51 వసంతాల `సిసింద్రీ చిట్టిబాబు`!
on Jun 18, 2022

తెలుగువారిని విశేషంగా అలరించిన జంటల్లో `నటభూషణ్` శోభన్ బాబు, `ఊర్వశి` శారద జోడీ ఒకటి. వీరిద్దరు జట్టుకట్టగా ఆకట్టుకున్న చిత్రాల్లో `సిసింద్రీ చిట్టిబాబు` ఒకటి. `మనుషులు మారాలి` వంటి ఘనవిజయం తరువాత శోభన్, శారద కాంబినేషన్ లో వచ్చిన లో ఈ సినిమాని ఎ. సంజీవి (ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ తండ్రి) డైరెక్ట్ చేయగా.. పినిశెట్టి (ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి నాన్న) కథను అందించారు. ఇందులో `సిసింద్రీ చిట్టిబాబు`గా మాస్టర్ ప్రభాకర్ టైటిల్ రోల్ లో నటించగా.. గుమ్మడి, రాజబాబు, సూర్యకాంతం, అల్లు రామలింగయ్య, రాధాకుమారి, గోకినరామారావు, మాడా ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. నగేశ్, జ్యోతిలక్ష్మీ ఓ ప్రత్యేక గీతంలో చిందులేశారు.
టి. చలపతిరావు బాణీలు కట్టిన ఈ చిత్రానికి దిగ్గజ గీతరచయితలు సి.నారాయణరెడ్డి, కొసరాజు సాహిత్యమందించారు. ``వస్తా వెళ్ళొస్తా..``, ``బొమ్మలోయ్ బొమ్మలు``, ``ఓహో ఓహో జాంబియా``, ``ముల్లు గుచ్చుకుంది బావా`` అంటూ మొదలయ్యే ఇందులోని పాటలు రంజింపజేశాయి. రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మించిన `సిసింద్రీ చిట్టిబాబు`.. 1971 జూన్ 18న విడుదలై విజయపథంలో పయనించింది. కాగా, నేటితో ఈ చిత్రం 51 వసంతాలను పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



