`బ్రహ్మపుత్రుడు`గా వెంకీ అలరించి 34 ఏళ్ళు!
on Jul 1, 2022

కెరీర్ ఆరంభంలో విక్టరీ వెంకటేశ్ కి దక్కిన ఘనవిజయాల్లో `బ్రహ్మపుత్రుడు` ఒకటి. దర్శకరత్న దాసరి నారాయణ రావు రూపొందించిన ఈ చిత్రంలో టైటిల్ రోల్ లో ఆకట్టుకున్నారు వెంకీ. అలాగే `ఉత్తమ నటుడు`గా `ఫిల్మ్ ఫేర్` అవార్డు అందుకున్నారు. తమిళ సినిమా `మైఖేల్ రాజ్` (రఘువరన్, మాధురి, శరత్ బాబు, బేబి షాలిని)కి రీమేక్ గా రూపొందిన `బ్రహ్మపుత్రుడు`లో వెంకటేశ్ సరసన రజిని నటించగా జయసుధ, మోహన్ బాబు, శ్రీవిద్య, బేబి షాలిని, ప్రభ, నూతన్ ప్రసాద్, అల్లు రామలింగయ్య, నగేశ్, వేలు, బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి, వై. విజయ, జయమాలిని ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
కథాంశం విషయానికి వస్తే.. తల్లి ఎవరో, తండ్రి ఎవరో తెలియనివాణ్ణి `బ్రహ్మపుత్రుడు` అని పిలుస్తుంటారు. అలాంటి ఓ యువకుడి కథతో తెరకెక్కిన ఎమోషనల్ యాక్షన్ డ్రామానే ఈ చిత్రం. దాసరి నారాయణరావు స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చిన ఈ సినిమాకి పి.యస్. ప్రకాశ్ ఛాయాగ్రహణం అందించారు.
చక్రవర్తి స్వరాలు సమకూర్చిన `బ్రహ్మపుత్రుడు`కి వేటూరి సుందరరామ్మూర్తి, దాసరి సాహిత్యమందించారు. ``నీయబ్బ``, ``అయ్య బాబోయ్``, ``సన్నాజాజి చెట్టు కింద``, ``అమ్మాయి ముక్కు``, ``అమ్మ తోడు`.. ఇలా ఇందులోని పాటలన్నీ అలరించాయి. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించిన `బ్రహ్మపుత్రుడు`.. 1988 జూలై 1న విడుదలైంది. నేటితో ఈ బ్లాక్ బస్టర్ మూవీ 34 వసంతాలను పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



