాగార్జున మాత్రం టికెట్ ధరల తగ్గింపుతో తనకేం ఇబ్బంది లేదని వ్యాఖ్యానించారు. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆయన కూడా ఇప్పుడు ఇబ్బంది పడనున్నారు.
Also Read: ఆంధ్రాలో టికెట్ రేట్ల విషయంలో నాకేం ఇబ్బంది లేదు
నాగార్జున నటించిన 'బంగార్రాజు' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ మూవీ ప్రెస్ మీట్ లో నాగార్జున చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సినీ పరిశ్రమ గురించి ఆలోచించకుండా టికెట్ ధరల తగ్గింపుతో తనకేం ఇబ్బంది లేదంటూ ఏపీ అధికార పార్టీకి మద్దతుగా ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇండస్ట్రీ వ్యక్తిగా కాకుండా వైసీపీ సపోర్టర్ గా ఆయన మాట్లాడుతున్నారని, ఆయన వరకు వస్తే గానీ ఆయనకు బాధ తెలీదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నట్లుగానే ప్రభుత్వ తాజాగా నిర్ణయంతో ఆయనకు ఇబ్బంది తలెత్తే అవకాశముంది.
Also Read: నాగార్జున 'రెండు నాల్కల' తీరుపై సోషల్ మీడియాలో 'రగడ'!
అసలే ఏపీలో సినిమా టికెట్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడు 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడవనున్నాయి. అది చాలదు అన్నట్లు రాత్రి 11 గంటల నుంచి కర్ఫ్యూ ఉండటంతో సెకండ్ షో వేయడం కూడా కుదరదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నడుమ సినిమా విడుదలైతే భారీ నష్టాలను మూటగట్టుకోక తప్పదు. బంగార్రాజు సంక్రాంతి సినిమా అని చెబుతున్న నాగార్జున 'నాకేం ఇబ్బంది లేదంటూ' సినిమాని విడుదల చేస్తారో లేక వాయిదా వేస్తారో చూడాలి మరి. ఈ సంక్రాంతికి రౌడీ బాయ్స్, హీరో, డీజే టిల్లు వంటి సినిమాలు కూడా ఉన్నాయి. వీటి విడుదలపై నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



