34 వసంతాల `స్వర్ణ కమలం`.. అద్భుతః అనిపించిన భానుప్రియ అభినయం!
on Jul 15, 2022

కనువిందైన నృత్యాలకు, అద్భుత అభినయానికి పెట్టింది పేరు.. అభినేత్రి భానుప్రియ. అలాంటి భానుప్రియలోని నర్తకిని, నటీమణిని పూర్తి స్థాయిలో ఆవిష్కరించిన చిత్రం.. `స్వర్ణ కమలం`. కళా తపస్వి కె. విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ సంగీత, నృత్య ప్రధాన చిత్రంలో మీనాక్షిగా భానుప్రియ కనపరిచిన నటనకి గానూ `ఉత్తమ నటి`గా ఇటు `నంది`, అటు `ఫిల్మ్ ఫేర్` అవార్డులు దక్కాయి. అలాగే కథానాయకుడిగా నటించిన విక్టరీ వెంకటేశ్ సైతం `నంది` స్పెషల్ జ్యూరీ సొంతం చేసుకున్నారు. అంతేకాదు.. `ఉత్తమ చిత్రం`గా ఇటు నందిని, అటు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలను అందుకుందీ సినిమా. అదేవిధంగా, అనేక చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది.
షణ్ముఖ శ్రీనివాస్, సాక్షి రంగారావు, డబ్బింగ్ జానకి, దేవీ లలిత, షరోన్ లోయెన్, మిశ్రో, ముచ్చర్ల అరుణ, శ్రీలక్ష్మి, పావలా శ్యామల ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన `స్వర్ణకమలం`కి కె. విశ్వనాథ్ రచన చేయగా, సాయినాథ్ సంభాషణలు సమకూర్చారు.
మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా బాణీలు కట్టిన ఈ చిత్రంలో.. ``ఆకాశంలో ఆశల హరివిల్లు``, ``కొత్తగా రెక్కలొచ్చెనా``, ``ఘల్లు ఘల్లు``, ``శివపూజకు``, ``అందెల రవమిది`` అంటూ మొదలయ్యే పాటలు విశేషాదరణ పొందాయి. ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు సమర్పణలో భాను ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై సి.హెచ్.వి. అప్పారావు నిర్మించిన `స్వర్ణకమలం`.. 1988 జూలై 15న విడుదలై ప్రజాదరణ పొందింది. కాగా, నేటితో ఈ మ్యూజికల్ హిట్ 34 వసంతాలను పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



