చిరంజీవి `విజేత`గా నిలిచి నేటికి 36 ఏళ్ళు!
on Oct 23, 2021
చెల్లెలి పెళ్ళి కోసం కిడ్నీ అమ్మే ఓ త్యాగమూర్తి అయిన అన్న కథ.. `విజేత`. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించగా.. అగ్ర దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి రూపొందించారు. హిందీ చిత్రం `సాహెబ్` (అనిల్ కపూర్, అమృతా సింగ్) ఆధారంగా తెరకెక్కిన `విజేత`లో చిరంజీవికి జంటగా భానుప్రియ నటించగా.. శారద, జేవీ సోమయాజులు, జంధ్యాల, నూతన్ ప్రసాద్, రంగనాథ్, గిరిబాబు, శ్రీలక్ష్మి, అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ, పీజే శర్మ, చిడతల అప్పారావు ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాలనటుడిగా దర్శనమిచ్చారు.చక్రవర్తి సంగీతసారథ్యంలో రూపొందిన పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. మరీముఖ్యంగా.. ``ఎంత ఎదిగిపోయావయ్యా`` (ఎస్పీ బాలసుబ్రమణ్యం), ``నీ మీద`` (ఎస్. జానకి) గీతాలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. చిరంజీవికి `ఉత్తమ నటుడు`గా `ఫిల్మ్ ఫేర్` అవార్డ్ ని అందించిన `విజేత`.. తమిళంలో `ధర్మ ప్రభు` పేరుతో అనువాదమై అక్కడివారిని అలరించింది. 1985 అక్టోబర్ 23న విడుదలై జననీరాజనాలు అందుకున్న `విజేత`.. నేటితో 36 వసంతాలు పూర్తిచేసుకుంది.