'కృష్ణావతారం'తో కృష్ణ అలరించి నేటికి 40 ఏళ్లు
on Sep 22, 2022
![]()
స్టార్ హీరోగా కృష్ణ తిరుగులేని స్థితిలో ఉన్న కాలంలో వచ్చిన సినిమా 'కృష్ణావతారం'. బాపు దర్శకత్వంలో ఆయన నటించిన రెండో సినిమా ఇది. దర్శకునిగా బాపు తొలి చిత్రం 'సాక్షి'లో కథానాయకుడు కృష్ణ అనే విషయం తెలిసిందే. ఆ మూవీ వచ్చిన పదిహేనేళ్లకు కానీ ఆ ఇద్దరూ మళ్లీ కలిసి పనిచేసే అవకాశం రాలేదు. తమిళ సినిమా 'రాజాంగమ్' ఆధారంగా ఈ మూవీని బాపు తీశారు. ఇది ఒక కుటుంబంలో జరిగే క్రైమ్ స్టోరీ. అయినా ఆద్యంతం ఆసక్తికరంగా ఉండేలా స్క్రీన్‌ప్లే అల్లారు రచయిత ముళ్లపూడి వెంకటరమణ.
బాపు-రమణ ద్వయం కెరీర్ పరంగా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా కోసం వారికి డేట్స్ ఇచ్చి, సినిమా చేసి తిరిగి వారు నిలదొక్కుకోడానికి కారకురలయ్యారు కృష్ణ. అన్యాయాలను ఎదిరిస్తూ రౌడీగా పేరుపడిని ఓ యువకుని కథగా, కృష్ణ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా తీశారు బాపు. తన సినిమా విడుదలైన తొలిరోజు థియేటర్‌కు వెళ్లి చూసే అలవాటు బాపుకు లేదు. తొలిసారిగా ఈ సినిమాని తొలిరోజు థియేటర్‌కు వెళ్లి చూశారాయన. సినిమాలో ఓ పాత్ర కృష్ణను "ఒరే వెధవా" అని తిట్టగానే, థియేటర్ అంతా గోల గోల. సినిమాల్లోనూ కృష్ణను ఎవరైనా తిడితే ఆయన అభిమానులు సహించేవాళ్లు కాదు. కృష్ణ ఇమేజ్ ఏ రీతిలో ఉందో చూసి ఆశ్చర్యపోయారు బాపు. ఈ మూవీలో కృష్ణ చెప్పిన ప్రతి డైలాగూ పేలింది. ఆయన డైలాగ్ చెప్తుండే జనం ఈలలతో కేరింతలు కొట్టారు.
కృష్ణ జోడీగా ఈ సినిమాలో శ్రీదేవి నటించారు. ఇందులో ఆమెది కథలో అంత ప్రాధాన్యం లేని పాత్ర. టీ కొట్టు నడుపుకొనే అమ్మాయిగా ఆమె కనిపిస్తారు. కృష్ణ సూచనతోనే ఆమెను హీరోయిన్‌గా తీసుకున్నారు బాపు. పాటల్లో మెరవడం మినహా ఆమెకు టాకీ సీన్లు చాలా తక్కువ. ఇందులో విజయశాంతి కూడా ఉన్నారు. ఆమెది కథకు కీలకమైన పాత్ర. బాపు దర్శకత్వంలో నటించడం ఆమెకు ఇదే తొలిసారి. అక్క భర్త వల్ల గర్భవతి అయ్యి, చివరలో ప్రాణత్యాగం చేసే ఆ పాత్ర ప్రేక్షకుల సానుభూతిని పొందింది.
![]()
కె.వి. మహదేవన్ సంగీతం సమకూర్చిన 'కొండగోగు చెట్టుకింద', 'మేలుకో రాధా కృష్ణా', 'ఇంట్లో ఈగల మోత', 'సిన్నారి నవ్వు సిట్టి తామరపువ్వు' పాటలు సంగీత ప్రియులను అలరించాయి. సి. నారాయణరెడ్డి, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ సాహిత్యం అందించారు.
శ్రీధర్, రమణమూర్తి, ప్రసాద్‌బాబు, పి.ఆర్. వరలక్ష్మి, కె. విజయ, విజయ సుమిత్ర ఇతర ముఖ్య పాత్రధారులైన ఈ చిత్రంలో కాంతారావు, అల్లు రామలింగయ్య, రాళ్లపల్లి అతిథి పాత్రల్లో కనిపించారు. సరిగ్గా 40 ఏళ్ల క్రితం 1982 సెప్టెంబర్ 22న విడుదలైన 'కృష్ణావతారం' చిత్రం నిర్మాత ముళ్లపూడి వెంకటరమణకు ఆర్థికంగా లాభాలు తెచ్చిపెట్టింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



