`మువ్వగోపాలుడు`గా బాలయ్య మురిపించి 35 ఏళ్ళు!
on Jun 18, 2022

నటసింహం నందమూరి బాలకృష్ణకి గ్రామీణ నేపథ్య చిత్రాలు భలేగా అచ్చొచ్చాయి. వాటిలో `మువ్వగోపాలుడు` ఒకటి. `మంగమ్మ గారి మనవడు` (1984), `ముద్దుల కృష్ణయ్య` (1986) వంటి ఘనవిజయాల తరువాత బాలయ్య - శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ - `భార్గవ ఆర్ట్ ప్రొడక్షన్స్` సంస్థ అధినేత ఎస్. గోపాల్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ.. వారిని `హ్యాట్రిక్ కాంబో`గా నిలిపింది.
ఇందులో అమాయకుడైన పల్లెటూరి యువకుడు మువ్వ గోపాల కృష్ణ ప్రసాద్ (గోపి)గా బాలయ్య కనిపించగా.. తనని ఆరాధించే నిర్మల అనే యువతిగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి దర్శనమిచ్చారు. ఇక కథానాయకుడి మేనకోడలి పాత్రలో శోభన సందడి చేయగా.. జయచిత్ర, రావుగోపాలరావు, గొల్లపూడి మారుతిరావు, సత్యవతి, వై.విజయ, కల్పనా రాయ్ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. తమిళ చిత్రం `అరువదై నాళ్` (ప్రభు, పల్లవి) ఆధారంగా రూపొందిన ఈ ఫ్యామిలీ డ్రామాకి గణేశ్ పాత్రో అందించిన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
దిగ్గజ స్వరకర్త కేవీ మహదేవన్ సంగీత సారథ్యంలో రూపొందిన పాటలకు ప్రముఖ గీతరచయిత సి. నారాయణరెడ్డి సాహిత్యమందించారు. ``అందగాడా``, ``వేగు చుక్క``, ``ముత్యాల చెమ్మచెక్కలు``, ``యే గుమ్మా`` అంటూ మొదలయ్యే ఇందులోని పాటలు విశేషాదరణ పొందాయి. 1987 జూన్ 19న విడుదలై ఘనవిజయం సాధించిన `మువ్వగోపాలుడు`.. ఆదివారంతో 35 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



