కమల్-శ్రీదేవి క్లాసిక్ 'వసంత కోకిల'కు 40 వసంతాలు!
on Oct 14, 2022

దేశం గర్విచదగ్గ దర్శకుల్లో ఒకరైన బాలూ మహేంద్ర రూపొందించిన మహాగొప్ప చిత్రాల్లో ఒకటి.. తమిళంలో వచ్చిన 'మూండ్రమ్ పిరై' (1982). కమల్ హాసన్, శ్రీదేవి.. ఇద్దరి కెరీర్లలోని అపూర్వమైన పాత్రల్లో ఈ చిత్రంలో వారు చేసిన పాత్రలు ఉంటాయనేది నిస్సందేహం. కమల్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అతని పాత్ర సాధించిపెట్టింది. ఈ సినిమా తెలుగులో 'వసంత కోకిల' పేరుతో వచ్చి, ఇక్కడ కూడా ప్రేక్షకుల హృదయాలను తడి చేసింది. హృదయాలను పిండివేసే సన్నివేశాలు, అపురూపమైన అభినయాలు, అలరించే అల్లరి చేష్టలు, గిలిగింతలు పెట్టే రొమాన్స్.. లాంటి అంశాలున్న 'వసంత కోకిల' మన ముందుకు వచ్చి నాలుగు దశాబ్దాల కాలమైనా ఇప్పటికీ నిత్యనూతనంగా మన కళ్లముందు మెదులుతూనే ఉంది.
ఈ సినిమా కథనోసారి అవలోకనం చేసుకుంటే.. లక్ష్మి (శ్రీదేవి) ఆధునిక భావాలు కల యువతి. ఒకసారి కారు నడుపుతూ, యాక్సిడెంట్‌కు లోనై హాస్పిటల్‌లో అపస్మారక స్థితిలోకి వెళ్తుంది. కొద్దిరోజులకు తన గత జీవితాన్ని మరిచిపోయి చిన్నపాప మాదిరిగా ప్రవర్తిస్తుంటుంది. ఒకరోజు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి, ఒక వ్యభిచార గృహానికి చేరుతుంది. ఒంటరివాడైన శ్రీను (కమల్ హాసన్) అనే ఒక ఉపాధ్యాయుడు ఆమెను కాపాడి ఆశ్రయమిస్తాడు. ఆమెకు విజ్జీ అనే పేరు పెడతాడు. ఆమె రాకతో అతని జీవితం కొత్త చిగుళ్లు వేస్తుంది. కొద్దికాలంలోనే ఇద్దరూ సన్నిహితమవుతారు. ఒకసారి విజ్జీని ఒకడు తీసుకుపోయి బలవంతం చేయబోతే, తప్పించుకుంటుంది. ఆ సంగతి తెలియగానే విపరీతమైన ఆవేశంతో అతడిని చితగ్గొడతాడు శ్రీను. ఈ విషయాలేవీ తెలీని పోలీసులు లక్ష్మి కోసం వెతుకుతుంటారు. కొద్దికాలానికి విజ్జీకి గతం గుర్తుకువస్తుంది. తనను వెతుక్కుంటూ వచ్చిన తల్లితండ్రులతో పాటు బయలుదేరిపోతుంది. పరుగెత్తుకొని వచ్చిన శ్రీను.. రైలులో లక్ష్మిని చూసి పిలుస్తాడు. ఆమె అతడిని గుర్తుపట్టదు. తనెవరో ఆమెకు తెలియజెయ్యాలని అతను పడే వేదన వేదన వర్ణణాతీతం. తామిద్దరం కలిసి గడిపిన రోజులను గుర్తు చేయాలని అతను చేసే ప్రయత్నాలన్నీ విఫలమౌతాయి. లక్ష్మి వెళ్లిపోతుంది. శ్రీను మళ్లీ ఒంటరివాడైపోతాడు.
సిల్క్ ప్మిత, వై.జి. మహేంద్రన్, జె.వి. రమణమూర్తి కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం, బాలూమహేంద్ర స్వీయ ఛాయాగ్రహణం పెద్ద బలాలు. సన్నివేశాల్లోని మూడ్‌ను ఎలివేట్ చేయడానికి ఇళయరాజా ఇచ్చిన నేపథ్య సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఆయన స్వరపరిచిన పాటలన్నీ సూపర్ హిట్టే. 'కథగా కల్పనగా', 'ఈలోకం అతి పచ్చన', 'మన యవ్వనం మరిరాదనీ', 'ఊరించే వయసిదీ' పాటలు జనం నోళ్లలో బాగా నానాయి. వీటిని మైలవరపు గోపి రాశారు. లక్ష్మీ ఫిలిమ్స్ బ్యానర్‌పై నరసింహారావు తెలుగులో అనువదించిన 'వసంత కోకిల' 40 ఏళ్ల క్రితం ఇదే తేదీన అంటే.. 1982 అక్టోబర్ 14న విడుదలై ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందింది. ఇదే సినిమాని తర్వాత కమల్, శ్రీదేవి, సిల్క్ స్మిత తోటే 'సద్మా' (1983) టైటిల్‌తో హిందీలో రీమేక్ చేశారు బాలూ మహేంద్ర.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



