18 ఏళ్ళ `అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి`
on Apr 19, 2021
కథానాయకుడిగా మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో ఎన్ని విజయాలున్నా.. మేలిమలుపుగా నిలిచిన చిత్రాలు మాత్రం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ తోనే ముడిపడిఉన్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం` (2001) సోలో హీరోగా రవితేజకి తొలి సూపర్ హిట్ కాగా.. రెండో సినిమా `ఇడియట్` (2002) రవితేజకి టర్నింగ్ పాయింట్ మూవీ. ఇక మూడో చిత్రం `అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి`తో హ్యాట్రిక్ అంకం పూర్తిచేశారు. అలా.. `అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి` సినిమా రవితేజ - పూరి కాంబినేషన్ కి ఎంతో స్పెషల్ అనే చెప్పాలి.
కేరళకుట్టి అసిన్ తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, జయసుధ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. చక్రి సంగీతసారథ్యంలో రూపొందిన పాటలన్నీ అప్పట్లో విశేషాదరణ పొందాయి. మరీ ముఖ్యంగా ``చెన్నై చంద్రమా``, ``నీవే నీవే`` గీతాలైతే ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. తమిళంలో `ఎమ్. కుమరన్ సన్నాఫ్ మహలక్ష్మి`, కన్నడంలో `మౌర్య`, భోజ్ పురిలో `జిగర్ వాలా`, ఒడియాలో `కథ దాయ్తిలి మా కు` పేర్లతో `అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి` రీమేక్ అయింది. అలాగే `తృతీయ ఉత్తమ చిత్రం`, `ఉత్తమ మాటల రచయిత` (పూరి) విభాగాల్లో `నంది` పురస్కారాలు దక్కాయి. వైష్ణో అకాడమీ పతాకంపై నిర్మితమైన `అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి` 2003 ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకొచ్చింది. నేటితో ఈ స్పోర్ట్స్ డ్రామా.. 18 వసంతాలను పూర్తిచేసుకుంది.