కావాలనుకుంటే 'లైగర్' సినిమా చేసేవాడిని.. నాకు మా నాన్న సపోర్ట్ వద్దు!
on Jun 23, 2022
బ్యాక్ గ్రౌండ్ ఉంటే సినిమాల్లోకి రావడం ఈజీనే కానీ నిలదొక్కుకోవాలంటే మాత్రం టాలెంట్ ఉండాలి, కష్టపడాలి. సినీ పరిశ్రమలో బ్యాక్ గ్రౌండ్ ఉన్నా స్టార్ కాలేకపోతున్న వాళ్ళు, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ అయినవాళ్లు ఉన్నారు. అయితే బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన వారిపై తరచుగా నెపోటిజం కామెంట్స్ వినిపిస్తుంటాయి. తాజాగా నెపోటిజంపై స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.
ఆకాష్ హీరోగా నటించిన 'చోర్ బజార్' మూవీ రేపు(జూన్ 24) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా ఆకాష్ మాట్లాడుతూ.. "నా ట్రైలర్స్ రిలీజ్ అయినప్పుడు ప్రతి కామెంట్ చదవడం నాకు అలవాటు. ఎందుకంటే నన్ను ఇష్టపడుతున్నారా లేదా?.. నాలో నేను ఏం మార్చుకోవాలి వంటి విషయాలు తెలుసుకోవడం కోసం నేను కామెంట్స్ చదువుతాను. కొందరు నన్ను ఇష్టపడకపోవడానికి కారణమేంటంటే నెపో కిడ్ అంటున్నారు. నెపో కిడ్ అనే వాడు లాంచ్ అవుతాడు అంతే, సక్సెస్ ఫుల్ అవ్వలేడు. టాలెంట్ ఉంటేనే సక్సెస్ అవుతాడు. అందరూ అనుకోవచ్చు.. పెద్ద డైరెక్టర్ కొడుకు.. రోజూ మందు, సిగరెట్లు, డ్రగ్స్ తీసుకుంటాడు అని. కానీ నేను అలా కాదు. నాకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. నాకంటూ కొన్ని బాద్యతలు ఉన్నాయి. మా నాన్న స్టార్ డైరెక్టర్ అయ్యాక నేను హీరో అవ్వాలి అనుకోలేదు. మా నాన్న స్కూటర్ మీద తిరిగే టైంలోనే హీరో అవ్వాలనుకున్నా. నేను పుట్టడమే ఏసీలో పుట్టలేదు. స్కూటర్ లో తిరిగా, బస్సులో తిరిగా, కార్లలో తిరుగుతున్నా అన్నీ చూశాను." అని అన్నాడు.
"మీ నాన్నతోనే సినిమా చేయొచ్చుగా అని కొందరు అంటున్నారు. నెపోటిజాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి అనుకుంటే.. 'లైగర్' సినిమా నాతోనే చేయి నాన్న అని చెప్పొచ్చు. నేను అడిగితే చేస్తాడు కూడా మా నాన్న. కానీ నాకు అలా వద్దు. నేను కష్టపడి ఏదో ఒక రోజు నాన్న స్థాయికి వెళ్ళాక, అప్పుడు ఇద్దరం కలిసి సినిమా చేస్తాం. ఇప్పటికే నాన్న నాకెంతో చేశారు. పెంచి పెద్ద చేశారు. సినీ ఇండస్ట్రీ అంటే ఏంటో పరిచయం చేశారు. హీరోగా లాంచ్ చేశారు. ఇక మా నాన్న నాకు చేసింది చాలు. నాకు కావాల్సింది మా నాన్న సపోర్ట్ కాదు.. మీ(ఆడియన్స్) సపోర్ట్." అంటూ ఆకాష్ చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి.
"మా నాన్న నాతో సినిమా చేస్తానన్నా కాదనుకొని 'చోర్ బజార్' చేశాను. ఈ సినిమా అంత స్పెషల్ నాకు. మా సినిమాతో పాటు రిలీజ్ అవుతున్న 'సమ్మతమే' కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మా జెనరేషన్ హీరోలకున్న ప్రాబ్లెమ్ ఏంటంటే.. జనాలు థియేటర్స్ కి అంతగా రావట్లేదు. మీరొస్తే మేం ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాం. మాకు సపోర్ట్ చేయండి.. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం మేం కష్టపడతాం" అని ఆకాష్ అన్నాడు.
Also Read